Tuesday, April 30, 2024

సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

రేపు ఉ.10.30 గం.కు ఎల్‌బి స్టేడియంలో ప్రమాణస్వీకారం

సిఎల్‌పి నేతగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్ఠానం

ఢిల్లీలో ఖర్గే, రాహుల్‌తో చర్చల అనంతరం సిఎం పేరును ప్రకటించిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్

డికె, ఠాక్రేల నివేదిక ప్రకారమే నిర్ణయం

సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని అభయం

వన్ మ్యాన్ షో ఉండదని హామీ

అధిష్ఠానం పిలుపుతో ప్రత్యేక విమానంలో సాయంత్రం ఢిల్లీకి బయల్దేరిన పిసిసి చీఫ్

హస్తినలో అధికారికంగా స్వాగతం పలికిన అధికారులు… కాన్వాయ్ ఏర్పాటు

ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతికుమారి.. పాల్గొన్న డిజిపి రవిగుప్తా,
ఇతర ఉన్నతాధికారులు

కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డిని ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకొంది. దీంతో గడచిన రెండురోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి.వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సిఎంగా రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడిగా నియమిస్తూ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నారని ఆయన చెప్పారు. ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమార్‌లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగిందని వివరించారు. రేవంత్‌రెడ్డి ఎంతో డైనమిక్ లీడర్ అని, పిసిసి అధ్యక్షుడిగా చేసిన కృషి అభినందనీయమని, ఆయన పాలనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను అధిష్టానం తీసుకొంటుందని మరోసారి స్పష్టంచేశారు. అంతేగాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంద ని, సీనియర్ల సలహాలు, సూచనలను రేవంత్‌రెడ్డి స్వీకరిస్తార ని కెసి వేణుగోపాల్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వన్ మ్యాన్ షో ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సిఎల్ పి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి మూడు రకాల తీర్మానాలు చేశారని, ఆ తీర్మానాల్లో అత్యంత ప్రధానమైనది ముఖ్యమంత్రిగా ఎవ్వరిని నియమించాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎంఎల్‌ఎలంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశారని, రెండోది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజలకు సిఎల్‌పి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారని, మూడో తీర్మానంలో తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో విశేషంగా పాల్గొన్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇతర అధిష్టానం పెద్దలకు సిఎల్‌పి సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారని వేణుగోపాల్ చెప్పారు.
అధిష్ఠానం పెద్దలకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు
తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అధిష్ఠానానికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను సిఎల్‌పి నేతగా ఎన్నుకున్నందుకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి సోనియమ్మ, స్ఫూర్తిదాయమమైన నేత రాహుల్ గాంధీ, ప్రజాకర్షక నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు, కాంగ్రెస్ సైనికులు, పార్టీ ఎంఎల్‌ఎలు, ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను స్వయంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఇదిలా ఉండగా రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
రెండు రోజుల ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎవ్వరిని నియమిస్తుందో… అనే టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపశమనం కలిగించే విధంగా రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనాయకులు బస చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్‌రెడ్డి గత 48 గంటలుగా ఆ స్టార్ హోటల్‌లోనే ఉంటూ పరిస్థితులను సమీక్షించారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేయడానికి సమాలోచనలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెండు రోజుల పాటు సమయం తీసుకోవడంతో కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళనకు లోనయ్యారు. పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌కు అడ్డుతగులుతున్నారనే ఉద్దేశ్ంయతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి అభిమానులు ఆ హోటల్ వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగారు. రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిని చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడే పోలీసులు ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకొన్నారు.
ఉత్కంఠకు తెర దించిన రాహుల్ గాంధీ
అంతకుముందు మధ్యాహ్నం ఖర్గే నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సిఎంగా రేవంత్ పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా సూచించారని తెలిసింది. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, కెసి.వేణుగోపాల్, కర్నాటక డిప్యూటీ సిఎం డికె.శివకుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. సిఎం రేసులో ఉన్న అభ్యర్థులపై ఈ సమావేశంసుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలోనే డికె శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రేలు ఇచ్చిన నివేదికపై చర్చించి రేవంత్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అదే సమయంలో అధిష్ఠానం పెద్దలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడా చర్చించి, వారి నుంచి రేవంత్‌రెడ్డి సిఎం అభ్యర్థ్ధిత్వానికి మద్దతును కూడగట్టడంలో అధిష్ఠానం పెద్దలు సఫలీకృతులయ్యారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు వివరించారు. ఇదిలాఉండగా తాను కూడా ముఖ్యమంత్రి పదవి ఉన్నానని, తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని అధిష్ఠానం పెద్దలను, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరినట్లుగా సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. అయితే అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవికి ఎవ్వరిని ఎంపిక చేసినా తాను సంపూర్ణంగా సహకరిస్తానని ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుందాగా మీడియా ప్రతినిధులకు వివరించారు. అదే విధంగా ఢిల్లీలోనే మరోనేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి తాను మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 64 మంది ఎంఎల్‌ఎలకూ అర్హత ఉందన్నారు. కాగా అధిష్ఠానం పెద్దలు మల్లు భట్టి విక్రమార్కతో కూడా చర్చలు జరిపారు. ఆయన నుంచి కూడా ఆమోదముద్ర పొందారని, భవిష్యత్తులో ఎలాంటి అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అన్నిదారులూ మూసివేసి రేవంత్‌రెడ్డికి ఇబ్బందుల్లేకుండా చేసిన తర్వాతనే మంగళవారం సాయంత్రానికి అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా, నూతన సిఎల్‌పి నేతగా రేవంత్‌ను ప్రకటించారని ఆ నాయకులు వివరించారు. మల్లు భట్టి విక్రమార్క కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేనని, తనకూ అన్ని అర్హతలున్నాయని, తాను పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పుకొన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం పెద్దలు ఏ నిర్ణయం తీసుకొన్నా, ఎవ్వరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినా తాను మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. ఇలాంటి సిఎం సీటును ఆశించిన నేతలందర్నీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడి, సముదాయించి, అందరి నుంచి ఏకగ్రీవ ఆమోదం పొందిన తర్వాతనే ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కెసి వేణుగోపాల్ మీడియా సమావేశంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు నూతన సిఎల్‌పి నేత (ముఖ్యమంత్రి)గా రేవంత్‌రెడ్డిని పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలోనే కెసి వేణుగోపాల్‌తో పాటుగా డికె శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రేలతో పాటుగా సిఎం పదవిని ఆశించిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలను కూడా కూర్చోబెట్టుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించి సిఎం పదవికి ఏకాభిప్రాయాన్ని సాధించామని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పకనే చెప్పిందని ఆ నాయకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News