Saturday, July 27, 2024

కాంగ్రెస్‌లో కలవరం

- Advertisement -
- Advertisement -

రాయబరేలి అయినా కాంగ్రెస్‌కు మిగిలేనా?

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పలువురు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం కాంగ్రెస్‌కు బెంబేలు పుట్టిస్తోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి నష్టం వాటిల్లనప్పటికీ రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని కాంగ్రెస్ కలవరం చెందుతోంది. రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు లేదా ఓటింగ్‌లో పాల్గొనని ముగ్గురు ఎస్‌పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు కంచుకోటగా పరిగణించే రాయబరేలి, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండడమే కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న ఆందోళనకు కారణంగా తెలుస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎసమాజ్‌వాది పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న మనోజ్ పాండే రాజ్యసభ ఎన్నికలకు కొద్ది నిమిషాల ముందు పార్టీకి రాజీనామా చేసి బిజెపి అభ్యర్థులకు తన మద్దతును ప్రకటించారు. ప్రముఖ బ్రాహ్మణ నాయకుడైన మనోజ్ పాండే రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఉంఛహర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాండే బిజెపిలోకి ఫిరాయించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక కంచుకోటకు కూడా బీటలు వార్చే పథకంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం రాయబరేలి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను రాయబరేలి నుంచి పోటీ చేయనని, తన కుటుంబంలో నుంచి ఒకరు పోటీ చేస్తారని ప్రకటించిన ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ స్థానాన్ని కూడా దక్కించుకోవడానికి బిజెపి పథక రచన చేస్తోంది. ఇప్పటికే అదితి సింగ్, దినేష్ ప్రతాప్ సింగ్ వంటి పలువురు ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిపోయారు. తాజాగా పాండే కూడా కాషాయ కండువా కప్పుకోవడం లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి లసివచ్చే పరిణామంగా మారనున్నంది.

కాగా..రాజ్యసభ ఎన్నికలలో బిజెపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఎస్‌పి ఎమ్మెల్యేలలో ఒకరైన రాకేష్ ప్రతాప్ సింగ్ అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగ్ తమ పార్టీలోకి రావడం వల్ల అమేథీలో బిజెపి మరింత బలపడే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమెథీ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థిని స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని తిరిగి పొందకుండా చేయడమే బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. కాగా..రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్న మరో ఎస్‌పి ఎమ్మెల్యే మహారాజీ దేవి గతంలో అమేథీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. కుంహర్ సామాజిక వర్గానికి చెందిన ఆమె కూడా సమీప భవిష్యత్తులో బిజెపిలో చేరవచ్చని వూహాగానాలు సాగుతున్నాయి. ఇలా ఉండగా లోక్‌సభ ఎన్నికల కోసం కుదిరిన సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా అమేథీ, రాయబరేలి స్థానాలను కాంగ్రెస్‌కు ఎస్‌పి కేటాయించింది.

రాయబరేలి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలి స్థానం ఒక్కటే కాంగ్రెస్ ఖాతాలో పడింది. 2004 నుంచి వరుసగా ఈ స్థానంలో సోనియా గాంధీ గెలుస్తూ వస్తున్నప్పటికీ ఆమె సాధించిన మెజారిటీ ఓట్లు మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె రాయబరేలి ప్రజలకు భావోద్వేగంతో రాసిన లేఖలో ఈ స్థానంలో తాను ఇకపై పోటీ చేయనప్పటికీ తన కుటుంబానికి చెందిన వ్యక్తులకు మాత్రం మద్దతు కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ నిష్కృమణతో కాంగ్రెస్ చివరి కంచుకోట రాయబరేలిని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని బిజెపి ఉవ్విళ్లూరుతూ ఆ దిశగా పావులు కదుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News