Monday, October 14, 2024

అబధ్దపు హామీలే కాంగ్రెస్ రాజకీయాలు పరిమితం

- Advertisement -
- Advertisement -

హర్యానా సభలో మోడీ ఆరోపణ

పాల్వాల్(హర్యానా): కాంగ్రెస్ రాజకీయాలు అబద్ధపు వాగ్దానాలకే పరిమితమని, కాని బిజెపి రాజకీయాలు కష్టపడి పనిచేసి ఫలితాన్ని సాధించడంతో కూడుకున్నవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పాల్వాల్‌లో మంగళవారం జరిగిన తన చివరి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో వరుసగా మూడవసారి బిజెపి అధికారంలోకి రానున్నదని ధీమా వ్యక్తం చేశారు. తమను ఆశీర్వదించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీరులో జరుగుతున్న చివరి విడత పోలింగ్‌లో అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

ప్రతి గ్రామంలో బిజెపి ప్రభంజనం కనపడుతోందని, ప్రతి చోట భరోసా దిల్ సే..బిజెపి ఫిర్‌సే అని ముక్తకంఠంతో వినపడుతోందని మోడీ తెలిపారు. కాంగ్రెస్‌కు కష్టపడే అలవాటు లేదని, పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నాము కాబట్టి హర్యానా ప్రజలు తమకు బంగారు పళ్లెంతో అధికారాన్ని అప్పగిస్తారని కాంగ్రెస్ కలలు కంటోందని ఆయన వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్‌లో కూడా ఇదే కరమైన భావనతో కాంగ్రెస్ ఉందని, ముందుగానే విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారని, కాని ఓటింగ్ రోజున ప్రజలు ఆ పార్టీకి పగలే చుక్కలు చూపించారని ప్రధాని ఎద్దేవా చేశారు. హర్యానాకు పొరుగున ఉన్న రాజస్థాన్‌లో కూడా బిజెపికి వ్యతిరేకంగా రైతులు, యువతను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పెద్ద ప్రయత్నమే చేసిందని, కాని చివరకు కాంగ్రెస్ బొక్కబోర్లాపడిందని ఆయన చెప్పారు. హర్యానాలో కూడా కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెడతారని, ఇక్కడ కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పోరును ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. పవిత్రమైన భగవద్గీతను మనకు అందచేసిన హర్యానా కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా బోధించిందని, కాని తాను పనిచేయకపోవడమే కాక ఇతరులను కూడా పనిచేయనివ్వకపోవడం కాంగ్రెస్ తత్వమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే ఉండడం హర్యానాలో ఆనవాయితీగా వస్తోందని, ఢిల్లీలో మూడవసారి బిజెపిని అధికారంలోకి తెచ్చిన హర్యానా ప్రజలు ఇక్కడ కూడా మూడవసారి బిజెపిని అధికారంలోకి తెస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News