Tuesday, October 15, 2024

హర్యానా పదేండ్ల పీడ వదిలిస్తాం:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హర్యానాను పట్టుకున్న పదేండ్ల పీడకు తమ పార్టీ ముగింపు పలుకుతుందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ శనివారం చెప్పారు. అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సమగ్ర మేనిఫెస్టోను వెలువరించింది. ఈ క్రమంలో రాహుల్ దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడారు. హర్యానాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. దశాబ్దపు బిజెపి పాలన నుంచి ఇక రాష్ట్రానికి విముక్తి దక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమ పార్టీపై పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు రంగం సిద్ధమైందని రాహుల్ ప్రకటించారు. ఇన్నేళ్ల పాలనలో బిజెపి హర్యానా సౌభాగ్యాన్ని, కలలను, శక్తిని హరించి వేసిందని రాహుల్ చెప్పారు. హర్యానా యువత దేశ భక్తి అపారమైనది, సైన్యంలో ఇక్కడి వారే ఎక్కువ. అయితే కేంద్ర ప్రబుత్వం అడ్డగోలుగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ స్కీంతో యువత ఉద్యోగవకాశాలకు గండికొట్టినట్లు అయిందని రాహుల్ సామాజిక మాధ్యమంలో హిందీలో వ్యాఖ్యానించారు.

నిరుద్యోగం ఇక్కడి కుటుంబాల నవ్వులను మటుమాయం చేసేసింది. ఇక ద్రవ్యోల్బణం మహిళల స్వయం సమృద్థిని హరించివేసిందని రాహుల్ విమర్శించారు. ఇక కరకు చట్టాలు తీసుకువచ్చి , రైతుల న్యాయమైన హక్కులను లాగేశారు. పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జిఎస్‌టితో లక్షలాది మంది చిరువ్యాపారుల పొట్ట కొట్టారని ఆరోపించారు. బిజెపి ఎంపిక చేసుకున్న కొద్ది మంది స్నేహితుల ప్రయోజనాల కోసం చివరికి హర్యానా ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీశారని రాహుల్ స్పందించారు. ఇంతకాలం హర్యానా ప్రజలను ఆడిపోసుకున్న బిజెపి పాలన నుంచి ఇక రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తిని కల్పిస్తుందని ప్రకటించారు. హర్యానా ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పలు కీలక వాగ్దానాలు చేసింది. రైతుల సంక్షేమానికి కమిషన్ ఏర్పాటు, అమరజవాన్ల కుటుంబాలకు రూ 2 కోట్ల సాయం , హర్యానా మైనార్టీ కమిషన్ పునరుద్ధరణ, కార్మికులకు ఉపాధి కల్పించే పనులకు ప్రాధాన్యత వంటివి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయి.

ఇక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో హర్యానా పిసిసి అధ్యక్షులు ఉదయ్ భాన్, ప్రతిపక్ష నేత భూపీందర్ సింగ్ హూడా, రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లోట్ ఇతరులు ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన జరుగుతాయి. ఫలితాలు 8 వ తేదీన వెలువడుతాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News