Friday, March 29, 2024

కాంగ్రెస్ లేకుండానే కమలంతో ఫైట్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా/న్యూఢిల్లీ: కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటించాలని దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బిజూజనతాదళ్‌లు తమది థర్డ్‌ఫ్రంట్ కానీ, కాంగ్రెసేతర బిజెపియేతర విపక్ష కలయిక అని శుక్రవారం సూచనప్రాయంగా తెలిపాయి. దీనితో వచ్చే ఏడాది జరిగే లోక్‌స భ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయి లో కీలక రాజకీయ మలుపు అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తనకు తాను ప్రతిపక్షాలకు బిగ్‌బాస్‌గా భావించుకోరాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బందోపాధ్యాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కోల్‌కతాలో టిఎంసి అధినేత్రి , ముఖ్యమంత్రి మమత బెనర్జీ నివాసంలో సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆమెను కలుసుకుని కీలక చర్చలు జరిపిన తరువాత టిఎంసి ఎంపి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను తాము విశ్వసించలేమని తెలిపిన సుదీప్ తమకు బిజెపి ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతేదూరమని , ఈ విధానాన్ని టిఎంసి, ఎస్‌పి, బిజెడిలు పాటించుతాయని స్పష్టం చేశారు. ఇప్పుడు తమ అధినేత్రి మమత బెనర్జీ సమాజ్‌వాది పార్టీనేతతో చర్చించారని, వచ్చేవారం మమత ఒడిషా సిఎం, బిజెడి నేత నవీన్ పట్నాయక్‌నూ కలుసుకుంటారని తెలిపారు.

రాబోయే రోజులలో బలీయమైన ప్రాంతీయ పార్టీలతో తమ పార్టీ నేతలు కీలక చర్చలు జరుపుతారని టిఎంసి ఎంపి చెప్పారు. తద్వారా కాంగ్రెస్ లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో బలీయంగా తలపడేందుకు వ్యూహం ఖరారుకు వీలేర్పడుతుందన్నారు. ఇప్పుడు తమ పార్టీ నేత నివాసంలో జరిగిన చర్చలు ఈ దిశలో కీలక ముందడుగు అవుతాయని వివరించారు. తమది థర్ట్‌ఫ్రంట్ దిశలో ఆలోచన కాదని తెలిపిన ఆయన తమది బలోపేత ప్రాంతీయ పార్టీల ప్రత్యామ్నాయ వేదిక అవుతుందని సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పుడు బిజెపి కావాలనే రాహుల్ గాంధీని విపక్ష ప్రధాన కేంద్ర బిందువుగా చేయాలని చూస్తోందని, అందుకే చివరికి ఆయనకు అనవసర ప్రాధాన్యత కల్పిస్తోందని టిఎంసి అభిప్రాయపడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షం తరఫున రాహుల్ గాంధీని ప్రధాని పదవికి అభ్యర్థిగా చిత్రీకరించడం ద్వారా తనను తాను బలోపేతం చేసుకోవాలని బిజెపి ఆలోచిస్తోందని సుదీప్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాలలో ఏదో మాట్లాడారని, ఇందుకు క్షమాపణ చెపితే కానీ చివరికి పార్లమెంట్‌ను కూడా సాగనిచ్చేది లేదని బిజెపి చెప్పడం విచిత్రంగా ఉందని , ప్రధాన విపక్షం కాంగ్రెస్ అయితే వారికి కలిసివస్తుందనేది బిజెపి ఆలోచనగా ఉందని టిఎంసి నేత చెప్పారు. విపక్షాలకు కాంగ్రెస్ పెద్దన్న అనుకోవడం భ్రమే అవుతుందని టిఎంసి ఎంపి తెలిపారు.

23న నవీన్‌తో మమత భేటీ

తమ నాయకురాలు మమత బెనర్జీ ఈ నెల 23న ఒడిషాలో నవీన్ పట్నాయక్‌ను కలుస్తారని , కాంగ్రెస్, బిజెపిలకు సమాన దూరం సూత్రంపై చర్చిస్తారని టిఎంసి ఎంపి వివరించారు. ఇతర విపక్ష నేతలతోనూ దీనిపై మాట్లాడుతారని తెలిపారు. బిజెపితో తలపడే శక్తి ప్రాంతీయపార్టీలకే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము బిజెపి, కాంగ్రెస్‌ల పట్ల సమానభావంతో ఉన్నామని ఎస్‌పి నేత యాదవ్ చెప్పారని సుదీప్ వివరించారు. బెంగాల్‌లో తాము మమతదీదీతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పినట్లు , ఇతర చోట్ల కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కొనే శక్తులకు సహకరించనున్నట్లు తెలిపారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News