Monday, May 12, 2025

రుణభారంతో రణ కుతంత్రమా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే పీకల లోతు అప్పుల్లో (indebt)కూరుకుపోయిన పాకిస్థాన్ మన దేశంతో యుద్ధానికి కాలుదువ్వుతుండడం ఏమాత్రం ప్రయోజనం కలిగించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్గతంగా బలూచిస్థాన్ తిరుగుబాటు సంఘర్షణలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా నివారించలేని నిస్సహాయ స్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు పుండు మీద కారం జల్లినట్టు ఆర్థిక కుంగుబాటు పాక్‌ను పట్టిపీడిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో యుద్ధం సాగించడానికి రణతంత్రం రూపొందించడం చేతకాని తనమే. అనేక నిత్యావసరాల కోసం ఇతర దేశాలపై పాకిస్థాన్ ఆధారపడుతోంది. దివాలా స్థితిలో ఉన్న పాక్‌ను చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌తోపాటు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ  (ఐఎంఎఫ్) లే ఆర్థికంగా ఆదుకొంటూ వస్తున్నాయి.

2024 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పు 131 బిలియన్ డాలర్లు కాగా, మళ్లీ ఇప్పుడు కొత్త రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మోకరిల్లవలసి వచ్చింది. దీంతో ఐఎంఎఫ్ 100 కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్థాన్‌కు మంజూరు చేసింది. పాక్‌కు ఐఎంఎఫ్ అందించే 700 కోట్ల డాలర్ల రుణ ప్యాకేజీలో ఇదో భాగం. ఈ మొత్తం రుణాన్ని మూడేళ్లలో ఐఎంఎఫ్ అందిస్తుంది. రుణవాయిదాల వినియోగాన్ని ఆరు నెలల కోసారి సమీక్షిస్తూ ఏడు వాయిదాల్లో మొత్తం రుణాన్ని అందజేస్తామని ఐఎంఎఫ్ పేర్కొంది. తొలి వాయిదాగా గతంలోనే 100 కోట్ల డాలర్లు అందజేసింది. ఈ రుణం మంజూరు చేస్తే ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకే పాక్ వెచ్చిస్తుందని భారత్ అభ్యంతరం లేవదీసినా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయకతప్పలేదు. దీని వెనుక అగ్రరాజ్యాల సిఫారసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం అందించడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫూంచ్, రాజౌరి, ఉరి వంటి చాలా ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేయడానికి పాక్ దూసుకు వస్తుంటే ఆ దేశానికి ఐఎంఎఫ్ అత్యవసర సాయం ఎలా అందిందని నిలదీస్తున్నారు. ఒక వైపు పాక్‌కు పరోక్షంగా సాయం అందిస్తూ భారత్ పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అంతర్జాతీయ సమాజం ఎలా చెబుతుందో అర్థం కావట్లేదని ఒమర్ విమర్శించడం గమనార్హం. 1958 నుంచి 24 సార్లు పాక్‌కు ఐఎంఎఫ్ రుణం అందింది. అయితే ఈ నిధులను పాక్ సంస్కరణలకు ఖర్చుచేస్తున్న ఉదంతాలు బహు స్వల్పం. తెచ్చుకుంటున్న రుణాలన్నీ తిరిగి పాత రుణాల బకాయిల చెల్లింపులకే సరిపోతోందని పాకిస్థాన్ ఆర్థికవేత్త కైసెర్ బెంగాలీ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది.

ఏ దేశమైనా తాను పొందిన రుణాలను ఆర్థిక బలోపేతం కోసం ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ దీనికి భిన్నంగా పాకిస్థాన్ తన రుణాలను రక్షణ వ్యవస్థకు, ఎదురైన సంఘర్షణలకే వినియోగించడం చేస్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఐపిఆర్‌ఐ) నివేదిక ప్రకారం పాకిస్థాన్ 10 బిలియన్ డాలర్లు లేదా తన జిడిపిలో 2.6 శాతం రక్షణ వ్యవస్థకే 2024లో ఖర్చు పెట్టింది. బయట నుంచి తెచ్చిన రుణం 130 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ ఈ డబ్బంతా ఆర్మీ తన అవసరాలకే ఖర్చు చేస్తోంది. ఇంతటితో ఆగిపోలేదు. రక్షణ వ్యయం మరో 18% పెంచడానికి ఈ ఏడాది ప్రతిపాదించింది. మరో ముఖ్య విషయం పన్నులు వసూలు చేసిన ప్రతి పాకిస్థానీకి రూ. 100 వస్తుండగా, వాణిజ్యం, దిగుమతుల వ్యాపారాలు కేవలం 60 పైసలే చెల్లిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్థాన్ మిలిటరీ జనరల్స్, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుతింటున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉంటున్నాయి.

పాక్‌కు అంతర్జాతీయ రుణ సంస్థలు రుణం ఇవ్వడానికి విముఖత చూపిస్తే తుపాకీలతో చర్చలు సాగిస్తామని బెదిరిస్తూ అణుబ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడడం పరిపాటి అవుతోంది. పాక్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 15 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధానికి అదనంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే పాకిస్థాన్‌కు తలకు మించిన భారం అవుతుంది. పైగా ఆర్థికంగా ఆదుకోవడానికి ఇప్పుడు ఎవరూ ముందుకు వచ్చే పపరిస్థితి కనిపించడం లేదు. భారత్ పాక్ యుద్ధంలో తాము జోక్యం చేసుకోలేమని అమెరికా దూరమైంది. చైనా మాత్రం ఎటూ తేల్చకుండా చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతోంది. అయినా పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులకు పాల్పడుతోంది. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటోంది.

ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. రాజధాని నగరమైన ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోలు బంక్‌లను మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌ను, భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం మరింత కుదేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం మరింత తీవ్రమైతే నిత్యావసరాల కొనుగోలుకు కావలసిన ఆర్థిక వనరులు పాక్ వద్ద ఉండవని ఆందోళన చెందుతున్నారు. పాక్ సరిహద్దుల్లోని సైనికులకు సరైన ఆహారం అందడం లేదు. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్ అయినా పాక్ అయినా సరే రూ. 2.50 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు అంచనాగా చెబుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితి ఎవరికైనా తీరని నష్టమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News