Wednesday, December 6, 2023

హిజాబ్‌కు టోకర్‌మార్

- Advertisement -
- Advertisement -

Controversy erupted in Iran regarding dress hijab

ఇరాన్‌లో నిరసనలు తొమ్మండుగురు మరణం
క్యాంపస్‌లలో చెలరేగుతున్న ఘర్షణలు
ఇంటర్నెట్‌తో ప్రచారంపై స్విచ్ఛాఫ్‌లు

దుబాయ్/టెహ్రాన్ : ఇరాన్‌లో వస్త్రధారణ , హిజాబ్ విషయంలో చెలరేగినవివాదం తరువాత 22 ఏండ్ల యువతి మహస అమిని పోలీసుకస్టడిలో మరణించడంపై నిరసనలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. పలు చోట్ల జరిగిన నిరసనలు భద్రతా బలగాలకు , నిరసనకారులకు మధ్య చెలరేగిన ఘర్షణలలో కనీసం 9 మంది చనిపోయారు . వారాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌లో మహిళ వేషధారణపై నియంత్రణలకు దిగే మోరల్ పోలీసింగ్ విభాగం గత వారం వేరే నగరం నుంచి టెహ్రాన్‌కు వచ్చిన అమిని హిజాబ్ వేసుకోని అంశాన్ని నిలదీయడం, ఇందుకు ఆమె ఎదురుతిరగడం తరువాత ఆమెను పోలీసు జీప్‌లో తీసుకుని పోయిన తరువాత కస్టడీలో మరణించడంతో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు భగ్గుమంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లు, వాట్సాప్‌ల ద్వారా నిరసన జ్వాల మరింత వ్యాప్తి చెందుతున్నదనే కారణంతో అధికారులు వెంటనే వీటిని నిలిపివేశారు.

వ్యక్తుల స్వేచ్ఛను, భావవ్యక్తీకరణను అణచివేసేందుకు ప్రభుత్వం పాశవికంగా వ్యవహరిస్తోందనే విమర్శలు తలెత్తాయి. బయటి ప్రపంచానికి ఎటువంటి సమాచారం లేకుండా ఇంటర్నెట్ కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారని వెల్లడైంది. అమిని మరణం తరువాత గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాలలో యువత నిరసనలు ఉధృతం అయ్యాయి. తమ వేషధారణను కాదంటే ఎవరిని అయినా ఖాతరు చేసేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సవాలు చేశారు. ఇప్పుడు తాము బహిరంగంగా వీధులలోకి వచ్చినప్పుడు ముఖాలకు వస్త్రాలను తొలిగించి వేస్తామని, తమ జుట్టు ఇష్టం వచ్చినట్లుగా అలంకరించుకుంటామని చెపుతూ వీధులలో ప్రదర్శనల దశలో పలువురు యువతులు నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పతనానికి ఇప్పటి తమ నిరసనలు ఆరంభం అని నిరసనకారులు హెచ్చరించారు.

టెహ్రాన్‌లోని యూనివర్శిటీక్యాంపస్‌లు, పలు విద్యాసంస్థల ఆవరణలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ప్రదర్శనలకు దిగి, నియంత చావు తప్పదనే నినాదాలకు దిగుతున్నారని, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. నిరసనకారులుభద్రతా బలగాలతో తలపడిన ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించాయి. అమిని స్వస్థలం కుర్దిస్తాన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు నిరసనకారులు చనిపోయినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. దేశంలోని పారామిలిటరీ బలగాలకు అనుబంధం అయిన ఓ సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను షిరాజ్, తబ్రీజ్, మషాద్ నగరాలలో చంపివేసినట్లు తెలిపారు. ఇరాన్‌లో యువతి పోలీసుల దౌర్జన్యంలో దుర్మరణం చెందారనే వార్తలపై అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐరాస వర్గాలు తీవ్రస్థాయిలో ఖండనలు వెలువరించాయి. అయితే తాము జులుంకు దిగలేదని, కేవలం అదుపులోకితీసుకుని వెళ్లామని, అయితే యువతి బలహీనంగా ఉండటంతో గుండెపోటు వచ్చి మృతి చెందిందని పోలీసు అధికారులు వివరణ ఇస్తున్నారు. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అత్యవసరం అని, నిజాలను అణచిపెట్టరాదని ఐరాస దౌత్య ప్రతినిధులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News