Tuesday, April 30, 2024

విద్యుత్‌ సౌధ జప్తు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న విద్యుత్ సౌధ జప్తుకు వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల కేంద్రంగా ఉన్న జలసౌధకు న్యాయస్థానం జప్తు నోటీసులు జారీ చేసింది.అయితే మంగళవారం నాడు కోర్టు నో టీసులు తీసుకునేందుకు విద్యుత్ శాఖకు చెందిన అధికారులు నిరాకరించటంతో కోర్టు సిబ్బంది విద్యుత్‌ సౌధ గుమ్మానికి జప్తు నోటీసులు అతికించి తమ పని తాము చేసి తాపీగా వెళ్లిపోయారు.ఈ ఘటనకు సంబంధించిని వివరాల్లోకి వెళితే ..రెండు దశాబ్ధాల కిందట దాఖలైన పాత కేసు విచారణలో భాగంగా రూ.2.5 కోట్లు చెల్లించనందుకు కొర్టు ప్రతిస్పందించింది. మూడు వేల చదరపు గజాల భూమిని అటాచ్ చేసింది. ప్రిన్సిపుల్ స్పెషల్ కోర్టు (ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కమర్షియల్ డిస్పూట్స్) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి కేసు విచారణ జూన్ 5న జరగనుందని,అప్పటివరకూ విద్యత్ సౌధలోని 3వేల చదరపు గజాల స్థలాన్ని ఇతరులకు విక్రయించడం చేయరాదని, గిప్ట్ వంటి బదలాయింపులు చేయరాదని ఆంక్షలు విధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి ఒక కోర్టు కేసుకు సంబందించిన ఈ అంశంలో పిర్యాదు దారుకు బకాయిలు చెల్లిచాలంటూ డిక్రీ జారీ చేసినా ,విద్యుత్ సౌధలోని చీఫ్ ఇంజనీర్(రూరల్ ఎలక్ట్రిఫికేషన్) విఫలమయ్యారని తాజా నోటీసులో న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు జారీ చేసిన నోటీసులో జప్తు అంశమై కీలకంగా మారింది. పిటీషనర్‌కు చెల్లించాల్సిన రూ.2.5కోట్లు బకాయి చెల్లించని పక్షంలో విద్యుత్‌సౌధ స్థలాన్ని వేలం వేసేందుకు కోర్టు నిర్ణయం తీసుకున్నట్టు నోటీసు ద్వారా తెలియపరిచింది. అంతే కాకుండా విద్యుత్‌సౌధలోని భూమికి నాలుగు దిక్కులా ఉండే సరిహద్దు వివరాలను కూడా నోటీసులో కనబరిచింది. అయితే నోటీసులో పేర్కొన్నట్టుగా ఆ పోస్ట్ తమకు లేదని నోటీసు స్వీకరించేందుకు అధికారులు నిరాకరించారు.

ఉమ్మడి ఏపిలో ఉన్నప్పుడు సీఈ (ఆర్‌ఇ)పోస్టు ట్రాన్స్‌కో సంస్థలో ఉండేదని ,కాని ఇప్పుడు ఆ పోస్ట్ లేదంటూ న్యాయశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి నోటీసు తీసుకునేందుకు నిరాకరించారు. కొద్దసేపు కోర్టు ప్రతినిధులకు లా ఆఫీసర్‌కు మద్యన వాదనలు జరిగాయి. సంస్థ ప్రధానాధికారిగా ఉన్న సిఎండికి నోటిసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా , నోటీసు సిఎండి పేరుతో లేనపుడు ఆయన కూడా ఎలా తీసుకుంటారని వాదించారు.చివరకూ కోర్టు ప్రతినిధులు జప్తు నోటీసును విద్యుత్ సౌధ ప్రధాన భవనం డోర్‌కు అతికించి ఫోటో తీసుకుంటామని , ఇక్కడ జరిగిన విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించిన పూర్వ పరాలను పరిశీలిస్తే విజయ్ ఎలక్ట్రికల్స్ తనకు బకాయి చెల్లించాలని 2005లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.బకాయిలు చెల్లించనందుకు ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టును అభ్యర్ధించింది.

ఈ కేసు చాలాకాలం పాటే విచారణ జరిగింది. విచారణలో పిర్యాదు దారుకు అనుకూలంగానే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాని వాటిని అమలు చేయకపోవడంతో 2011లో విజయ్ ఎల్రక్ట్రికల్స్ తరపున కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 18న విద్యుత్‌శాఖకు చెందిన నల్లగొండ చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్) , ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పైన విచారణను జులై 30న జరిగేలా కొర్టు పేర్కొన్నప్పటికీ ,ప్రత్యేక విజ్ణప్తి మేరకు ఏప్రిల్ 16కు, ఆ తర్వాత జూన్ 5కు వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News