Friday, March 29, 2024

తొలకరి వెనుకడుగు

- Advertisement -
- Advertisement -

ఈ వేసవిలో అకాల వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబెట్టుకొన్న, కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో వుంచిన, కోతకు సిద్ధంగా వున్న వరి పంటను కబళించి రైతుల కొంపలు ముంచేశాయి. ఇప్పుడు తొలకరి కూడా తొందరగా ప్రారంభం కాబోడం లేదని వెలువడిన జోస్యాలు కలవరపెడుతున్నాయి. అవసరం లేనప్పుడు అధిక వర్షాలు, వున్నప్పుడు వర్షాభావం. మామూలుగా జూన్ 1కల్లా కేరళ మీద వాలే నైరుతి రుతు పవనాలు ఆ తర్వాత కొద్ది రోజులకు మనకు చేరడం ఆనవాయితీ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే తొలకరిలో వర్షాలు విరివిగా కురిస్తే దేశ జనాభాలో అధిక శాతం బతుకులను చల్లగా చూసే వ్యవసాయం పచ్చగా వుంటుంది. లేని పక్షంలో కరువులు, వలసలు ఉధృతమై కన్నీరు మున్నీరే. అందుచేత తొలకరికి సంబంధించి వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పే జోస్యాలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఏడాది రుతుపవనాలు 4 రోజులు ఆలస్యమై జూన్ 4 నాటికి కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) మంగళవారం నాడు వెల్లడించింది. కేరళకు రుతుపవనాల రాకపై ఐఎండి జోస్యం ఎప్పుడో గాని తప్పదని అనుభవం చెబుతున్నది. 2005 నుంచి 2022 వరకు గల 18 ఏళ్ళ కాలంలో ఒక్క 2015లో తప్ప ఐఎండి జోస్యం అబద్ధం కాలేదు. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని కూడా ఐఎండి గతంలో చెప్పింది. రుతుపవనాలు ఒకింత ఆలస్యంగా వచ్చినా వర్షాలు తగినంతగా కురవడమనేది ముఖ్యం. అందుచేత సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. అదే సమయంలో స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ సంస్థ ఎల్‌నినో ప్రక్రియ కారణంగా ఈ ఏడాది తొలకరి వర్షాల్లో లోటు సంభవిస్తుందని చెప్పిన జోస్యం ఇప్పటికీ ఆందోళనను కలిగిస్తున్నది. ఈ వర్షాకాలం చివరి భాగంలో ఎల్‌నినో ఏర్పడుతుందని, దాని వల్ల వర్షాభావం కలుగుతుందని స్కైమెట్ హెచ్చరించి వుంది. చాలా సందర్భాల్లో ముందుగా కురిసిన వర్షాలకు మురిసి ఆ తడిలో విత్తనాలు చల్లుకొన్న రైతులు ఆ తర్వాత అవి ముఖం చాటేయడంతో ఎదిగి వచ్చిన పంటల మీద ఆశలు వదులుకొన్నారు.

అటువంటి ప్రమాదమేమీ లేకుండా వర్షాకాలం ముగిసే వరకు తరచూ వానలు కురిస్తేగాని గాదెలు, గరిసెలు నిండవు. వలసలు ఆగి బతుకులు బాగుపడవు. గతంలో రైతులు వర్షాగమన సూచన కోసం ఆకాశం వంక చూసేవారు. ఏటా ఉగాది నాడు జరిపే పంచాంగ పఠనం, శ్రవణమంతా వర్షాల గురించే. ఐఎండి సాధించిన గురి తప్పని జోస్య సామర్థం వల్ల ఇప్పుడా బాధ తొలగింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఎండలు తీవ్రంగా లేవు, వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది. అయినా రుతుపవనాలు సకాలంలో రావని చెబుతున్నారు. మే నెల మొదటి సగంలో తరచూ వానలు కురిసినందున ఈ ఏడాది వేసవి ఉగ్రత భయపడినంతగా వుండదని అనుకొన్నాము. కాని గత 4 రోజులుగా పేట్రేగుతున్న ఎండల బీభత్సం చూస్తుంటే మిగిలిన వేసవి కాలమంతా రాళ్ళురోళ్ళూ పగలడం ఖాయమని స్పష్టపడుతున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకోడం మామూలు విషయం కాదు. రుతుపవనాలు 4 రోజులు ఆలస్యం కావడమంటే వేసవి వచ్చే నెల 15, ఆ తర్వాత వరకు కొనసాగి మంటలు మండిస్తుందని అర్థం చేసుకోవలసిందే. దాని ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోయి రైతులు ఎటువంటి దురవస్థకు లోనవుతారో ఊహించవచ్చు.

జూన్ 26 వరకు ఎండలు మండిపోతాయని ఆ తర్వాత మాత్రమే తొలకరి వానలు మొదలై నిరాటంకంగా కురిసే అవకాశముందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.గత 50 ఏళ్ళలో కేరళకు రుతుపవనాల రాకలో రెండు సార్లు మాత్రం తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. 1990లో మే 19 కే వచ్చాయి. 1972లో జూన్ 18 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఐఎండి ప్రస్తుతం ప్రకటించిన జోస్యాన్ని చిట్టచివరిదిగా పరిగణించలేము. ఈ నెలాఖరులో ఖరారు జోస్యం వెలువడవచ్చునని భావిస్తున్నారు. వర్షాలు బాగా కురిసే సంవత్సరాల్లో నదులు పుష్కలంగా ప్రవహించే మన దేశంలో వాటికి వీలైన చోట్ల ఆనకట్టలు విరివిగా నిర్మించి రక్షిత సాగు నీటి సదుపాయం పరిపూర్ణంగా కల్పించుకోలేకపోడం మన పాలకుల వైఫల్యం. దేశంలో పంటలు పండించే విస్తీర్ణంలో 51శాతం వర్షాధారమే కావడం వ్యవసాయ రంగంలో మన వెనుకబాటు తనానికి ప్రబల నిదర్శనం. అంటే మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వరకు వర్షాల మీద ఆధారపడే జరుగుతున్నది. ఈ స్థితిని మార్చలేకపోతే సకాల రుతుపవనాల కోసం ఆందోళనతో ఎదురు చూడడం ఇలాగే కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News