Friday, September 22, 2023

ఐపిఎల్‌పై సిఎస్‌కె ముద్ర..

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్‌లో తనకు ఎదురు లేదని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మరోసారి నిరూపించింది. ఐపిఎల్‌లో ఐదో సారి ట్రోఫీని ముద్దాడి మహేంద్ర సింగ్ ధోని సేన సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఐపిఎల్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ కూడా ఐదు సార్లు ట్రోఫీలను గెలుచుకుంది. తాజాగా చెన్నై ఐదు ట్రోఫీలతో ముంబైతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపిఎల్ సీజన్16లో చెన్నై ఆరంభం నుంచే అత్యంత నిలకడైన ఆటను కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చివరి బంతికి విజయం సాధించి ఐపిఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. కిందటి సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకున్న చెన్నై ఈసారి మాత్రం అసాధారణ ఆటతో ఆకట్టుకుంది.

మహి అద్భుత సారథ్యం వల్లే..
అపార అనుభవజ్ఞుడైన మహేంద్ర సింగ్ ధోని అద్భుత సారథ్యంతో చెన్నైకి మరోసారి ఐపిఎల్ ట్రోఫీ సాధించి పెట్టాడు. ఐపిఎల్‌లో తన సత్తా ఏ పాటిదో ధోనీ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించినా తనలో ఇంకా చేవ తగ్గలేదనే విషయాన్ని ఈ టోర్నీ ద్వారా ధోనీ మరోసారి ప్రపంచానికి చాటాడు. ఆరంభ మ్యాచ్ నుంచి ధోనీ సారథ్య ప్రతిభ స్పష్టంగా కనిపించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ చేతిలో ఓటమి పాలైనా ఆ తర్వాత నిలకడైన విజయాలతో చెన్నై లక్షం వైపు సాగి పోయింది. ఒకవైపు ధోని అద్భుత ప్రతిభకు సహచరుల సమష్టి కృషి కూడా తోడు కావడంతో చెన్నై ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా ముందుకు సాగి పోయింది. ఇతర జట్లతో పోల్చితే లీగ్ దశలో ధోని సేన అద్భుత ప్రదర్శన చేసిందనే చెప్పాలి. సమష్టిగా రాణిస్తూ ముందుకు సాగిపోయింది.

ఓపెనర్ల కీలక పాత్ర
మరోవైపు చెన్నై ఐపిఎల్ ట్రోఫీ సాధించడంలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు ముఖ్య భూమిక పోషించారు. ఆరంభ మ్యాచ్ నుంచే వీరిద్దరూ అత్యంత నిలకడైన ఆటతో అలరించారు. ప్రతి మ్యాచ్‌లో వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఒకరు విఫలమైతే మరోకరూ తమ బ్యాట్‌తో జట్టును ఆదుకున్నారు. గుజరాత్‌తో జరిగిన కీలకమైన ఫైనల్లో కూడా రుతురాజ్, కాన్వేలు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కాన్వే, రుతురాజ్‌లు ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. దీనికి ప్రతిఫలంగా కాన్వేకు ప్రతిష్టాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. ఇక ఈ సీజన్‌లో రుతురాజ్ అయితే పరుగుల వరద పారించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తించాడు. పలు మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. కాన్వే కూడా తనవంతు సహకారం అందించాడు.

సమష్టిగా పోరాడి..
ఇక ఇతర ఆటగాళ్లు కూడా సమష్టిగా పోరాడారు. శివమ్ దూబే, అజింక్య రహానె, అంబటి రాయుడు, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా తదితరులు అసాధారణ ఆటతో అలరించారు. ప్రతి మ్యాచ్‌లోనూ చెన్నై సమష్టిగా పోరాడింది. కీలక ఆటగాళ్లందరూ తమ వంతు పాత్రను సమర్థంగా పోషించడమే చెన్నై విజయానికి ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం. లేదు. జడేజా, మోయిన్ అలీ, దీపక్ చాహర్, మథిషా పతిరణ, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే తదితరులతో బంతితో అద్భుతంగా రాణించారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా ముందుకు సాగడంతో చెన్నై తన ఖాతాలో ఐదో ఐపిఎల్ ట్రోఫీని జమ చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News