Friday, April 26, 2024

కస్టోడియల్ మరణాల కలకలం

- Advertisement -
- Advertisement -

పార్లమెంటులో జులై 27న కేంద్ర హోం మంత్రి దేశంలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు గత ఆరు సంవత్సరాల్లో 11,656 మంది చనిపోయినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు 11 జులై రోజున ప్రతిష్ఠాత్మకమైన తీర్పునిస్తూ మోపిన నేరంలో 50 శాతం జైలు జీవితాన్ని పూర్తి చేసిన విచారణ ఖైదీలను వెంటనే బెయిలుపై విడుదల చెయ్యాలని, నిందితులకు/ విచారణ ఖైదీలకు బెయిల్ మంజూరు కోసం ప్రత్యేక చట్టం తేవాలని, మొదలగు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో దేశ వ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రా లు నిలిచాయి. పోలీసు కస్టడీలో 7 శాతం, జైళ్లలో 93 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. బాధ్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పోలీసు ఎన్‌కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడంవంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి.

దేశ వ్యాప్తంగా 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు, విచారణలో కొనసాగుతున్న ఖైదీలు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో విచారణ పూర్తి జరిగి శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. అందులో (1) కేంద్ర ప్రభుత్వం నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ జారీ చేసే విధానం సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తేవాలని ఆదేశించింది (2) పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో కోడ్ అఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్టం, 1973లో (సిఆర్‌పిసి) తెలిపిన సెక్షన్ 41, 41ఏ లోని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ గతంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో తెలిపిన నిబంధనలను పాటించాలని తెలిపింది.

పోలీసు అధికారులు నిబంధనలు పారించనట్లైతే సంబంధిత నిందితులకు వెంటనే బెయిలు మంజూరు చెయ్యాలని దేశంలోని అన్ని కోర్టులను ఆదేశించింది (3) జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరానికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశ వ్యాప్తంగా ఉన్న మెజిస్ట్రేట్ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకొని వారికి రెండు వారాల్లో బెయిల్ మంజూరు చెయ్యాలని ఆదేశించింది (4) యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మన దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ పోలీసు యంత్రాంగం బ్రిటిష్ కాలం నాటి మూస పద్ధతిలోనే పని చేస్తున్నట్లుగా భావించాలి. నిందితులను, నిందితులుగా కాకుండా నేరస్థులుగానే చిత్రీకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/ అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాం గం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్థులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. పోలీసు యంత్రాంగంలోని కానిస్టేబుల్ స్థాయి నుండి ఐపిఎస్ అధికారి వరకు అనేక మంది పోలీసులు చట్టాలకు అతీతంగా రాజకీయ, ఆర్థిక, అంగబలం ఉన్నవారికి దాసోహమై పని చేస్తున్నారు. నేడు చాలా మంది పోలీస్ అధికారులు అమాయక పౌరులను సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ జైలుకు పంపిస్తున్నారు. చివరికి కొందరు పోలీసు అధికారులు సివిల్ కేసుల్లో, ప్రైవేటు సెటిల్‌మెంట్లలో భాగస్వాములై కోర్టు తీర్పులు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పని చేస్తూ, రక్షక భటులే భక్షక భటులైనట్లు అమాయక మహిళలపై అత్యాచారం చేసే స్థాయికి దిగజారి మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు.

సుప్రీం కోర్టు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు ఠాణాల్లో, జైళ్లలో జరుగుతున్నవని గుర్తించి అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను వెలువరించింది. అందులో ముఖ్యంగా 2006లో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో పోలీసులపై వచ్చే ఫిర్యాదుల విచారణ నిమిత్తం, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ కంప్లైంట్ అథారిటీలను నియమించాలని ఆదేశించింది. 2015లో డి.కె బసు వెర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్కేస్ తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్ ఠాణాల్లో, జైళ్లలో సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ అనేక కేసుల నమోదు సందర్భంలో దేశంలో పోలీసుల ప్రవర్తన తీరును తప్పుపడుతూ, సుప్రీంకోర్టు 2014లో అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని సిఆర్‌పిసిలోని సెక్షన్లు 41, 41ఎ నిబంధలను పాటించాలని ఆదేశించింది.

ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదేశించింది. సంబంధిత పోలీస్ అధికారులు సదరు కోర్టు తీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టు ధిక్కార నేరం క్రింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదేశించింది. దేశంలో 2014 తర్వాత సబ్ ఇన్స్‌పెక్టర్ నుండి ఐపిఎస్ అధికారి స్థాయి వరకు కోర్టు ధిక్కార నేరం క్రింద జైలు శిక్షలు విధిస్తూ హైకోర్టుల్లో తీర్పులు వెలువడుతున్నాయి. ఒకవైపు పాలకులు మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెబుతున్నారు. మరోవైపు జైళ్లు, పోలీసు ఠాణాల్లో సిసి టివి కెమెరాలు బిగించుకొని పోలీసుల పని తీరును, నిబద్ధతను ప్రజలకు తెలియజేసుకునే పరిస్థితుల్లో జీవిస్తున్నాం.

దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు? వీరిలో నూటికి నూరు శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించదగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కు ను కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన కారణం.

దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పోషకా హారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. ఇప్పటికైనా మానవ హక్కులను రక్షించాలంటే విచారణ ఖైదీలకు న్యాయం జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయ వ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. అప్పుడే విద్యార్థులు భావిభారత పౌరులుగా తీర్చిదిద్దబడుతారు. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది.

కోడెపాక
కుమార స్వామి
9490959625

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News