Saturday, July 27, 2024

సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడేదెన్నడో!

- Advertisement -
- Advertisement -

హలో సార్ మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, మీ డబ్బులు రెట్టింపు అవుతాయి, మా లక్కీ డ్రాలో మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. కానీ కొంచెం టాక్స్ కట్టాలి డబ్బులు పంపించండి. మీ లక్కీ ప్రైజ్ మనీని మీకు పంపిస్తాం ఛార్జీలు మీరు భరించాలి కొంత రుసుము పంపండి.. ఇలాంటి మాటలు నిజమని నమ్మి నేరగాళ్ల వలలో చిక్కి ఉన్నది పోగొట్టుకుని బంధువులకు, మిత్రులకు చెప్పలేక అప్పుల ఊబిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయినవారు కొందరైతే.. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరి కొందరు. మీరు ఫలానా కంపెనీలో లక్కీ కస్టమర్ హైదరాబాద్ పట్టణంలో విల్లా గెలుసుకున్నారు 10% చెల్లిస్తే మా కంపెనీ ప్రతినిధి వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు అనగానే ఎగిరి గంతేసి ఛార్జీలు చెల్లించి చివరకు మోసపోయామని లబోదిబో అన్నవారు ఆలోచించాలి.

ఉచితాలు ఎలా వస్తాయని లేదా మనకెందుకు ఇస్తారని ఒక్క క్షణం ఆలోచిస్తే కష్టార్జితం మిగిలేది కదా. ఇలా ఇంటర్‌నెట్ వేదికగా ఎనో రకాల అక్రమాలకు అడ్డగా మారుతున్న సైబర్ మోసలు నగరాల నుంచి పల్లెల వరకు చేరాయి. ఇటీవల అనేక ఇంటర్‌నెట్ మోసాలు పల్లెల్లో కూడా బయటపడుతున్నాయి. పరువుపోతుందనే భయంతో బాధితులు బయటపడడంలేదు, ఫిర్యాదులు చెయ్యడం లేదు. దీని వల్ల మరి కొందరు మోసపోతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా మోసాలు జరుగుతున్నా అవగాహన లేని వ్యక్తులు నష్టపోతూనే ఉన్నా రు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడి మా కంపెనీలో పెట్టుబడి పెట్టుమని కోరడంతో కొందరు దురాశకు వెళ్లి అడిగిందే తడవుగా ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపించడం, మొదట కొంత లాభం రావడంతో నమ్మి, అప్పు తెచ్చి, మోసగాడు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపిస్తూ లాభం ఆశతో నష్టపోయి మోసగాడి బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

డబ్బులు పంపించి ఆర్థికంగా నష్టపోయి, ఎంతో శ్రమించి సంపాదించిన ఆస్తిని సైతం పోగొట్టుకుని రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా రాజకీయ నాయకులు కూడా సైబర్ మోసం నుండి తప్పించుకోలేకపోతున్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన సంఘటనలు. లక్కీ డ్రా వచ్చిందంటూ మెసేజ్ రావడంతో వాటిని నమ్మి కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాద్ పట్టణాలకు వెళ్లి మరో రూ. 50 వేల చొప్పున కట్టి ఆ కంపెనీ బోర్డు తిప్పడంతో భారీగా నష్టపోయిన సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. ఇంటర్‌నెట్ మోసాలకు అంతే లేకుండాపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్‌లో ఒకటి ఫేస్‌బుక్. సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా కూడా ఫేస్‌బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్, అత్యవసరంగా డబ్బులు అవసరం అనే వాటితో మోసాలు వంటివిఎన్నో జరుగుతున్నాయి.

ఈ రోజుల్లో సోషల్ నెట్‌వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయి ఉండడం గమనించిన సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుందాం అనే రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయిందని తెలియదు. దీంతో ఫేస్‌బుక్ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్‌బుక్ చీటింగ్ స్కామ్ సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలా కొంత మంది డబ్బు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో జరిగే ఆర్థిక మోసలకు అడ్డుకట్టపడడం లేదని, మన దేశంలో సైబర్ నేరాలకు శిక్షలు కఠినంగా లేకపోవడంతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, సైబర్ క్రైమ్ చట్టాలలో మార్పు తీసుకు వచ్చి మరింత ఆధునిత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, పోలీసులు శాఖ ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ఇలాంటి మోసాలను కట్టడి చేయవచ్చనీ గ్రహించాలి.

గడప రఘుపతిరావు
9963499282

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News