Thursday, February 29, 2024

కాస్త తేరుకున్న చెన్నై నగరం

- Advertisement -
- Advertisement -

తగ్గుముఖం పట్టిన కుండపోత వర్షాలు
మళ్లీ ప్రారంభమైన విమాన సర్వీసులు
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
వర్షాల కారణంగా 12 మంది మృతి

చెన్నై: మిగ్‌జాం తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావంనుంచి కాస్త తేరుకుంటోంది. మంగళవారం తెల్లవారుజామునుంచి నగరంలో చాలా చోట్ల వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ వాఖ కూడా అంచనా వేసింది. అయితే తమిళనాడు ఉత్తర తీరప్రాంతాలు, పుదుచ్చేరిలో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. కాగా సోమవారంనుంచి చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన మరో 11 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు గోడలు కూలి పలువురు గాయపడ్డారు. నగరవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి పలు జిలాలకు చెందిన్ల విపత్తు స్పందన బృందాలను ఏర్పాలు చేశారు. ఇతర జిల్లాలనుంచిదాదాపు 5 వేల మంది కార్మికులను నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు రప్పించారు. ఇప్పటికీ వరద నీటిలో మునిగి ఉన్న పెరియంపేట్ తదితర లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, బాధితులకు సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి వీరు ఫిషింగ్ బోట్లు, వ్యవసాయ ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా సోమవారం చెన్నై విమానాశ్రయంపైకి వరద నీరు చేరడంతో విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు కాస్త తెరపినివ్వడంతో పాటుగా రన్‌వేపై వరదనీటిని అధికారులు తొలగించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నంనుంచి విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. కూవమ్ నది ఉప్పొంగి ప్వహిస్తుండడంతోపరిసర ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు స్టాలిన్ మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. చెన్నై సహా తొమ్మిది తుపాను ప్రభావిత జిల్లాల్లో 61,666 సమాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, దాదాపు 11లక్షల ఆహార పొట్లాలను, ఒక లక్ష పాల ప్యాకెట్లను ఇప్పటివరకు బాధితులకు పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

దశలవారీగా విద్యుత్ పునరుద్ధరణ
వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన అనేక ప్రాంతాల్లో దశలవారీగా విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నారు. అయితే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సన్నిహితుల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కూడా సెల్‌ఫోన్ చార్జింగ్ లేక జనం అవస్థలు పడుతున్నారు. 2015లో కూడా నగరంలో వరదలు వచ్చి అష్టకష్టాలు పడ్డామని, అధికారులు ఆ వరదలనుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడంపై మండిపడుతున్నారు. అయితే డిఎంకె అధికారంలో ఉండిన అప్పటితో పోలిస్తే ఇప్పుడు వరద పరిస్థితిని మెరుగ్గా ఎదుర్కొన్నామని, ప్రాణ, ఆస్తినష్టాలు తక్కువగా ఉండడమే దీనికి నిదర్శనమని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.

కాగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నగరంలో పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచే పని చేసేందుకు వీలు కల్పించాయి. కాగా కుండపోత వర్షాలకు తమిళనాడు డెయిరీ(ఆవిన్)కు చెందిన అంబత్తూరు యూనిట్‌లో 5 లక్షల పాల యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి టి మనో తంగరాజ్ చెప్పారు. అయితే షోలింగనల్లూర్, మాధవరంలలోని యూనిట్లు పూర్తి సామర్థంతో పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. మిగతా జిల్ల్లా ఉన్న యూనిట్లనుంచి చెన్నైకి పాలు సరఫరా అవుతున్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు పాలు సరఫరా చేసేందుకు సహకరించాలని ఆయన రిటైల్ ఔట్‌లెట్‌సకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News