Friday, September 22, 2023

మృత్యు సిగ్నల్.. 288 ప్రాణాలు బలిగొన తప్పిదం

- Advertisement -
- Advertisement -

తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్ లైన్‌లో వెళ్లడానికి గ్రీన్‌సిగ్నల్.. ఆ వెంటనే సిగ్నల్ నిలిపివేత
దీంతో లూప్‌లైన్‌లోకి వెళ్లి గంటకు 130 కి.మీ. వేగంతో గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్
ఆ ధాటికి పక్క ట్రాక్‌లపై పడిపోయిన 21బోగీలు 
అదే సమయంలో అటుగా వస్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చి కోరమాండల్ బోగీలను
ఢీకొట్టడంతో పెరిగిన ప్రమాద తీవ్రత, ఘటనా స్థలానికి హుటాహుటిన ప్రధాని, రైల్వే మంత్రి
ఘటన వివరాలు తెలుసుకొని క్షతగాత్రులకు పరామర్శ రైల్వే మంత్రి
రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, ప్రమాదం నుంచి తెలుగువారు సేఫ్
ప్రమాదం వెనుక కుట్ర: బెంగాల్ సిఎం మమత, అండగా ఉంటాం: ప్రపంచ దేశాలు
‘కవచ్’ వ్యవస్థ లేకపోవడంతోనే ప్రమాదం, ఈ వ్యవస్థ ఏర్పాటులో కేంద్రం విఫలం
18 గంటల నిర్విరామంగా సాగిన సహాయక చర్యలు, 160 మృతదేహాలు ఎవరివో ఇంకా తెలియడం లేదు: ఒడిశా సిఎస్
సహాయక చర్యల్లో పాల్గొన్న వైమానిక దళం సిబ్బంది, సైన్యం
ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కెటిఆర్

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థ లోపాలే కారణమని రైల్వే శాఖ తేల్చింది. చిన్న పొరపాటు దాదాపు 288 పొట్టన పెట్టుకున్నది. మెయిన్ ట్రాక్‌పై వెళ్లడానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి రెడ్ సిగ్నల్ వేయడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగిఉన్న గూడ్స్‌ను ఢీకొన్నట్లు నిర్ధారించింది. ఈ ఘటన ప్రపంచ దేశాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనకుండా రక్షణ కల్పించే ‘కవచ్’ వ్యవస్థ లేకపోవడం ప్రమాదానికి కారణమని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

రైల్వేలో సిబ్బంది నియామకం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహించాయి. తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అండగా ఉంటామని అభయమిచ్చారు. ఇది మాటలకందని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైళ్లలో ప్రయాణించిన తెలుగువారంతా క్షేమంగా ఉన్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

రెండు రైళ్లలో మొత్తం 3000 మంది ప్రయాణికులు?
ప్రమాదానికి కారణం అయిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 1257 మంది రిజర్వ్‌డ్ ప్రయాణికులు ఉన్నారని వెల్లడైంది. బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్‌డ్ ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరు కాకుండా జనరల్ బోగీల్లోని వారు, టికెట్లు తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారు ఎంత మంది అనేది వెల్లడికావల్సి ఉంది.
ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు
రైలు దుర్ఘటనలపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. బోగీల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు గ్యాస్‌కట్టర్లు వాడుతున్నారు. స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యల్లోపాల్గొంటున్నారు. ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేస్తున్నారు. ప్రమాద స్థలిలో హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయి. రాత్రిపూట చాలా మంది నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరగడంతో అత్యధికులకు బయటపడేందుకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. మృతదేహాలు నుజ్జునుజ్జయి, కలిసిపోయి ఉండటం, చాలా మంది కాళ్లు చేతులు విరిగి కొట్టుకుని పడి ఉండటం ఈ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది.

ఏదో జరిగే ఉంటుంది.. దర్యాప్తుతోనే నిజాలు:మమత బెనర్జీ 
ఈ శతాబ్ధపు అతి పెద్ద రైల్వే ప్రమాద ఘటన ఇదేనని బాలాసోర్ రైలు దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు, సరైన దర్యాప్తు జరిపితేనే నిజాలు వెలికివస్తాయని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఏదో కీలక అంశం ఉండే ఉంటుందని, వెంటనే సరైన దర్యాప్తు జరిపించాలని కోరారు. గతంలో మమత రెండుసార్లు కేంద్రంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. రైళ్లు ఢీకోవడం నివారించే ఏర్పాట్లు అన్ని రూట్లలో ఉంచాలని, ఈ ప్రాంతంలో ఈ ఏర్పాటు లేకపోవడం వల్లనే దారుణం జరిగిందన్నారు. రైల్వేశాఖ ఇటీవలి కాలంలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలివేసిందని విమర్శించారు. మమత బెనర్జీ ఘటనాస్థలికి వెళ్లారు, అక్కడ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దేశంలో సరైన ప్రమాణాలతో నడిచే రైలు అని అయితే దీనికి ఇప్పుడు అతి పెద్ద ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో బీహార్‌లో భారీ స్థాయి రైలుప్రమాదం జరిగిందని , అప్పుడు తాను రైల్వే మంత్రిగా ఉన్నానని, మావోయిస్టుల చర్యలతోనే ఈ ప్రమాదం జరిగిందని, సిఐడి దర్యాప్తు చేపట్టారు కానీ దీని నివేదికను బయటపెట్టలేదని, ఆ తరువాత దీని వివరాలు ఏమయ్యాయనేది తనకు తెలియదని తెలిపారు. బెంగాల్ తరఫున తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ 5లక్షల పరిహారం ఇస్తున్నట్లు, గాయపడ్డవారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి రూ 1 లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. బెంగాల్‌కు చెందిన ప్రయాణికులే ఎక్కువగా మృతులలో ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News