Thursday, October 10, 2024

కేజ్రీవాల్ కత్తిమీద సాము!

- Advertisement -
- Advertisement -

మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచీ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఐదున్నర నెలల జైలు జీవితం అనంతరం కేజ్రీవాల్ బెయిల్ సాధించడం ఒక ఎత్తయితే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం మరొక ఎత్తు. వాస్తవానికి ఆయన జైలుపాలైన వెంటనే పదవికి రాజీనామా చేస్తారని అందరూ ఊహించినా, అందుకు భిన్నంగా జైలునుంచే పాలన కొనసాగిస్తానని ప్రకటించి, ప్రత్యర్థులపై రాజకీయంగా పైచేయి సాధించారు. తీరా బెయిల్‌పై బయటికొచ్చాక రాజీనామా అస్త్రం సంధించి, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవలసి ఉండగా వాటిని మరికాస్త ముందుకు తెచ్చి, తనపై ప్రజలలో ఏర్పడిన సానుభూతి పవనాలను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోనే ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

పైకి మాత్రం ‘నేను విశ్వసనీయుడినా కాదా అనేది ప్రజలు తేల్చాలి. కాబట్టి నవంబర్‌లోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రజాక్షేత్రంలో గెలిచినంతమాత్రాన తనపై మోపిన సిబిఐ, ఇడి కేసులన్నీ మాఫీ అయిపోయినట్లేనా? అదే నిజమైతే, ఇక కోర్టులు ఎందుకు’ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మద్యం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. సిబిఐ వైఖరిని తప్పుపడుతూ తాను పంజరంలో చిలుక కాదని నిరూపించుకోవలసిన అవసరం ఉందని మందలించింది. ఈ నేపథ్యంలో బెయిల్ రావడాన్ని తన నైతిక విజయంగా కేజ్రీ భావిస్తున్నారేమో తెలియదు కానీ, ఎన్నికల ప్రచారంలో సిబిఐ, ఇడిలతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించుకున్నారని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. పైగా బెయిల్ సాధించినా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసేందుకు ఆయనకు అనుమతి లేదన్న విషయం ఇక్కడ గమనార్హం. ఒక విధంగా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే.

ఆయన నమ్ముకున్న సానుభూతే ఓట్ల వర్షం కురిపిస్తుందనుకుంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ ఎందుకు ఓడిపోయినట్లు? ఢిల్లీలో ఏడు పార్లమెంటరీ స్థానాలనూ బిజెపి గెలుచుకున్న సంగతి ఆప్ అగ్రనేత మరచిపోయారనుకోవాలా? పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన అరెస్టయ్యారు. అలాంటప్పుడు సానుభూతి పవనాలు ఎంతో బలంగా వీయాలి కదా! ఈ సందర్భంగా 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఉదంతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అలిపిరిలో ఆయనపై నక్సలైట్లు 2003 అక్టోబర్ 1న బాంబు దాడి జరిపారు. దాని నుంచి తృటిలో తప్పించుకున్న చంద్రబాబు తనపై వెల్లువెత్తుతున్న సానుభూతిని ‘క్యాష్’ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధపడి, భంగపడ్డారు. ఇలా చూస్తే, సానుభూతి ఆసరాతో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కేజ్రీవాల్ ఎంతవరకూ విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే.

కేజ్రీ ముఖ్యమంత్రి పదవినుంచి దిగిపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నా, ప్రజాక్షేత్రంలో గెలిచేంతవరకూ మళ్లీ సచివాలయం మెట్లు ఎక్కనని ఆయన శపథం చేశారు. కాబట్టి, సిసోడియా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఇచ్చగించకపోవచ్చు. ఇక కేజ్రీవాల్‌కు కుడిభుజంగా ఉంటూ, ఆయన జైలులో ఉన్నప్పుడు రాచకార్యాలన్నీ చక్కబెట్టిన విద్యాశాఖ మంత్రి అతిషి మర్లేనాకు ఆ పదవిని అధిష్ఠించే అవకాశం దక్కవచ్చు. కానీ రాజకీయాల్లో కుడి భుజాలు, ఎడమ భుజాలు ఏకు మేకై ఎదురు తిరిగిన దాఖలాలు లేకపోలేదు. ఇందుకు జార్ఖండ్‌లో చోటు చేసుకున్న పరిణామాలే తాజా ఉదాహరణ.

ఇడి కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలుకి వెళ్తూ, తన స్థానంలో అనుంగు సహచరుడు, మంత్రివర్గ సభ్యుడు చంపై సోరెన్‌ను కూర్చోబెట్టారు. ఐదు నెలలు తిరిగేసరికి హేమంత్ బెయిల్‌పై వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దీంతో బిజెపి సహకారంతో పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించిన చంపై, అది కుదరకపోవడంతో కమలదళంలో చేరిపోయారు. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం లేదని, ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రేనని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, మరొకసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలనుకుంటున్న కేజ్రీవాల్ ఈ క్రమంలో చేస్తున్నది అక్షరాలా కత్తిమీద సామే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News