Thursday, April 25, 2024

అగ్నిపథ్ సముచితమే: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

దేశం కోసం అగ్నిపథ్ సముచితమే
సమర్థించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ల కొట్టివేత
పేస్కేళ్ల వ్యత్యాసాల దిద్దుబాటుకు సూచన
సవాళ్లను ఎదుర్కొనే ప్రక్రియలో జోక్యానికి నిరాకరణ
న్యూఢిల్లీ: కేంద్రం సైనిక నియామకాలకు తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం సమర్థనీయమే అని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల కోణంలో దీనిని ప్రవేశపెట్టారని, సవాళ్లను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఈ ఏర్పాటు జరిగిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సైనిక రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన అగ్నిపథ్ స్కీం సముచితంగా లేదని దాఖలు అయిన పలు పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అంతా బాగానే ఉందని తాము భావిస్తున్నామని, ఇక ఇందులో తమ జోక్యం అవసరం లేదని పేర్కొంటూ తమ ముందుకు వచ్చిన ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని తెలిపారు. అగ్నిపథ్ స్కీంను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్లపై హైకోర్టు గత ఏడాది తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఇప్పుడు దీనిని వెలువరించింది. అగ్నిపథ్ స్కీంతో పాటు ఇంతకు ముందటి అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా జరిగిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిలిపివేతను కూడా పిటిషనర్లు కొందరు సవాలు చేశారు.

నిర్థిష్ట ప్రకటనల పరిధిలో ఎంపికైన అభ్యర్థుల రిక్రూట్మెంట్లను సమ్మతించరాదని కూడా పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని కూడా ధర్మాసనం తమ తీర్పులో తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 14వ తేదీన అగ్నిపథ్ స్కీంను తీసుకువచ్చింది. సైన్యంలోకి ఎక్కువగా యువతను ఎంపిక చేసుకునేందుకు వీరిని అగ్నివీరులుగా సైన్యంలోకి తీసుకునేందుకు నిర్ణయించి, పలు రకాల విధివిధానాలను రూపొందించింది. నిబంధనల ప్రకారం పదిహేడున్నర ఏళ్లు నుంచి ఇరవై ఒక్క ఏండ్ల మధ్యలోని వారు అగ్నిపథ్ స్కీం కింద సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిలో ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు అగ్నివీరులుగా సేవలు అందించవచ్చు. ఆ తరువాత వీరిలో పాతిక శాతం మందికి రెగ్యులర్ సేవలకు వీలు కల్పిస్తారు.

ఇటువంటి పలు విధానాలతో రూపొందిన అగ్నిపథ్‌పట్ల పలు రాష్ట్రాలలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీనితో ఈ స్కీం కింద సైనికులను తీసుకునే వయోపరిమితిని 23 ఏండ్ల వరకూ పెంచారు. అంతకు ముందు అగ్నిపథ్ స్కీంపై దాఖలు అయిన పిటిషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ దశలో ఈ స్కీం రక్షణశాఖ నియామకాలలో అత్యంత కీలకమైన మార్పుల పాలసీ మార్పు కిందికి వస్తుందని దీనితో నియామకాల ప్రక్రియలో ఇప్పటివరకూ ఉన్న సమతూకత సత్పరిణామం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి, స్టాండింగ్ కౌన్సిల్ హరీష్ వైద్యనాథన్‌లు తెలిపారు. రెండేళ్ల వయో సడలింపుతో ఇప్పటికే పదిలక్షలకు పైగా అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకున్నారని, సంబంధిత విషయాలను అఫిడవిట్ ద్వారా తెలియచేయలేమని, అయితే సముచిత రీతిలో తాము వ్యవహరించామని కేంద్రం వాదనను విన్పించారు.

అగ్నిపథ్ ప్రకటన తరువాత పనిగట్టుకుని అంతకు ముందటి యాడ్స్ ద్వారా నియామకాల ప్రక్రియను నిలిపివేయడాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుపట్టారు. అగ్నివీరులుగా తీసుకునేవారికి రూ 48 లక్షల జీవిత భీమా ఇప్పటి నియామకాలలో ఉండే భీమా మొత్తంతో పోలిస్తే చాలా తక్కువ అని మరికొందరు పిటిషనర్లు తమ లాయర్ల ద్వారా తెలిపారు. ఈ దశలో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కీం సమర్థనీయమే అని తెలిపిన హైకోర్టు ఈ దశలో కేంద్రం అగ్నివీరుల, రెగ్యులర్ సిపాయిల పేస్కేల్స్ మధ్య వ్యత్యాసాన్ని సవరించాల్సి ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News