Thursday, April 25, 2024

ధరణి ఫైనల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భూములు క్రయ విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ధరణి వల్ల రైతులు,ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కానీ కాంగ్రెస్, ఇతర ప్రతి పక్ష నాయకులకు ఇబ్బంది కరంగా మారిందన్నారు. రెవెన్యూ, రోడ్లు, ల్యాండ్‌అక్విజేషన్‌లకు సంబంధించిన పద్దులపై మంత్రి వేముల అసెంబ్లీలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భూమి కొనేటప్పుడు, అమ్మేటప్పుడడు ధరణి లో ఉందా అని ప్రతి ఒక్కరూ సరిచూసుకుంటున్నారని, ధరణిలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే ఎంతో భరోసాతో ఉంటున్నారని ఆయన తెలిపారు. ధరణిని రద్దు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సభలో కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు మాట్లాడడం దుర్మార్గం అని మంత్రి వేముల మండిపడ్డారు. ధరణి రద్దు చేస్తామని మాట్లాడడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆయన అనుమానం ఆయన వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యలను ధరణి సమస్యలుగా చిత్రీకరిస్తున్నారన్నారని ఆయన తెలిపారు. రెవెన్యూ సమస్యలు వేరనీ, సాఫ్ట్‌వేర్ సమస్యలు వేరని మంత్రి స్పష్టం చేశారు. చిన్న చిన్న సాప్ట్ వేర్ లోపాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 48 లక్షల వ్యవసాయ భూములు

ధరణి వచ్చిన తరువాత రికార్డులను డిజిటలైజేషన్ చేయడం ద్వారా 2 కోట్ల 48 లక్షల వ్యవసాయ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని తేలింది. అందులో కోటి 74 లక్షల ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదిగా, 76 లక్షల భూమి ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రస్తుతం ధరణిలో 33 మ్యాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ధరణి వచ్చిన 2 సంవత్సరాల్లో గ్రీవెన్‌సెల్ ద్వారా 13 లక్షల ఫిర్యాదులు అందగా అందులో 12 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ధరణిలో సుమారు 24 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి వెల్లడించారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 141 ఉండగా ప్రస్తుతం ధరణి వచ్చిన తరువాత జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో కలిపి 715 ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 2014, 15 సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 8.26 డాక్యుమెంట్‌లు కాగా ప్రస్తుతం 2022, 23 సంవత్సరానికి ఇప్పటివరకు 16.50 లక్షల డాక్యుమెంట్‌లు జరిగాయని ఆయన తెలిపారు.

జిఓ 58, 59, 118, సాదాబైనామాల ద్వారా పేదలకు లబ్ధి

జిఓ 58, 59, 118, సాదాబైనామాల కింద లక్షల మంది పేదలు లబ్ధిపొందారన్నారు. జిఓ 58 కింద 3,44,26 మంది దరఖాస్తులు రాగా 1,25,864 దరఖాస్తులకు మోక్షం లభించిందని ఆయన తెలిపారు. జిఓ 59 ద్వారా ఇప్పటివరకు 36 వేల మంది నిర్మాణాలను క్రమబద్దీకరించామన్నారు. జిఓ 92 ద్వారా 1248 యూఎల్‌సి భూములను క్రమబద్దీకరించామని, జిఓ 76ద్వారా 20 వేల మందికి పట్టాలను అందించామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన జిఓ 118 ద్వారా ఎల్‌బినగర్ నియోజకవర్గం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో 44 కాలనీలకు లబ్ధి కలుగుతుందన్నారు. సాదాబైనామాలకు (తెల్ల కాగితాల మీద క్రయ, విక్రయాలు జరిపిన వాటిని క్రమబద్దీకరణ నిమిత్తం దరఖాస్తులు 11 లక్షల 19 వేలు రాగా అందులో 6 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మోక్షం కలిగిందని ఆయన తెలిపారు. 2020లో మరోసారి సాదాబైనామా కింద 9 లక్షల దరఖాస్తులు రాగా వాటికి మోక్షం కలిగించేలోగా కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉందని ఆయన తెలిపారు. దీంతోపాటు జాగా ఉన్న వారికి రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో ప్రతి నియోజకవర్గానికి 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News