Sunday, December 4, 2022

ఇందిర పాలనతోనే నియంతృత్వం

- Advertisement -

 

జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో వున్న ఇందిరా గాంధీ, దృఢమైన ఆత్మ స్థైర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, దేశానికితనదైన శైలిలోప్రజాస్వామ్య -నియంతృత్వ పరిపాలనను అందించి, చరిత్రలో మంచి, చెడుల విచిత్రమైన కలగాపుల వ్యక్తిగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జాకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్‌లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పని చేశారు.

1955లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, 1959 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిరా గాంధీ ఎన్నికైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు ఆరంభంలో మద్దతు పలికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న ‘సిండికేట్’ నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి కాంగ్రెస్ పార్టీని అచిర కాలంలోనే గద్దెనెక్కించడానికి, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలను, పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్టగతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, ఏకాభిప్రాయం అంటే ఏకవ్యక్తి అభిప్రాయంలాగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.

రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, బాల్యమంతా ఒంటరితనంతోనే గడిపి, తాత, తండ్రి తరచుగా జైలు కెళ్ళి వస్తుండడం ప్రత్యక్షంగా చూసి, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అంది పుచ్చుకుని, అత్యున్నత పదవిని పొంది, విధి వక్రీకరించి తాను అనుకున్న సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజకీయాలకు దూరంగా వున్న రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి పునాదులు వేసినా మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో రాజీవ్ తదనంతరం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయాడు.

అవుతాడన్న నమ్మకం కూడా లేదు. అణు యుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించడం, సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకోవడం, ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలవడం, అలీన దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లడం, అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో చూపడం ఇందిరాగాంధీ ప్రత్యేకత. పార్టీపరంగా, పాలనాపరంగా ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యవాదిలాగా పైకి కనిపించినా, నియంతృత్వ పోకడలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపించేవి. రాజ్యాంగ సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురిచేయడం, పడగొట్టడం,అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది.

కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్‌లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. ‘కమ్యూనిజం’ కంటే ‘కమ్యూనలిజం’ వల్లే ప్రమాదం అనే నినాదం లేవదీసింది. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరినీ వారూ-వీరూ అనే తేడా లేకుండా, జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు.60 సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయకరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దాని కోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలు, ఓటమికి కారణాలయ్యాయి.
ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన విశ్లేషణాలలో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు దూకుడుగా వ్యవహరించేదో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టేదో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు, ఎందుకు ఏ పని చేసేదో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి.

ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. అందుకేనేమో తనను తాను ‘జోన్ ఆఫ్ ఆర్క్’ లాగా అభివర్ణించుకుంది ఇందిరబాల్యంలో.1941లో భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉధృతరూపం దాలుస్తున్న సమయంలో, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్వదేశానికి తిరిగొచ్చింది. తల్లి కమలా నెహ్రూ మరణించిన తర్వాత ఇందిర ఆక్స్‌ఫర్డ్ లో చేరింది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమెవెంట వచ్చినచిన్ననాటి స్నేహితుడు, ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకుంది. కొద్దికాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్, సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

జైలులో వున్న తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతోపాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగింది ఇందిరాగాంధీ. సంజయ్‌గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో, అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఫిరోజ్‌తో వుండే సమయం తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంత వరకూ అంతే కొనసాగింది.

జవహర్ లాల్ వెంట దేశ, విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు, ఇందిరాగాంధీ సుపరిచితురాలైంది. నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తనరాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించి, ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన నంబూద్రిపాద్ నాయకత్వంలోని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి (తెలంగాణాకు చెందిన) గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు ద్వారా రద్దు చేయించడంలో కీలకపాత్ర పోషించింది.

ఎన్నికైన ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోయడం ప్రారంభంకావడం అలా మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించిపెట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార, ప్రసారశాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి ఉద్దండులున్న కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన మొదలైంది ఆమె నేతృత్వంలో.

ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్‌పై దృష్టి సారించింది ఇందిరాగాంధీ. అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిరాగాంధీని అహర్నిశలూ ఘాటుగా విమర్శించే నీలం సంజీవరెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. నామినేషన్‌పై ఆయననే ప్రతిపాదించిన ఇందిరాగాంధీ, దరిమిలా స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన మద్దతుదారులందరినీ ఆయనకే ఓటెయ్యమని అనధికారిక విప్ జారీచేసి, గెలిపించింది. మొరార్జీ దేశాయ్‌ని ఆర్ధికశాఖ నుంచి తప్పించి, మంత్రివర్గం నుంచి రాజీనామా చేసే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో ఇందిర కాంగ్రెస్ పార్టీని చీల్చి, ఏడాది ముందే 1971లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత- పాకిస్తాన్ యుద్ధంలో ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇందిర ప్రభ వెలగసాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవరోహణ పర్వానికి బీజాలు పడ్డాయి. అలహాబాద్ హైకోర్టు లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హురాలిగా కూడా ప్రకటించింది. తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేయడంతో యోధానయోధులైన ప్రతిపక్ష రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్య్రం కాలరాసిందని దేశ విదేశాల ప్రముఖులవిమర్శలను లెక్కచేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగరాసింది. సుప్రీంకోర్టు స్టేతో తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు నుంచి ఊరట పొందింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకన్న సాకుతో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదేపదే చేయసాగింది. మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా ఆమె చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులులేని అధికారాలను ఇందిరాగాంధీ తన సొంతం చేసుకుంది.

కొడుకు సంజయ్ గాంధీ సారథ్యంలో బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమల్లోకి చేసింది. ఐదేళ్ల లోక్‌సభ పదవీకాలం పొడిగించి, ఆరేళ్లు చేసిన తర్వాత, హఠాత్తుగా, జనవరి 1977లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరాగాంధీ. జైళ్లలో నిర్బంధించిన చాలా మందిని విడుదల చేయించింది. ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతిపక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో అతివాద, మితవాద పార్టీలను, కాంగ్రెస్‌లోని యంగ్ టర్క్‌ను కలుపుకుని జనతా పార్టీ ఆవిర్భవించింది. కసిగా వున్న ఓటర్లు మార్చి 20, 1977న జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజకవర్గంలోను, ఆమెసారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వానికి రెండేళ్లు జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
ఓటమితో కుంగిపోకుండా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది.

తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకుని, మరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. కర్నాటకలోని చిక్‌మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోకసభకు ఎన్నిక కావడంతో, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మరధం పట్టసాగారు. జులై 1979లో ప్రధానిగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తరువాత చరణ్ సింగ్‌కు మద్దతు పలికి, ఆయన ప్రధానమంత్రి కావడానికి తోడ్పడి, వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది ఇందిరా గాంధీ.

జనవరి 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించి, ఇందిరా గాంధీ మరో మారు ప్రధాన మంత్రి అయింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్- హర్మందిర్ సాహిబ్‌పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో అక్టోబర్ 31, 1984 న ఇందిరాగాంధి మరణించింది. నియంతృత్వ పాలనకు బీజాలు ఏనాడో వేసిన ఇందిరాగాంధీ, లోని మంచి చెడులను నిశితంగా విమర్శించేవారితో పాటు అభిమానించేవారు కూడా చాలా మంది వున్నారు.

వనం జ్వాలా నరసింహారావు- 8008137012

Related Articles

- Advertisement -

Latest Articles