Sunday, December 4, 2022

తొలి ప్రైవేటు రాకెట్

- Advertisement -

 

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మొదటి సారిగా ఒక ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరగడం చెప్పుకోదగిన పరిణామం. అంతరిక్ష శోధన, సాధన రంగాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం 2020లో ప్రైవేటుకు బార్లా తెరిచింది. ఆ తర్వాత రెండేళకే హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్ స్పేస్ సంస్థ రూపొందించిన చిన్న సైజు రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశించడం విశేష పరిణామమే. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు అడుగు పెట్టడం ఇదే తొలిసారి కాబట్టి ఈ ప్రాజెక్టుకు ప్రారంభ్ అని పేరు పెట్టారు.

ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ పేరిట నామకరణం చేసిన విక్రమ్ ఎస్ అనే 6 మీటర్ల నిడివి ప్రైవేటు రాకెట్ శుక్రవారం ఉదయం శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 89 కి.మీ దూరంలోని అంతరిక్షంలోకి చేరుకొన్నది. దానికి నిర్దేశించిన 80 కి.మీ లక్షాన్ని మించిపోయింది. ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను 81.1 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. ఇందులో ఒక రాకెట్ చెన్నైకి చెందిన స్టార్టప్ సంస్థ స్పేస్ కిడ్జ్‌ది కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ స్పేస్ టెక్ ఉపగ్రహం, ఇంకొకటి ఆర్మేనియాకి చెందిన బజూమ్ క్యూ అంతరిక్ష పరిశోధన లేబొరేటరీకి చెందినది. 2.5 కిలోల స్పేస్ కిడ్జ్ ఉపగ్రహం ఫన్ శాట్ ను భారత, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాలకు చెందిన విద్యార్థులు తయారు చేశారు.

స్కైరూట్ వచ్చే దశాబ్ద కాలం లో 20000 చిరు రాకెట్లను ప్రయోగిస్తుందని భావిస్తున్నారు. రైల్వేలను ప్రైవేటుకు అప్పగిస్తున్న రీతిలోనే ప్రభుత్వ రంగంలోని అంతరిక్ష ప్రయోగ సంస్థ అయిన ఇస్రో సౌకర్యాలను వినియోగించుకోడానికి ప్రైవేటును అనుమతించారు. అంతరిక్ష రంగంలో వాణిజ్య లాభాలు విశేషంగా గడించేందుకు వీలుగా ఈ కృషి ప్రారంభమైంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా పోటీ పడాలనే ఆలోచనే దీనికి అంకురం. ఇందుకు ప్రైవేటులోని స్టార్టప్ సంస్థలు ముందుకు రావడం హర్షించవలసిన అంశం. మొదటి ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్ ఏరోసేస్ నాలుగేళ్ళ క్రితం మొదలైన స్టార్టప్ సంస్థే. ఇదొక మైలు రాయి, నవ శకారంభం అని ఇండియన్ నేషనల్ సేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ సంస్థ చైర్మన్ డా. పవన్ కుమార్ గోయెంకా శ్లాఘించారు.

ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో భారత దేశం వాటా కేవలం 2 శాతమే. ప్రైవేటైజేషన్ ద్వారా ఇది బాగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో అమెరికా, చైనాలదే పైచేయిగా వుంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కనీసం 810 శాతం వాటాను భారత్ కైవసం చేసుకోగలదని పవన్ కుమార్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ఇస్రోకు ప్రైవేటు సంస్థలకు మధ్య సమన్వయ సహకారాలు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ స్పేస్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం విలువ 7 బిలియన్ కోట్ల డాలర్లు కాగా, 2024 నాటికి ఇది 50 బిలియన్ డాలర్లకు చేరుకొంటుందని ఆశిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు, అంతరిక్ష ప్రయాణానికి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. గత సంవత్సరం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ అనే మూడు సంస్థలు అంతరిక్ష ప్రయాణాన్ని కూడా నిర్వహించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాత్రికులను తీసుకు వెళ్ళాయి.

భూమికి దగ్గరి కక్షలోకి సామగ్రిని చేర్చాయి. పునర్వినియోగ బూస్టర్ రాకెట్స్‌ను తయారు చేశాయి. ఎలాన్ మస్క్ ఈ రంగంలో ముందడుగు వేస్తున్నాడు. ఈయన 10 మిలియన్ డాలర్లతో రూపొందించిన స్టార్ షిప్ రాకెట్ నవంబర్‌లో అంతరిక్షానికి వెళ్లగలదని భావిస్తున్నారు. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించినప్పటికీ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నుంచి ప్రయోగించడానికి 4.1 బిలియన్ డాలర్ల అత్యంత ఖర్చు అవుతుండడం గమనించవలసిన అంశం. అందుకే వీలైనంత తక్కువ వ్యయంతో పునర్వినియోగ రాకెట్లను పంపించడానికి ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. స్టార్ షిప్ రాకెట్‌ను మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. అంతేకాదు అంతరిక్షంలోనే ఇంధనాన్ని నింపుకొనే అవకాశాన్ని కూడా అందులో కల్పిస్తున్నారు. ఈ రాకెట్లలో వినియోగించే ఇంధనం చాలా ఖరీదైనది.

భూమ్యాకర్షణ శక్తిని ఉల్లంఘించి పైకి పోయే సామర్థాన్ని రాకెట్‌కు కలిగించడానికి అది మోసుకుపోయే బరువు పెరిగే కొద్దీ అత్యధిక ఇంధనాన్ని వాడవలసి వుంటుంది. ఇన్ని పరిమితులను, అడ్డంకులను దాటుకొని అంతరిక్ష వాణిజ్యాన్ని పెంపొందించడం ఎంతో ధనంతో, విజ్ఞానంతో కూడుకొన్నది. అంతరిక్షంలో వాణిజ్య స్థాయి కార్యకలాపాలు గత 15 ఏళ్ళలో మూడు రెట్లు పెరిగాయి. 2005లో 110 బిలియన్ డాలర్ల విలువ చేసిన ఈ కార్యకలాపాలు 2020 నాటికి 357 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ప్రైవేటు భాగస్వాముల ప్రవేశంతో భారతీయ అంతరిక్ష వాణిజ్యం పురోగమించడం ఎంతైనా హర్షించదగిన అంశం.

అయితే ప్రైవేటు రంగం తన సొంత మౌలిక సదుపాయాలను ఎంత వరకు సమకూర్చుకోగలుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వరంగం వనరులు, సహకారంతో పురోగమించవలసి వుంది. దేశంలోని అత్యంత విలువైన పబ్లిక్‌రంగ సంస్థలను ప్రధాని మోడీ ప్రభుత్వం కారుచవకగా ప్రైవేటుకు విక్రయిస్తున్నది. అది ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నది. అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వ సంస్థల కృషిని నిరుత్సాహ పరచి అంతిమంగా దానిని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తారేమోననే భయాలు కలగడం సహజం. ప్రైవేటును ప్రోత్స హించే క్రమంలో పబ్లిక్ ప్రయోజనాలను కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత.

Related Articles

- Advertisement -

Latest Articles