Thursday, April 25, 2024

హిజాబ్ వివాదంపై సుప్రీంలో భిన్న తీర్పులు

- Advertisement -
- Advertisement -

Different Verdicts in Supreme Court on Hijab Issue

న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వివాదంపై సుప్రీం కోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ అంశంపై గతంలో సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా దానిపై ద్విసభ్య ధర్మాసనం లోని న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భిన్న తీర్పులు వెలువరించారు. వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా విద్యార్థుల చదువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ సుధాంశు దులియా అభిప్రాయ పడ్డారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్టు జస్టిస్ హేమంత్ గుప్తా వెల్లడించారు. విద్యా సంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

స్కూల్ యూనిఫాంపై విద్యాసంస్థల నిబంధనలను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై తాజాగా విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ గుప్తా హైకోర్టు తీర్పును సమర్ధించారు. పిటిషన్లను తోసిపుచ్చారు. మరోపక్క జస్టిస్ సుధాంశు ధులియా స్పందిస్తూ.. “దీనిపై నాది భిన్నమైన అభిప్రాయం. నా ప్రాధాన్యం ఆడపిల్లల విద్యకే.. ఈ విషయంలో నా సోదర న్యాయమూర్తితో మర్యాద పూర్వకంగా విభేదిస్తున్నాను. ఆ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నాను” అని వెల్లడించారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ కేసును సీజేఐ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై కొద్ది నెలల క్రితం కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
హిజాబ్ ధారణపై నిషేధం కొనసాగుతుంది: కర్ణాటక ప్రభుత్వం
విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో కర్ణాటక లో హిజాబ్ ధారణపై నిషేదం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులు, మహిళలు హిజాబ్ ధరించడంపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, దీన్ని హైకోర్టు మార్చిలో సమర్ధించింది. దీనిపై సుప్రీం కోర్టు 10 రోజుల పాటు విచారణ జరిపి సెప్టెంబరులో దీనిపై తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పును గురువారం వెల్లడించినా ద్విసభ్య ధర్మాసనం లోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Different Verdicts in Supreme Court on Hijab Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News