Sunday, April 28, 2024

గిరిజన సాంస్కృతిక మూలాలు కనుమరుగు

- Advertisement -
- Advertisement -

జానపద గిరిజన కళారూపాల మౌఖిక సాహిత్యం, వైవిధ్యమైన వస్తు సంస్కృతి విశిష్టమైనదని జానపద గిరిజన విజ్ఞాన వేత్తలందరికీ తెలిసిందే. ఈ మట్టిలో పుట్టిన కళారూపాల మీద అమితమైన ఆదరణ చూపిన వారు లేకపోలేదు. వాటి మనుగడ కోసం ప్రయత్నించిన వారు, తపించిన వారు కూడా లేకపోలేదు. అయితే మారుతున్న కాలాన్ని బట్టి విభిన్నమైన జానపద గిరిజన కళారూపాలు నేడు కొన్ని కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్ని అవసాన దశలో కొట్టుమిట్టాడుతూ, మనుగడ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జానపద గిరిజన కళారూపాల అస్తిత్వానికి ప్రతీకలైన వస్తువులను సేకరించడం మొదలుపెట్టారు.తమ కళారూపానికి ఆదరణ లేదని, అమాయకులైన కళాకారులు తమ ఇంట్లో అవి ఊరికే ఉంటున్నాయనిచెప్పి,వారికి అరకొర డబ్బులకిచ్చారు. ఇందులో భాగంగానే కాకి పడగల కళాకారుల టోటమ్ అయినా కంచుతో చేయబడిన కాకి విగ్రహాలు, గుర్రం పటం కథ కళాకారుల టోటమ్ చిహ్నమైన గుర్రం విగ్రహాలు ఆయా కళాకారుల వద్ద లేవు గానీ వాటితో సంబంధంలేని వ్యక్తుల వద్ద నిక్షిప్తమైనవి.

ఇక తెలంగాణ జానపద కళారూపాల్లో పటంకథల కళారూపాలకు విశిష్టత ఉంది.ఇవి ఇక్కడే కనిపిస్తాయి.ఇందులో కూనపులి ,డక్కలి, గుర్రపు, మాసయ్య, ఏనూటి, గౌడజెట్టి , తెరచీరల,కొమ్ము, అద్దపు, కాకి పడగల, మందహెచ్చుల,పెక్కర్లు, కొర్రాజుల వంటి పదమూడు పటం కథల కళారూపాలు మనుగడలో ఉన్నవి. ఆయా పటం కళారూపాలు వంశ పారంపర్యంగా సంక్రమించిన మౌఖిక సాహిత్యాన్ని అనుసరిస్తూ, కుల పురాణాలను కథా గానం చేయడం, మహాభారతం కథలను పటం ఆధారంగా చెప్పడం జరుగుతుంది.అయితే ఇందులో మడేలు పురాణం చెప్పే మాసయ్య పటం కథ కళారూపానికి సంబంధించిన పటాలు అన్నీ మాయమై, చివరికి వారి బృందానికి ఒకే ఒక పటం మిగిలిపోయింది.ఇదే కోవలో వీరి వద్ద ఉండే వీరపలకలను కూడా మాయం చేశారు. అలాగే ఏనూటి పటం కథ కళాకారుల పరిస్థితి కూడా అలాగే తయారైంది.. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహాభారతం కథలు చెప్పే కొర్రాజుల కళాకారుల పటాలన్నీ మాయమైనాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అవసాన దశలో మిగిలిపోయిన ఒకే ఒక కళాబృందం కూనపులి పటం కథ.వీరు మార్కండేయ పురాణాన్ని పటం ఆధారంగా చెప్తారు.నేను వీరి మీద పరిశోధన చేసిన కాలంలో వారి దగ్గర మార్కండేయ పురాణానికి సంబంధించిన పటం ఉండేది. ప్రస్తుతం దాన్ని కూడా కొందరు వ్యక్తులు సేకరించడం జరిగింది.

ప్రస్తుతం ఆ కళాకారులు ఫ్లెక్సీ మీద మార్కండేయ పురాణానికి సంబంధించిన కథను ముద్రించుకొని కనిపిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణాలో పటం కథల కళారూపాల పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క పటం కథలో ప్రదర్శించే కళాకారులు ఉన్నప్పటికీ,ఆయా కళారూపానికి సంబంధించిన పటం మాత్రం ఒక్కటే మిగిలిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లా పటాలన్నింటినీ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఎంత పురాతనపటమైతే,అంతే ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చనే నెపంతో,దళారులు కళాకారులకు తక్కువ డబ్బులిచ్చి సేకరించి,వారికి పటాలు లేకుండా చేస్తున్నారు. ఈ రకంగా అనేక పటంకథల పటాలను సేకరించి వారి సంస్కృతిని విచ్చిన్నం చేస్తున్నారు. ఇక వృత్తి గాయకుల వద్ద ఉండే రాగి శాసనాల విషయానికి వస్తే,ఆ రాగి శాసనాలను కూడా కొందరు, కళాకారులకు మాయమాటలు చెప్పి సేకరించారు. వీటి మీద కళారూపానికి సంబంధించిన మౌఖిక కథతో పాటు వారికి తరతరాలుగా సంక్రమించిన కట్టడి గ్రామాల పేర్లు లేదా మిరాశి గ్రామాల పేర్లు, ఆయా గ్రామాల్లో వీరు కళా ప్రదర్శనకు వెళ్లినప్పుడు వారిచ్చే దానాలు,హక్కులు వ్రాయబడి ఉంటాయి.ఇవి వారి అస్తిత్వానికి, మనుగడకు ఎంతో ఉపయోగకరమైనవి .వాటిని కూడా సేకరించడం ఎంతవరకు సమంజసం.

ఈకోవలోనే విభిన్న కళారూపాల రాగి శాసనాలను తిరిగి ఇస్తామంటూ గోత్రాల వారి రాగి శాసనాలు, మందహెచ్చుల వారి రాగి శాసనాలు అక్కడెక్కడో పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే పిచ్చుక కుంట్ల వారికి సంబంధించిన రాగి శాసనాలను కూడా కొందరు సేకరించారు. ఈ రాగి శాసనాలు ఆయా కళాకారులకు ఎంత విలువైనవి అంటే ఉదాహరణకు రజకులను ఆశ్రయించి కథా గానం చేసే గంజి కూటి వారి కళా ప్రదర్శన అంతరించింది. అయినప్పటికీ ఆ కళారూపానికి చెందిన కళాకారులు వారి దగ్గర మిగిలి ఉన్న రాగి శాసనంతో వారి వారి కట్టడి గ్రామాలకు వెళ్లి, మేము గంజి కూటి వారమని చెప్పి భత్యం స్వీకరిస్తూ మనుగడ సాగిస్తున్నారు. ఆ రాగి శాసనం గనుక వారి దగ్గర లేకపోతే, వారు గంజి కూటి వారమని చెప్పడానికి వీలు ఉండదు.ఇది వారి సాంస్కృతిక గుర్తింపు. వీరి దగ్గర కూడా రాగి శాసనం ఉందనే విషయం దళారీలకు తెలియదు కాబోలు. అందుకే వారి దగ్గర అట్లే మిగిలి ఉంది. ఇంకా అంతరించిన కొన్ని వృత్తి గాయకుల వద్ద రాగి శాసనాలు అట్లే వారి అస్తిత్వానికి ప్రతీకగా, వారి ఇంట్లో దేవుని గదిలో పవిత్రం గా దాచుకుంటున్నారు. ఈ విషయం గనుక వారికి తెలిస్తే వాటిని కూడా సేకరించే వారేమో…. ఇట్లా కళారూపాలకు చెందిన రాగి శాసనాలను కూడా కొల్లగొడుతున్నారు.

అలాగే కళాకారుల వద్ద ఉండే తరతరాలకు సంబంధించిన తాళపత్ర ప్రతులను,రాతప్రతులనుతిరిగి ఇస్తామంటూ సేకరించారు.ఈ రకంగానే ఆయా కళారూపాలకు సంబంధించిన వాద్యాలను కూడా సేకరించడం జరుగుతున్నది. గిరిజన కళారూపాలకు సంబంధించిన వాద్యాలకు ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. వారు ఉపయోగించే వాద్యాల మీద వారి అస్తిత్వపు చిహ్నాలను చిత్రించుకుంటారు. అంతేకాకుండా ఆయా వాద్యాలను వారి దేవతల ప్రతిరూపాలుగా పవిత్రంగా కొలుస్తారు. ఉదాహరణకు గోండు ఆదివాసీలు గుమేల వాద్యాన్ని,వారిలోని నాలుగో సగవారు దండారి దేవతగా కొలుస్తారు. మద్దెల మాదిరిగా ఉండే ’పర్ర’ వాద్యాన్ని ఐదో వేల్పుల వారు తమ దేవతకు పతిరూపంగా భావిస్తారు. ఇక ఏత్మాసూర్ దేవతకు ప్రతిరూపంగా ’వెట్టె’ వాద్యాన్ని పవిత్రంగా పూజిస్తారు. ఇవే కాకుండా తోటి గిరిజనులు వాయించే కీకిరి, కుజ్జా, తుడుం,వంటి వాద్యాలు అలాగే కొండరెడ్డి గిరిజనులకు సంబంధించిన ఔజం, నాయకపోడు గిరిజనుల మూగడోలు, కోయ గిరిజనుల వంశ చరిత్ర చెప్పే డోలి కళాకారులు వాయించే డోలి వాద్యం, బంజారాల వంశ చరిత్రను కీర్తించే భాట్స్ కళాకారులు ఉపయోగించే రబాబ్ వాద్యం.

అలాగే నక్కల తెగ అత్యంత పవిత్రంగా తమ వంశదేవతల పండుగ సందర్భంలోనే వాయించే డేంచుక వంటి మొదలైన వాద్యాలు ఆయా గిరిజనుల అస్తిత్వానికి ప్రతీకలు.ఇందులో ప్రతీ వాద్యానికి ప్రాణం ఉంటుందని విశ్వసిస్తారు ఆదివాసీలు. అంతటి పవిత్రమైన వాద్యాలను కూడా అమాయకులైన ఆదివాసీలను మభ్యపెట్టి వారు ఎన్నో సంవత్సరాలగా ఉపయోగించిన అరుదైన వాద్యాలను అరకొర డబ్బుల ఆశచూపిమాయం చేస్తున్నారు.వారికి ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న నెపంతో ఒకటి రెండుసార్లు ఆయా కళాకారులను పిలిచి ప్రదర్శనలిప్పించి,ఆ తర్వాత వారి దగ్గర ఉండే అమూల్యమైన సంపదని కొల్లగొడుతున్నారు . ఒకప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం 1995 సంవత్సరంలో జానపద కళాకారులతో కార్నివాల్ నిర్వహిస్తే ఆయా కళారూపాలకు ప్రాచుర్యంతో పాట అనేక ప్రదర్శన అవకాశాలు ఏర్పడినాయి. ఆ తర్వాత కాలంలో పీఠం జానపద కళారూపాలతో కళోత్సవాలు నిర్వహించడం, కళారూపాల సర్వే చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తే వారి మనుగడకు దోహదం చేసింది తప్ప వారి అమూల్యమైన సంపదను కొల్లగొట్టలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కూడా జానపద గిరిజన కళారూపాల మనుగడ కోసం పది అంచెల వ్యూహాన్ని రూపొందించుకొని అనేక కార్యక్రమాలను నిర్వహించింది. శాఖ తరపున కళారూపాలకు ప్రదర్శన అవకాశాలను కల్పించడం కోసం ఉగాది, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ,రాష్ట్ర అవతరణ వేడుకలు, జానపద జాతర, స్వాతంత్ర దినోత్సవం, తెలంగాణ కళారాధన,జిల్లాల వారి జానపద కళారూపాల కళో త్సవాలు, కృష్ణా గోదావరి పుష్కరాలు, రాష్ట్ర పండుగలు వంటి సందర్భాన్ని బట్టి వేదికలను నిర్మించి జానపద గిరిజన కళారూపాలకు అవకాశాలను కల్పించింది. అలాగే కళారూపాల విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ మరియు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయా కళారూపాలకు ప్రదర్శనావకాశాలను కల్పించి, వాటి మనుగడకు దోహదం చేసింది. అంతే కాకుండా జానపద కళారూపాలపై గ్రంథ ప్రచురణ కూడా చేసింది.ఇవేకాకుండా అంతరించిపోతున్న కళారూపాలపై డాక్యుమెంటేషన్ చేయించి భద్రపరిచింది.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ జానపద గిరిజన కళారూపాల కోసం ఇదంతా చేసినప్పటికీ వారి కళా సంపదను మాత్రం కొల్లగొట్టడానికి ప్రయత్నించలేదు. వారి ఉనికిని చాటడానికి, వారి సంస్కృతిని పరిరక్షించడానికి ప్రయత్నించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గంజికూటి కళారూపం,కాకి పడగల కళారూపం, మాసయ్య కళారూపం,గౌడజెట్టీ కళారూపం వంటి కళల్ని ప్రదర్శించే కళాకారులకు కులంగా గుర్తింపు లేని పరిస్థితి ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయా కళాకారులు తమ దగ్గర ఉండే వస్తు సంస్కృతిని, మౌఖిక సాహిత్యాన్ని బీసీ కమిషన్ ముందు ప్రదర్శించి కులంగా గుర్తింపు పొందారు. అందుకు వారి వస్తు సంస్కృతే, వారిని కులంగా గుర్తించేలా చేసింది. అదే వారి అస్తిత్వానికి ప్రతీకలైన వస్తు సంస్కృతి వేరే వారి దగ్గర ఉంటే వారికి ఎంత నష్టం జరిగేదో ఆలోచించాల్సిందే.

అట్లాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు విభిన్న కళారూపాల మీద పరిశోధనలు చేయించారు.ఇంకాచేయిస్తున్నారు కూడా.ఈ పరిశోధన లు కళారూపాల సంస్కృతిని పరిరక్షించడానికి , వాటి మనుగడకు ఉపయోగపడటానికి, వాటి సాంస్కృతిక వైవిధ్యాన్ని భవిష్యత్తు తరాలకు నిక్షిప్తం చేయడానికి ఉపకరించాయి తప్ప వారి సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నించలేదు. కానీ సంస్థలు చేసే పనిని వ్యక్తిగతంగా చేస్తున్నామని చెప్పుకుంటూ, ఆయా కళారూపాల విలువైన సంపదను వారి అస్తిత్వపు మూలాలను విచ్చిన్నం చేస్తూ, వారి ఉనికితో ముడిపడి ఉన్న అమూల్యమైన సంపదను సేకరించి, తమ అస్తిత్వంగా చెప్పుకుంటూ, తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, ఆయా కళారూపాలకు వారి యొక్క సాంస్కృతిక మూలాలు లేకుండా చేస్తున్నది ఎవరు………. తరాలుగా ఈ మట్టిలో పుట్టిన జానపద గిరిజన కళల మీద పరిశోధనలు
చేస్తూ వాటి మనుగడ కోసం కృషి చేస్తున్న మహానుభావులు ఎందరో ఉన్నారు.దీన్ని ఏకోణంలో చూడాలో జానపద గిరిజన విజ్ఞాన వేత్తలు ఆలోచించగలరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News