Saturday, April 13, 2024

కారు, కమలం మధ్యే సమరం

- Advertisement -
- Advertisement -

12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి మధ్యే పోటీ
అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది
ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం, మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మత్తులు చేశాం
ఒక పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా..?
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్
కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో గులాబీ బాస్ భేటీ
నేడు బిఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన?

మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బిఆర్‌ఎస్,బిజెపి మధ్యనేనని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ నెల 12న కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్‌లో సభకు ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేతలు హరీశ్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోశ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిత్వాలపైనా అధినేత కెసిఆర్ పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు కెసిఆర్ సూచించారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సోమవారం బిఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
బిఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే చర్చ మొదలైంది
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బిఆర్‌ఎస్ గెలువబోతోందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో సభకు ఏర్పాట్లు చేయాలని కెసిఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. బిఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే చర్చ రాష్ట్ర ప్రజల్లో మొదలైందని వివరించారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు,బస్సు యాత్రలు నిర్వహించాలని కెసిఆర్ తెలిపారు.
సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకుని పరిష్కరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వట్లేదని కెసిఆర్ ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో గతంలో బిఆర్‌ఎస్ ప్రభ్వుతాన్ని కాంగ్రెస్ విమర్శించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ కింద ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని అన్నారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం అని, మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మత్తులు చేశామని గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకుని పరిష్కరించాలని చెప్పారు. ఒక పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా..? అని కెసిఆర్ అన్నారు.

BRS 2

BRS 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News