Sunday, December 15, 2024

ప్రతిభకి చదువు అవసరమా?

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం పట్టభద్రుల కంటే ‘వృత్తి నిపుణుల’ అవసరమే ఎక్కువ. చాలా మంది నాలుగేళ్ళ పాటు కాలేజీలో సమయం వృథా చేస్తారు. చివరికి ఉపయోగపడే నైపుణ్యాలేవి వారి వద్ద ఉండవు. నేడు ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, కమ్మరి వంటి ‘వృత్తి నిపుణులు’ కావాలి. సక్సెస్ అయ్యేందుకు డిగ్రీ పట్టా ‘అవసరం లేదు’ అని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయం. పైన ఉదహరించబడిన వాక్యాలతో నేను పూర్తిగా ఏకీభవించనుగాని కొంత మేరకు సమర్ధించగలను కూడా. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది చదువుతో సంబంధం లేకుండానే వారి వారి ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా వివిధ రంగాలలో రాణించి సమాజానికి ఉపయోగపడే నూతన యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించి చరిత్రకెక్కిన దాఖలాలు ఉన్నాయి. అంతంత మాత్రం చదువుతో వారి వద్ద వున్న ప్రతిభాపాటవాలతో, నైపుణ్యాలతో వాసికెక్కన వారు కూడా వున్నారు.

వారిలో అక్కినేని నాగేశ్వర రావు, సచిన్ టెండుల్కర్, డా. కిరణ్ కుమార్ (లలిత జువెల్లర్స్ అధినేత) లూయి బ్రెయిల్, (బెయిలి లిపి ఆవిష్కర్త), థామస్ ఆల్వాఎడిసన్, బిల్‌గేట్స్, రైట్ సోదరులు, లారీ ఎల్లీసన్, మైకేల్ డెల్ మొదలైనవారు. మొదటగా మన తెలుగునాట ప్రసిద్ధి పొందిన సినీనటులు డా. అక్కినేని నాగేశ్వర్‌రావు గురించి తెల్సుకుందాం. కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివిన నాగేశ్వర్ రావుకి నాటకాలపై మక్కువతో ఓ రోజు స్టేజీ పైన నాటకం ప్రదర్శించిన అనంతరం సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేనిని విజయవాడ రైల్వేస్తేషన్‌లో గుర్తించటం, ఆయన కెరీర్‌కు కీలక మలుపు. శ్రీ సీతారామ జననం (1944)లో రాముడి పాత్రతో ప్రారంభమైన నటనా జీవితం ఇంతింతై వటుడింతై అన్న చందంగా సినీ పరిశ్రమలో వటవృక్షంలా ఎదిగి ఎంతో మందికి ఆదర్శప్రాయులైనారు. వీరి ప్రతిభను గుర్తించిన కేంద్రం దాదాసాహెబ్‌ఫాల్కే పురష్కారం (1990), పద్మవిభూషణ్ (2011), పద్మభూషణ్ (1998), ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, వివిధ రాష్ట్రాలు వారి సేవలకు గౌరవంగా సూచకంగా ఎన్నో అవార్డులు ఇచ్చాయి. నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివిన అక్కినేనికి ఆంగ్ల భాషపై సాధికారికమైన పట్టు వుంది.

అంతర్జాతీయ వేదికలపై అనర్గళమైన ప్రసంగాలు చేసేవారు. చివరి శ్వాసవరకు నటనతోనే జీవితాన్ని ముగించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్రను వేశారు. ఇక రెండవ వ్యక్తి భారతీయ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్ళను అధిగమించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కేవలం పదవ తరగతి మాత్రమే చదివాడన్న విషయం ఎంతమంది తెలుసు? కాని అతనిలోని ప్రతిభా నైపుణ్యాలను గమనించిన అతని సోదరుడు. (అజిత్ టెండుల్కర్) రమాకాంత్ అచ్రేకర్ వద్ద క్రికెట్ మెలకువలు నేర్చుకోవడానికి పంపించాడు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన విజయాలు, రికార్డులు అన్నీఇన్నీ కావు. అంటే ఇక్కడ సచిన్ టెండుల్కర్ చదువు ద్వారా పేరు ప్రతిష్ఠలు పొందలేదు. అతనిలోని క్రీడా నైపుణ్యం ద్వారా మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న విషయం మరువకూడదు. అతిపిన్న వయస్సులో భారతరత్న అవార్డు (2014) పొందిన వ్యక్తిగా మరో చరిత్రను సృష్టించిన విషయం విదితమే. సచిన్ టెండుల్కర్ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసింది.

అతడిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది యువక్రీడాకారులు భారత జట్టులో చోటు సంపాదించి రాణించటం గొప్ప విశేషం. ఇక మూడవ వ్యక్తి డా. ఎం. కిరణ్ కుమార్ (లలిత జువెల్లర్స్ స్థాపకులు) ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ ప్రతి రోజు టివిలలో దర్శనమిచ్చే ఇతడు కనీసం ప్రాథమిక స్థాయిలోనే విద్యాభ్యాసం ముగించి ఓ బంగారు షాపులో పని నేర్చుకోవడానికి వెళ్ళాడన్న విషయం ఎంత మందికి తెలిసి వుంటుంది? నేడు రూ. వెయ్యి కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అనేక శాఖల ద్వారా తన వ్యాపార కార్యకలాపాలను నేటికీ విస్తరిస్తూనే ఉన్నాడు. మరి ఇతడికి చదువు ఏం ఉపయోగపడింది? అనేది ఆలోచించావల్సిన అంశం.

మరొక వ్యక్తి లూయిబ్రెయిల్ ఇతడు బాల్యంలోనే ఒక కన్నుకి సోకిన ఇన్‌ఫెక్షన్ రెండవ కన్నుకి కూడా వ్యాపించి శాశ్యతంగా రెండు కళ్లను కోల్పోవలసి వచ్చింది. అతడు పెరిగి ప్ద్దైన కొద్ది తన లాంటి అంధులకు మార్గదర్శకుడిగా ఎదో చేయాలన్న సంకల్పం అతడిని బ్రెయిలి లిపిని ఆవిష్కరించేలా చేసింది. అదే నేడు చిన్నచిన్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు చూయిస్తోంది. ఇక మరొక వ్యక్తి థామస్ ఆల్వాఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 అక్టోబర్ 18, 1931) ఎనిమిది సంవత్సరాల వయస్సులో స్కార్లెట్ ఫీవర్ వల్ల పాఠశాలకి ఆలస్యంగా వెళ్లటం జరుగుతుంది. అప్పుడు అతడిని పాఠశాలలోని ఓ టీచర్ ఇతడిని మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని పాఠశాల నుండి బహిష్కరించటం జరిగింది. అనంతరం అతడిని పాఠశాల నుండి ఇంటికి తీసుకొని వచ్చిన తన తల్లి (నాన్సి ఈలియట్) టీచర్‌గా మారి పాఠాలు బోధిస్తుంది. బైబిల్, అర్ధమెటిక్, రాయడం, చదవటం, చిన్నచిన్న కథలు మొదలైనవి గురువుగా మరి చదువునేర్పింది.

అలా అంతంత మాత్రం చదువుతోనే ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన విషయం అందరికీ తెలిసినదే కదా! ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ ఏ యూనివర్శిటీ నుండి కూడా పరిశోధనా పట్టా కాని, డిగ్రీ స్థాయి పట్టా కాని అందుకో లేదన్న విషయం ఎంతమందికి తెలుసు? అంటే ఎడిసన్ చదివింది గొప్ప చదువు ఏం కాదు. కేవలం తనలోని ప్రతిభ ఆధారంగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక చివరి వ్యక్తి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్ (మూడవ విలియం హెన్రీ అసలు పేరు) ఇతడు కూడా అంతంత మాత్రం చదువును మాత్రమే కొనసాగించాడు. పాఠశాల దశలోనే తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలిసి కంప్యూటర్ లాంగ్వేజ్‌ఐన బేసిక్ (దీూ) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయటం మొదలుపెట్టాడు. అలా ప్రారంభమైన అతని జీవితం ఈరోజు అమెరికాలోని సంపన్నులలో మొదటి వరుసలో ఉన్నాడంటే ఆశ్చర్యపోవలసిందే. వీటికి తోడు మిలిండాగేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగించటం గొప్ప విషయం.

అదే విధంగా ల్యారి ఇల్లిసన్, మైకేల్ డెల్, విరాట్ కోహ్లి ఇలా చెప్పుకుంటూపోతే జాబితా చాలా పెద్దదవుతుంది.
అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనిషి జన్మతః సహజ సామర్ధ్యాల ఆధారంగానే ఈ ప్రపంచంలోకి ఆహ్వానింపబడతాడు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అందుబాటులో ఉన్న సదుపాయాలు, సౌకర్యాల ద్వారా మనిషి తన ఆలోచనలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సహజంగా అందరికీ ఒక ప్రశ్నరావచ్చు. ‘ప్రతిభకి చదువు అవసరమా’? అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే ఆది మానవుడు ఏమీ చదువుకోలేదు. తన ప్రాణరక్షణ కోసం క్రూరమృగాల నుండి ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన అతడికి/ ఆమెకి వచ్చినప్పుడు వాటి నుండి తనను తాను రక్షించుకోవడానికి, ఈటెలు, బరిసెలు, ఎత్తైన చెట్లు, కొండగుహలు సురక్షితంగా ఉంటాయని భావించాడు. ఇక్కడ అతనికి తట్టిన ఆలోచన మాత్రమే ఉపయోగపడింది.

అనంతరం యాదృచ్ఛికంగా దొరికిన కాల్చిన మాంసం రుచిగా ఉండటంతో పచ్చిమాంసం స్థానంలో కాల్చిన మాంసాన్ని తినాలన్న ఆసక్తి పెరగటంతో ‘నిప్పును’ కనిపెట్టాడు. అప్పటి నుండి మనిషి ఆహారపు అలవాట్లు జీవనశైలి మారటం మొదలైంది. ఇక్కడ కూడా అక్కినేని నాగేశ్వరరావు, సచిన్ టెండుల్కర్, డా. కిరణ్ కుమార్, లూయిబ్రెయిల్, థామస్ ఆల్వాఎడిసన్, బిల్‌గేట్స్, రైట్‌సోదరులు, లారీ ఎల్లీసన్, మెకేల్‌డెల్ మొదలైన వారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో చదువుకోనప్పటికీ వీరిలో వున్న ప్రతిభ, సహజ సామర్ధ్యాలు, నైపుణ్యాలు ఆధారంగా ప్రపంచ ప్రసిద్ధమైన వ్యక్తులుగా ఎదిగారు. ఆయా రంగాలను ప్రభావితం చేసి సమాజానికి, నేటి యువతకు స్ఫూర్తి సందేశం ఇచ్చారు. మరి చదువు ఎందుకు అవసరం అనే ప్రశ్న అందరికీ ఉదయించక మానదు. చదువు ద్వారా సృజనాత్మక ఆలోచనలు, భిన్న వైఖరులు, తెలియని విషయాలు’ తెలుసుకొని ఇంకొంచెం మెరుగై తనను తాను తీర్చిదిద్దుకోవడానికి చదువు మనిషికి ఉపయోగపడుతుంది. చదువుకోవటం మూలంగానే మనిషి శిల నుండి శిల్పంగా మారే అవకాశం వుంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మార్పులు, చేర్పులు చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు పోకడలు మొదలైనవన్ని తెలుసుకోగలుగుతాడు.

ఆది మానవుడికి అంతరిక్షంలోకి వెళ్లాలన్నా, చంద్ర మండలంలోకి వెళ్లాలన్న ఆలోచన ఒకవేళ వారికి వచ్చి ఉంటే అది అప్పట్లో వారికి సాధ్యం కాలేదు. నేడు అంతరిక్ష కేంద్రం సునితా విలియవ్‌‌సు, విల్‌మోర్‌లు ఉన్నారంటే వారికి వారిలో ఉన్న ప్రతిభతో పాటు వారు చదువుకున్న చదువు కూడా ఉపయోగపడింది. కాబట్టి మనిషిలో కలిగిన ఆలోచనే చంద్రమండలానికి చేరువకావడానికి చదువు ఉపయోగపడింది భావించాలి. మనిషి ఆలోచన ద్వారానే (చదువు) రాబోయే ఉపద్రవాలను ముందే పసిగట్టి నష్టనివారణను చేయగలుగుతున్నాము. అలాగే మనిషిలో మొదలైన ఆలోచనే కొత్త ఆవిష్కరణలకు దిక్సూచి అయింది. కాబట్టి ఎలన్‌మస్క్ చెప్పినట్లుగా ఏమీ చదువుకోని వ్యక్తి ప్రతిభ నైపుణ్యం వేరు, చదువుకున్న వ్యక్తి ప్రతిభ నైపుణ్యం వేరుగా ఉంటుందనేది మనం గమణించాలి. రైట్ సోదరులు కనిపెట్టిన నాటి విమానానికి నేడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడుస్తూ భవిష్యత్తులో కూడా అనేక మార్పులను మనం చూడగలం. కావున చదువు అనేది ప్రతిభావంతుడికి అదనపు బలంగా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

డా. మహ్మద్ హసన్
9908059234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News