Sunday, December 15, 2024

అదరగొట్టిన తిలక్‌వర్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిడియా యువ సంచలనం, హైదారబాదీ స్టార్ తిలక్‌వర్మ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో తిలక్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో అలరించాడు. చివరగా జరిగిన రెండు టి20 మ్యాచుల్లో సెంచరీలు సాధించి నయా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టి20లలో వరుసగా రెండు శతకాలు సాధించిన క్రికెటర్‌గా సంజు శాంసన్ సరసన నిలిచాడు. సెంచూరియన్, జోహెన్నస్‌బర్గ్ వేదికలుగా జరిగిన మ్యాచుల్లో తిలక్ పెను విధ్వంసం సృష్టించాడు.

సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో తిలక్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్‌తో ఆతిథ్య జట్టు బౌలర్లు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. బంతి ఏ దశలో వేసినా ఫోరు లేదా సిక్స్‌గా మలుస్తూ తిలక్ సాగించిన బ్యాటింగ్ విన్యాసాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఇప్పటి వరకు అంతంత మాత్రం బ్యాటింగ్‌తో ప్రస్థానం కొనసాగించిన తిలక్‌వర్మ ఈ సిరీస్ కొత్త దిశను చూపించిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో తిలక్ టీమిండియాలో స్థానాన్ని ఖాయం చేసుకునేందుకు ఈ ఇన్నింగ్స్‌లు దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

బౌన్స్‌కు సహకరించే సఫారీ పిచ్‌లపై వరుసగా రెండు సెంచరీలు సాధించడం అనుకున్నంత తేలికేం కాదు. అయితే తిలక్‌వర్మ మాత్రం దీన్ని ఆచరణలో చేసి చూపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా వరించింది. రానున్న రోజుల్లో తిలక్‌వర్మ టీమిండియాకు కీలకంగా మారుతాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత్‌కు లభించిన ప్రతిభావంతులైన ఆటగాళ్లలో తిలకవర్మది ప్రత్యేక స్థానమని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News