Thursday, September 19, 2024

ఆప్ ఎంఎల్ఏ అమానతుల్లాఖాన్ ఇంటిపై ఈడి దాడి

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ:  ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంఎల్ఏ అమానతుల్లా ఖాన్ నివాసంపై ఈడి ఈ ఉదయం దాడి చేసింది. ఎంఎల్ఏ ఇంట్లో ఈడి సోదాలు నిర్వహిస్తుంటే ఆయన ఇంటి బయట పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అమానతుల్లాఖాన్ తన ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని చెబుతూ తనను అరెస్ట్ చేసేందుకు ఇప్పుడే ఈడి అధికారులు తన ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.

అమానతుల్లా ఇంటిపై ఈడి సోదాలను ఆప్ తీవ్రంగా ఖండించింది. బిజేపి చేతిలో అస్త్రంగా మారిపోయిన ఈడి ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడింది. బిజేపికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను ఈడి అణచివేస్తోందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. తమకు లొంగని వారిని ఈడి కటకటాల వెనక్కి పంపిస్తోందని ఆరోపించారు. ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, అమానతుల్లాఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ప్రధాని మోడీ నియంతృత్వం, ఈడి గూండాయిజం కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆప్ నేతల విమర్శలపై బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ మాట్లాడుతూ, అమానతుల్లాఖాన్ నివాసంపై ఈడి సోదాలను సమర్థించారు. ఆప్‌లో అవినీతి నేతల గ్రూపు ఒకటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిపై చట్టం తనపని తాను చేస్తుంటే వారు అరవడం మొదలుపెడతారని విమర్శించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు పాల్పడిన అమానతుల్లాఖాన్ ఈడి చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంవడిపడ్డారు. అక్రమాలకు పాల్పడితే సమాధానం చెప్పాల్సిందేనని, చట్టానికి ప్రతి ఒక్కరూ సమానమేనని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News