Sunday, October 6, 2024

మాజీ ఎంఎల్‌ఎ అడుసుమిల్లి జయ ప్రకాష్ మృతి

- Advertisement -
- Advertisement -

విజయవాడ మాజీ శాసన సభ్యులు అడుసుమిల్లి జయ ప్రకాష్ మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలితరం శాననసభ్యునిగా 1983- 1985 మధ్య కాలంలో అడుసుమిల్లి సేవలు అందించారు. తరువాత విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న జయప్రకాష్ హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో లంగ్ ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. రాత్రి విజయవాడ మొగల్ రాజపురం లోని ఆయన నివాసానికి భౌతిక కాయం చేరుకుంది. శనివారం మధ్యాహ్నం విజయవాడలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు అడుసుమిల్లి శ్రీ తిరుమలేష్ తెలిపారు.

విద్యార్ది దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన జయప్రకాష్ కాంగ్రెస్ లో విద్యార్ధి నాయకునిగా పనిచేసారు. తరువాత నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసన సభ్యునిగా గెలుపొందారు. దివంగత కాకాని వెంకటరత్నం శిష్యునిగా గుర్తింపు పొందారు. సమైక్యవాద ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి జయప్రకాశ్ వివిధ దినపత్రికలకు సమకాలీన రాజకీయలపై వ్యాసాలు రాయడమే కాక, టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు.

పలువురి సంతాపం : అడుసుమిల్లి జయప్రకాష్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వర్తమాన రాజకీయల విశ్లేషకునిగా తనదైన పాత్ర పోషించారని ప్రస్తుతించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్ ఏఐజి ఆసుప్రతిలో నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ విలువలు కలిగిన నాయకుడిని కోల్పోయామన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం వెనకడుగు వేయకుండా పనిచేసారన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు తన సంతాప సందేశంలో రాజకీయాలకు అతీతంగా విజయవాడ ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారన్నారు. విజయవాడ తూర్పు మాజీ శాసన సభ్యులు యలమంచిలి రవి సంతాపం తెలుపుతూ విజయవాడ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. మృతి చెందే చివరి క్షణం వరకు బెజవాడ రాజకీయాల్లో పరోక్షంగా తన పాత్రను పోషించారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News