Sunday, April 28, 2024

సేద్యానికి దన్ను.. ఎరువుల సబ్సిడీ

- Advertisement -
- Advertisement -

గ్రామీణ ఉపాధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే నేటికీ ఆయువుపట్టుగా ఉంది. సేద్యం లో నూటికి 90% మంది చిన్న కారు రైతులే ఉన్నారు. దేశ ప్రజల ఆకలిని తీర్చేది ఈ రైతాంగమే.ఇంతటి ప్రాధాన్యత గల వ్యవసాయం ముందుకు సాగాలంటే అందుకు పాలక ప్రభుత్వాల చేయూత ఎంతో అవసరం. ఆ చేయూత దేశ రైతాంగానికి అందడంలేదు. ఫలితంగా రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. సేద్యపు ఖర్చులు నేడు ఎకరాకి రూ. 40 వేల నుంచి రూ. 55 వేలకు చేరింది. రైతాంగాన్ని ఆదుకొనేందుకు ఎరువులు, విత్తనాలు, విద్యుత్, వ్యవసాయ పరికరాలు, ఎగుమతులు తదితరాలపై సబ్సిడీలు ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధాన సబ్సిడీ ఎరువులపైన, మిగతా వాటిల్లో విద్యుత్, నీరు మొదలైన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలే ఇస్తున్నాయి. విద్యుత్ సబ్సిడీ మోటార్లు ఉపయోగించే రైతులకు మాత్రమే వర్తిస్తుంది. నీరు, విత్తనాలపై లభించే సబ్సిడీ నామమాత్రమే. రైతులకు లభించే సబ్సిడీల్లో ఎరువుల సబ్సిడీనే ప్రధానమైంది. మిగతా వాటిల్లో విద్యుత్ సబ్సిడీ తప్ప మిగతావి ప్రాధాన్యత లేని సబ్సిడీలే. రైతుల సేద్యంలో ఎరువుల వినియోగం కీలకంగా ఉంది. నేటి సేద్యంలో ఎరువుల వాడకం దిగుబడులను నిర్ణయిస్తున్నది.

ఆశించిన దిగుబడులు, వాటికి న్యాయమైన ధరలు లభిస్తేనే రైతాంగ సేద్యం ముందుకు పోతుంది. సేద్యపు ఖర్చుల్లో ఎరువులదే అధికంగా ఉంది. దేశంలో ఎరువుల సగటు వాడకం ఎకరాకు 75 కిలోలుగా ఉంది. ఇతర దేశాల్లో 200 కిలోలుగా ఉంది. దేశ వ్యాపితంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం 272.28 లక్షల టన్నులుగా ఉంది. ఎరువుల మార్కెట్ విలువ దేశంలో 73 లక్షల కోట్లు. ఇందులో దేశీయ ఉత్పత్తి సగానికి తక్కువగా ఉంది. ఎరువుల ఉత్పత్తి పెరిగే విధంగా దేశంలో పరిశ్రమల ఏర్పాటు లేకపోవటమే అందుకుకారణం. దేశీయ ఉత్పత్తిలో 30%పైగా గుజరాత్‌లో ఉన్న కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఎరువుల కొరత వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. కోటి 30 లక్షల టన్నుల వరకు డిఎపి, యూరియా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నది. దేశ రైతులు కోటి 19 లక్షల డిఎపిని వినియోగిస్తే 60 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. భారత దేశం ప్రధానంగా చైనా, ఒమన్, యుఎఇ, ఈజిప్టు, ఉక్రెయిన్ నుంచి 10.16 మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాము. దీని విలువ 6.32 బిలియన్ల యుఎస్ డాలర్లు. 2010 వరకు ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేది. కంపెనీల ప్రయోజనాల కోసం 2011లో ధరల నిర్ణయం నుంచి కేంద్రం వైదొలిగి ఎరువుల కంపెనీలకే అధికారం ఇచ్చింది.

2010కి ముందు అన్ని ఎరువులకు, వాటి ధరలను బట్టి సబ్సిడీల వర్తించేవి. సబ్బిడీలను తగ్గించుకునేందుకు 2010 నుంచి పోషక విలువలను బట్టి సబ్సిడీ విధానాన్ని యుపిఎ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విధానం వల్ల అనేక ఎరువులకు ఇచ్చే సబ్సిడీ తగ్గిపోయింది.ధరల నిర్ణయం కంపెనీలకు అప్పగించడం, పోషక విలువల సబ్సిడీలతో ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. 2011లో డిఎపి లాంటి ఎరువుల బస్తా రూ. 350 గా ఉంటే నేడు రూ. 1750 లకు పెరిగింది.
హరిత విప్లవ కాలంలో సేద్యంలో ఎరువులు ఎక్కువగా వినియోగించేందుకు వాటిపై సబ్సిడీ ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఉచిత రుణ సహాయం అందించింది. ఆ విధంగా ఎరువులపై సబ్సిడీ ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నది. మొదట ఎరువులపై సబ్సిడీని ప్రోత్సహించిన ప్రపంచ బ్యాంకు సేద్యంలో ఎరువుల వినియోగం పెరిగిన తర్వాత సబ్సిడీలను తగ్గించమని భారత ప్రభుత్వాలపై వత్తిడి ప్రారంభించింది. భారత పాలకులు దాని వత్తిడికి లొంగి క్రమంగా సబ్సిడీలను తగ్గించే విధానాలు అమలు జరుపుతున్నారు. మోడీ పాలనలో అన్ని రకాల ఎరువుల ధరలు 80 నుంచి 100% వరకు పెరిగాయి.

ధరల పెరుగుదల వల్ల సబ్సిడీ పెరిగినా, దాని ప్రయోజనం రైతులకు గాకుండా ఎరువుల కంపెనీలకే చేకూరింది. దిగుమతి చేసుకున్న యూరియాపై 2019- 20 ఆర్థిక సంవత్సరంలో రూ. 53,619 కోట్ల సబ్సిడీని విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా భాస్వరం, పొటాష్‌లకు రూ. 26,335 కోట్లు చెల్లించింది. మోడీ ప్రభుత్వం 2014 నుంచి 2022 వరకు ఎరువుల సబ్సిడీల పేరిట ప్రైవేట్ కంపెనీలకు చెల్లించిన మొత్తం రూ. 9,52,,878 కోట్లు. గుజరాత్‌లోని మోడీ సన్నిహితుల కంపెనీలకు సబ్సిడీ రూపంలో ఇచ్చింది రూ. 2,85,863 కోట్లు. వ్యవసాయాన్ని సమూలంగా మార్చేందుకు అసలు నిధులు లేని పథకమైన పిఎం ప్రణామ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నది. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించరు. ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కొంత మొత్తాన్ని ఈ స్కీమ్ కోసం మినహా ఇస్తారు. ఇలా చేయడం అంటే ఎరువుల సబ్సిడీలో పరోక్షంగా కోత విధించటమే. సేంద్రియ వ్యవసాయ సాయాన్ని ప్రోత్సహించే పేరుతో అంతకు ముందు విడుదల చేసిన ఎరువుల సబ్సిడీలో డబ్బులు మిగులు చూపిన రాష్ట్రాలకు నిధుల్లో 50% గ్రాంట్ గా విడుదల చేస్తారు. అలా ప్రతి సంవత్సరం సబ్సిడీనీ తగ్గిస్తూ పిఎం ప్రణామ్ స్కీమ్‌కి మళ్ళిస్తూ పోతారు. ఆ విధంగా ఎరువుల సబ్సిడీని ఆచరణలో అలంకారప్రాయంగా మోడీ ప్రభుత్వం మారుస్తుంది.

ప్రపంచ మార్కెట్లో ఎరువుల ముడి సరుకుల ధరల గణనీయంగా తగ్గాయి. 2022లో 900 డాలర్లు ఉన్న టన్ను అమ్మోనియా ధర 2023 మార్చి 460 డాలర్లకు, అదే సంవత్సరాల్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ధర 1300 నుంచి 1020 డాలర్లు, యూరియా 680 నుంచి 340 డాలర్లకు తగ్గటం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ కూడా తగ్గటం వలన ఎరువుల విక్రయ ధరలు కూడా తగ్గాలి. దేశంలో ఎరువుల ధరలు యథాతథంగా ఉన్నాయి. తగ్గిన ఎరువుల సబ్సిడీని వాటి ధరల తగ్గే విధంగా వినియోగించ కుండా మోడీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని మోడీ ప్రభుత్వ భారంగా భావిస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రాయితీలు, పారు బాకీల పేరుతో బ్యాంకుల రుణాలు రద్దు చేయడం చూస్తే మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు, బడా పారిశ్రామికవేత్తల అనుకూల విధానాలకు అద్దం పడుతున్నది. మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాను, ఎరువుల సబ్సిడీలను గణనీయంగా పెంచాలని, వ్యవసాయం ద్వారా ప్రభుత్వానికి అనేక రూపాల్లో ఆదాయం చేకూరుస్తున్న రైతాంగానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీని పాలకులు భారంగా భావించరాదని, ఎరువుల ధరలు తగ్గించాలని, పిఎం ప్రణామ్ పథకాన్ని విరమించాలని దేశ రైతాంగం సమష్టిగా ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News