Monday, April 29, 2024

పులిలా పోట్లాడుతా

- Advertisement -
- Advertisement -

పిల్లిలా పారిపోను…వెంటాడి… వేటాడుతాం

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో : మునుపటి తెలంగాణ కాదు.. టైగర్ తెలంగాణ ఇది.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.. మేం ప్రతిపక్షంలో ఉన్నం.. అడుగుతం.. కొట్లాడుతం.. ప్రజలకు మంచి జరగకపోతే గర్జిస్తం.. బరాబర్ నిలదీస్తం..అంటూగులాబీ దళపతి, మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఛలో నల్లగొండ బహిరంగ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి, సూర్యాపే ట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అ ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ‘కృష్ణా జలాల పంపిణీలో అన్యా యం జరుగుతుంది..ఆ బద్నాం కెసిఆర్‌పై మోపి తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెసోళ్ళు ఉన్నరు.. అందుకే అన్ని విషయాలు చెప్పేందుకు ఇక్కడకు వచ్చా.. కాలువిరిగినా కట్టెపట్టుకొని కుంటినడక నడుస్తూ ఆయాసంతో వచ్చిన.. శ్రద్ధగా విని పోరాటానికి సిద్ధంగా ఉండాలె’ అని పిలుపునిచ్చారు. ‘24 ఏళ్ళు పక్షిలా తిరిగినా.. పదేళ్ళు అధికారంలో ఉండి అన్యాయం జరగకుండా కాపాడిన.. కృష్ణా, గోదావరి నీళ్ళు లేకపోతే బతుకే లేదంటూ రైతులు, జనానికి హితబోధ చేశారు. కృష్ణానది జలాల హక్కులు కేంద్రానికి పోతే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. ఆ ఐదు జిల్లాలకు జీవన్మరణ సమస్య ఇది.. పిడికిలి బిగించాలి.. చద్ది కట్టుకొని రావా లి.. పోరాటానికి సిద్ధంగా ఉండాలి.. కేంద్రం, రాష్ట్రం, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై పులుల్లా కొట్లాడాలి’ అని పిలుపునిచ్చారు. ‘కొందరు సన్నాసులు రాజకీయ సభ అంటున్నరు.. ఇదిరాజకీయ సభ కాదు.. మన హక్కులు కాపాడుకునే ఉద్యమ సభ’ అని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల నిర్వహణ బాధ్యతలు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)కి అప్పగిస్తే జరిగే నష్టాలు.. భవిష్యత్తులో రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. కృష్ణా నీటిని వాడుకునేందుకు ఎవరి వాటాలు వాళ్ళకు ఉంటాయి.. తాత్కాలిక సర్దుబాటు అంటూ అప్పట్లో ముందుకుపోయారని అన్నారు. ‘నీళ్ళ పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళినం.. నిలదీస్తే కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించారు.. వాపస్ తీసుకున్నం.. ట్రిబ్యునల్‌కు ఇస్తమని ఇవ్వలేదు.. వంద ఉత్తరా లు రాసినా.. వారం రోజులు లోక్‌సభలో కొట్లాడినం.. ట్రిబ్యునల్ ముందు వాదించి వాటా తీసుకోవాలని చెప్పిర్రు.. అయినా కొట్లాడినం’ అని చెప్పారు.
అ సెంబ్లీ ఎన్నికల్లో పాలు ఇచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కృష్ణాజలాల నిర్వహణ కెఆర్‌ఎంబికి అప్పగించి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించారు. నీళ్ళమంత్రిగా చేసిన హరీష్‌రావు అసెంబ్లీలో గర్జిస్తే నాలుగైదు రోజులు నాటకాలు ఆడిన కాంగ్రెస్ ప్రభు త్వం బిఆర్‌ఎస్ ఒత్తిడికి తలొగ్గి ఆగమేఘాల మీద తీర్మానం పెట్టిందని అన్నా రు. కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వాటా వచ్చే వరకు కొట్లాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని, ప్రధాని నిలదీసి ప్రజా ఉద్యమం చేసైనా హక్కులు సాధించుకునేందుకు పోరాటం చేయాలన్నారు. ఆరు నెలల్లో తేల్చాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరించారు.
మేడిగడ్డ నుండి నీళ్ళు ఎత్తిపోయించు..
మేడిగడ్డకు పోవడం కాదు.. అక్కడ తోకమట్ట ఉందా? గోదావరి ప్రధాన ఉప నది ప్రాణహితలో ఐదు వేల క్యూసెక్కుల నీరు ఇప్పుడు కూడా వస్తున్నయ్.. దమ్ముంటే ఎత్తిపోయించు.. రైతులకు నీళ్ళు ఇవ్వాలని కెసిఆర్ డిమాండ్ చేశా రు. ‘మేము పోతం.. మీసంగతి చూస్తం.. మేడిగడ్డ పోయి ఏం చేస్తావ్.. కెసిఆర్‌ను బద్నాం చేస్తే ఏంరాదు’ అని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత సూర్యాపేట, డోర్నకల్ ప్రాంతాలకు నీళ్ళివ్వడం మరిచిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆటబొమ్మ కాదు.. ఆయకట్టును సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుగా అభివర్ణించారు. దానికింద 20 రిజర్వాయర్లు.. 19 సబ్‌స్టేషన్లు.. 1500 కిలోమీటర్ల మేర కాల్వలతో పటిష్టంగా ఉందని చెప్పారు. రెండు పిల్లర్లు కుంగితే అదేపట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు.. సాగర్ కుంగలేదా? మూసీగేట్లు ఊడిపోలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? ఏదైనా జరిగితే సరిచేసి నీళ్ళివ్వాలని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. నదీ జలాలపై పాలకులకు అవగాహనలేదు.. నన్ను అడిగితే చెప్పేవాన్ని.. అన్నీ వారికే తెలిసినట్లు కెఆర్‌ఎంబికి ఒప్పుకున్నారని మండిపడ్డారు.
నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతా..
మీ బిడ్డను.. తెలంగాణ కోసం కొట్లాడిన.. చావునోట్లో తలపెట్టిన.. భయపడలే దు.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను.. నా కట్టె కాలేంత వరకు పులిలా కొట్లాడుతానన్నారు. అధికారం ఎవరి శాశ్వతం కాదు.. మొన్నం మేము.. ఇప్పుడు వాళ్ళు ఉంటారు.. కానీ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం కొట్లాడి పనిచేయాలన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనని చెప్పారు. నల్లగొండ సభకు రా.. అడ్డుకుంటాం.. అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌ను తిరగనివ్వనంత మొగోళ్ళా.. చంపేస్తరా.. రా.. ఏపాటి చంపుతరో.. చంపి ఉంటవా అంటూ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షం బాధలు చెపుతుంది.. మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు.
కరెంట్ బంద్.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతరంట..
పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇరవైనాలుగు గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చినం.. రైతులకు హాయిగా పడుకొని వ్యవసాయం చేసిండ్రు.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌తో నాలుగు వేల మెగావాట్లు.. రామగుండంలో 1600 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయించే ప్రయత్నం చేసినం.. కరెంట్ లేకపోతే కొనుగోలుచేసి రైతులకు ఇచ్చినం.. ఇప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగానే కరెంట్ కటక్కున బంద్ అయిందని కెసిఆర్ చెప్పారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. చేతగాని చవటలు పాలకులు అయితే ఇలానే ఉంటుందంటూ మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వడం లేదని రైతులు అడిగితే మంత్రి చెప్పుతో కొడతా అంటడు.. ఇదెక్కడి దుర్మార్గమో అర్థం కావడంలేదన్నారు. కండ్లు నెత్తికెక్కి తిరుగుతున్నరు.. నోటిదురుసు ప్రదర్శించిన వారిని రైతులు చెప్పులతో కొట్టే సమయం వస్తుందన్నారు. ఫ్లోరైడ్‌ను పారదోలి తాగునీటిని అందరికీ అందించిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని చెప్పుకొచ్చారు.
మళ్ళీ మనమే వస్తం..
ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు.. మనం ప్రతిపక్షంలో ఉ న్నాం.. సమస్యలపై కొట్లాడుదాం.. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని కెసిఆర్ అన్నారు. ఐదేళ్ళు కాంగ్రెస్ నేతలు పాలించినా జనానికి చెప్పిన పను లు చేయలేరని, మనం పోరాటం చేసి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎవ రూ అధైర్య పడవద్దు.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఛలో నల్లగొండ బహిరంగ సభలో సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వరరావు, మాజీమంత్రులు హరీష్‌రావు, కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌లు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌లు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News