Saturday, May 4, 2024

ఆహార నాణ్యత నియంత్రణ మిథ్య!

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆహార నాణ్యత నియంత్రణ వ్యవస్థల డొల్లతనం మరోసారి బయటపడింది. గల్లీల్లో కుటీర పరిశ్రమల్లా విస్తరించిన ఆహార కల్తీనే మనుషుల ప్రాణాలను కబళిస్తుంటే అంతకు మించి తాజాగా బ్రాండెడ్ ఆహారోత్పత్తులు కూడా గల్లీలకు ఏమాత్రం తీసిపోవని రుజువైంది. దీనితో విపణిలో దొరికే ఏ ఉత్పత్తి నాణ్యమైనదో, ఏ ఉత్పత్తి కల్తీదో తెలియని దయనీయ పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఎంతో కాలంగా మసాలా దినుసులు, వంటల్లో వాడే వివిధ ఆహారోత్పత్తుల్లో క్యాన్సర్ కారక పురుగు మందుల అవశేషాలున్నాయని హాంకాంగ్, సింగపూర్ దేశాల ఆహార నాణ్యతా నియంత్రణ వ్యవస్థలు తేల్చడమే కాకుండా వాటి దిగుమతిని కూడా ఆ దేశాలు నిషేధించాయి. దీనితో కేంద్రం స్పందించి ఇలాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎండిహెచ్, ఎవరెస్టు కంపెనీలపై నిఘాను విస్తృతం చేయాలని, అన్ని ఉత్పత్తులను ల్యాబ్‌లలో పరీక్షించి నిజానిజాలను నిర్ధారించాలని దేశ ఆహార భద్రతా ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఆదేశాలు జారీ చేసింది.

ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే అన్ని బ్రాండెడ్ ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించి క్లియరెన్స్ ఇస్తుంది. అయితే హాంకాంగ్, సింగపూర్ నిషేధించిన ఎవరెస్టు, ఎండిహెచ్ ఉత్పత్తులను ఎవరు అనుమతించారో తెలియదు. అనుమతించకుండా క్యాన్సర్ కారక పురుగు మందుల అవశేషాలున్న ఉత్పత్తులను మార్కెట్‌లోకి ఎలా ప్రవేశపెడుతున్నారో అంతకన్నా తెలియదు. హాంకాంగ్, సింగపూర్‌లు పరీక్షించి ఈ ఆహార ఉత్పత్తులు వినియోగిస్తే క్యాన్సర్ గ్యారెంటీ అని ప్రకటించడంతో మన దేశవాళి ఆహారోత్పత్తుల నాణ్యత ఎలా ఉందో మరోసారి బయటపడింది. ఇది ఒక రకంగా మన దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది.

ఇంత కాలంగా ఈ ఉత్పత్తులను వినియోగిస్తున్న దేశీయ పౌరుల ఆరోగ్య పరిస్థితి తలచుకుంటే గుండె గుభేలుమనక తప్పదు. మసాలా దినుసులు, ఫిష్ మసాలా ఇంకా కూరల్లో, బియ్యంలో వినియోగించే అనేకానేక ఉత్పత్తులు మానవ వినియోగానికి అర్హమైనవి కాదని, వాటిని ఆ దేశాలు వెనక్కి పంపాయి. ఆహారోత్పత్తులే కాకుండా దేశంలో ఉత్పత్తి అయ్యే టాబ్లెట్లు, సిరప్‌లు కూడా కల్తీవని గతంలో ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో గాంబియా, ఉజ్బెకిస్తాన్, కెమెరూన్ దేశాల్లో మెయిడెన్ ఫార్మా అనే కంపెనీ ఉత్పత్తి చేసిన దగ్గు మందు తాగి వందమంది చిన్న పిల్లలు మరణించారు. ఈ మందులో ప్రమాదకర రసాయనాలున్నాయని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. అంతగా చిన్న పిల్లల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఫార్మా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ తెలియదు. దేశీయ ఉత్పత్తుల నాణ్యతే ఇలా ఉంటే బహుళజాతి కంపెనీల పరిస్థితి కూడా అంతకు మించే ఉందని నెస్లే బేబీ ఫుడ్ నిరూపించింది. ఇది కూడా ఇటీవలే బయటపడింది.

ఈ బహుళ జాతి సంస్థ భారత దేశానికి సరఫరా చేసే ఆహారంలో అనారోగ్యకర షుగర్‌ను చేర్చాయని దీని వల్ల చిన్న పిల్లలకు ఊబకాయం, పాలపండ్లు పుచ్చిపోవడం, హృదయ సంబంధ వ్యాధులు లాంటివి వస్తున్నాయని స్విట్జర్లాండ్‌కు చెందిన పబ్లిక్ ఐ అనే సంస్థ పరిశీలించి, పరిశోధించి ప్రకటించింది. ఇది నిజమేఅన్నట్లుగా ఈ మధ్య కాలంలో లాన్సెట్ ప్రచురించిన ఒక వ్యాసంలో భారతదేశంలో 9 నుంచి 12 నెలల మధ్య వయస్సున్న చిన్న పిల్లల్లో కోటీ 20 లక్షల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని, ఇది అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందని ఆ వ్యాసంలో పరిశోధన వివరాలు వెల్లడించాయి. అంటే దేశంలో నెస్లే వాడిన పిల్లలందరూ జబ్బున పడుతున్నట్లేనని స్విట్జర్లాండ్ కంపెనీ ప్రకటిస్తే తప్ప మనకు తెలియదు. దీనిపై కూడా కేంద్రం ఇప్పటివరకు నిషేధ నిర్ణయం లేదా వాటిని సమూలంగా పరీక్షించే నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమైన విషయం.

ఇటు దేశీయ కంపెనీలు, అటు బహుళజాతి కంపెనీలు ఆరోగ్యం కోసం, ఆకలి తీర్చడం కోసం చేసే ఉత్పత్తులు ప్రాణాంతకంగా మారుతున్నాయంటే మనమెలా బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అన్ని ఆహార ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించేందుకు సంస్థలయితే పేరుకు ఉన్నాయి. కాని వాటి పని తీరు ఏమిటో ఎవరికీ తెలియని బ్రహ్మ పదార్థంలా తయారైంది. పాలన సాగిస్తున్న పాలకులు ఆహార, ఫార్మా కల్తీలపై ఉక్కు పాదం మోపి నిర్ణీత కాల వ్యవధి లోపు కఠిన శిక్షలు విధిస్తే తప్ప ప్రజలు బతికి బట్టకట్టలేని పరిస్థితులున్నాయి. కేంద్రం ఆహార నాణ్యతను నిర్ధారించే సంస్థలకు మరిన్ని అధునాతన ల్యాబ్‌లు, పరికరాలు, అవసరమైన సిబ్బంది ఇస్తే తప్ప దేశీయ ఆహార, ఫార్మా ఉత్పత్తుల నాణ్యత మిథ్యగానే మిగిలిపోనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News