Saturday, July 27, 2024

పాకిస్థాన్‌కు అంగుళం జాగా ఇవ్వం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: విదేశీ దౌత్య ప్రతినిధి బృందం ఒకటి గురువారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లోయలో పరిస్థితిని సమీక్షించేందుకు ఈ బృందం వచ్చింది. 16 మంది విదేశీ రాయబారులు, సీనియర్ దౌత్యవేత్తలతో కూడిన ఈ బృందంలో అమెరికా అంబాసిడర్ కెన్నీత్ జస్టర్ కూడా ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు కూడా ఈ బృందం వెంట ఉన్నారు. శ్రీనగర్ ఇతర ప్రాంతాలలో ఈ బృందం పర్యటించింది. ఈ ప్రాంతంలో ఇప్పటి శాంతి భద్రతల పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు, పరిస్థితిపై ఒక అంచనా వేసేందుకు విదేశీ ప్రతినిధి బృందం రావడం రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఈ బృందాన్ని శ్రీనగర్‌లోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లారు. వారు అక్కడక్కడ స్థానిక సంస్థల సభ్యులతో, పలు స్వచ్ఛంద సేవా సంస్థల వారితో ముచ్చటించారు.

కశ్మీర్‌పై పాకిస్థాన్ దుష్ప్రచారానికి దిగుతోందని, ఇక్కడ రక్తపాతం జరుగుతోందనే వార్తలు అసత్యమని ఈ బృందానికి ఇక్కడి వారు తెలిపారు. ఎటువంటి హింసకు తావులేకుండా ప్రభుత్వం ఆగస్టులో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పరిస్థితి కుదుటపడిందని విదేశీ బృందానికి వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పారు. అయితే దైనందిన జనజీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయితే శాంతి భద్రతల పరిరక్షణ దిశలో ఈ బాధలు అత్యల్పం అని ప్రజలు వారికి చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఏమీ చేయలేని స్థితిలో పాకిస్థాన్ ఇప్పుడు నిస్పృహతో ఉందని, పాకిస్థాన్‌కు ఇక్కడి అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని స్థానికులు ఈ బృందానికి స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన విదేశీ రాయబారుల బృందంలో దక్షిణ కొరియా, నార్వే, వియత్నా, అర్జెంటీనియా, బ్రెజిల్, ఫిజీ, బంగ్లాదేశ్, పెరూ ఇతర దేశాల వారు కూడా ఉన్నారు.

Foreign diplomatic delegation Visits to Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News