Saturday, May 4, 2024

18 మంది విద్యార్థుల పై బహిష్కరణ వేటు

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్ : విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారి , వైస్ ఛాన్సలర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారుల పైన దాడికి దారి తీసిందన్న నేరారోపణపై 18 మంది విద్యార్థుల పైన, మరోఆరుగురు బయటివారి పైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ కఠిన చర్యలు తీసుకుంది. వీరందరినీ యూనివర్శిటీ నుంచి బహిష్కరించింది. అంతేకాదు వీరు పరీక్షలు రాయడానికి కానీ, క్యాంపస్ లోకి అడుగుపెట్టడానికి, లేదా హాస్టల్ లో చేరడానికి వీలు లేదని నిషేధించింది. బహిష్కరణకు గురైన వీరంతా విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యాపరిషద్ ( ఎబివిపి) కి చెందిన వారు. అధిక ఫీజులు, పరీక్షల నిర్వహణలో అపసవ్యం, రీసెర్చిస్కాలర్ల సమస్యలు, హాస్టల్ కేటాయింపులో అవకతవకలు తదితర సమస్యలపై జులై 21న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్‌ఛాన్సలర్ రాజేష్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు తమ కార్యాలయాల నుంచి బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడడానికి ప్రయత్నించారు.

కానీ కొంతమంది విద్యార్థులు వైస్‌ఛాన్సలర్ పైన, ఇతర అధికారులపైన దాడి చేశారు. విసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ విధ్వంస కాండ వీడియోలో వైరల్ అయింది. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్, జ్యుడీషియల్ దర్యాప్తు సంఘాలు సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులు 18 మందితో పాటు మరో ఆరుగురిని బహిష్కరించడానికి నిర్ణయం తీసుకోవడమైందని యూనివర్శిటీ చీఫ్ ప్రోక్టర్ సత్యపాల్‌సింగ్ ఆదివారం వెల్లడించారు. అయితే ఈ చర్యను ఎబివిపి గోరక్షప్రాంత్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తీవ్రంగా ఖండించారు. ఇది విద్యార్థులు చదువుకొనే హక్కును లేకుండా చేయడమేనని ధ్వజమెత్తారు. ఎబివిపి సభ్యులను బహిష్కరించినంత మాత్రాన విద్యార్థుల సమస్యలు తీరిపోవని, ఈ సమస్యలపై తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News