Thursday, May 2, 2024

గ్రిడ్ డైనమిక్స్ వస్తోంది

- Advertisement -
- Advertisement -

సంవత్సరాంతానికి వెయ్యి మందితో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ వెల్లడించింది. 1000మంది ఉద్యోగులతో రానున్నట్టు తెలియజేసింది. సోమవారం నాడు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.- నగరంలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో పాటు అద్భుతమైన ఏ గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ సిఇఒ లీయోనార్డ్ లివ్స్‌చిట్జ్ (Leonard Livschitz ) సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నింటికన్నా ప్రధానంగా ఉన్నత విద్యా ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఇక్కడ అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా కెటిఆర్‌తో ప్రస్తావించారు. అందుకే తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు భారత్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నామన్నారు.

నగరం అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలియజేశారు. ఇందులో భాగంగానే గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ నగరాన్ని తన కార్యకలాపాలకు ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సదరు కంపెనీని హైదరాబాద్ నగరానికి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరం కేంద్రంగా కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీకి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ అనేక రకాలైన మల్టీ నేషనల్ కంపెనీలను, ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్శించిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. గ్రిడ్ డైనమిక్ కంపెనీ తన కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ వారికి హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News