Friday, March 29, 2024

ఆమ్దానీ ఆదుర్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్రంలో ఆర్ధికాభివృద్ధిని సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ఫార్ములా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) రికార్డుస్థాయిలో పెరిగింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి (ఉత్పత్తి విలువ) సంపాదన రికార్డు స్థాయిలో 11,48,115 కోట్ల రూపాయలకు పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఐ.టి. ఫార్మా, రియల్ ఎస్టేట్, పర్యాటకం, మెడికల్ టూరిజం రంగాల్లో జరుగుతున్న వర్తక, వాణిజ్యంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను ప్రోత్సహించడం మూలంగా జరుగుతున్న ఎకనమిక్ యాక్టివిటీతోనే ఈ ఘనతను సాధించినట్లుగా ఆర్ధికశాఖ వర్గాలు సగర్వంగా చెబుతున్నారు. ప్రధానమంత్రి సారద్యంలో పనిచేసే నీతి ఆయోగ్ సంస్థ కూడా తెలంగాణ రాష్ట్రంలో 2021-22వ సంవత్సరంలో జి.ఎస్.డి.పి. ఏకంగా 11,48,115 కోట్లకు పెరిగిందని నివేదించడం ముమ్మాటికీ ప్రభుత్వ పథకాలు సాధించిన ఘనతేనని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన మొదటి సంవత్సరం(2014)లో రాష్ట్ర జి.ఎస్.డి.పి. కేవలం 4,51,580 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. బి.ఆర్.ఎస్.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల మూలంగా 2022వ సంవత్సరం నాటికి జి.ఎస్.డి.పి. ఏకంగా 11,48,115 కోట్ల రూపాయలకు పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టంచేసింది. అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణలో అమలులో ఉన్న పథకాలు తమతమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని అడుగుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు ప్రవేశపెట్టిన పథకాలు, వ్యవసాయ రంగంలోని పథకాలు సత్పలితాలు ఇస్తుండటంతో జి.ఎస్.డి.పి. రికార్డుస్థాయిలో పెరిగింది.

రాష్ట్రంలోని సుమారు నాలుగు కోట్ల మంది జనాభాలో 68 శాతం మంది వ్యవసాయ రంగంపైనే అధారపడంతో వారిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తు, రైతుబంధు, దళిత బంధు, కుల వృత్తులపై ఆధారపడే ప్రజలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు గొర్రెలు, మేకలు, చేపల పంపిణీ పథకాలు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఎకనమిక్ యాక్టివిటీని పెంచాయని, అందుకే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి-ఒక ఏడాదిలో ప్రజలందరి సంపాదన, కృషి విలువ) రికార్డు స్థాయిలో 11,48,115 కోట్ల రూపాయలకు పెరిగిందని నీతి ఆయోగ్ నివేదికలు స్పష్టంచేశాయి. అంతేగాక ఈ పథకాల పుణ్యమా అని తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు ఏడాదికి 2,75,443 (తలసరి ఆదాయం) రూపాయలను సంపాదిస్తున్నారు. అదే కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలకు అద్దంపట్టే విధంగా కేంద్ర తలసరి ఆదాయం కేవలం 1,50,007 రూపాయలు మాత్రమే ఉంది.

అంటే కేంద్రం కంటే తెలంగాణలోనే తలసరి ఆదాయం 1.25 లక్షల రూపాయలు అధికంగా ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆర్ధిక విధానాలు విజయవంతం కావడంతోనే అన్ని రాష్ట్రాలకన్నా, కేంద్ర ప్రభుత్వం కన్నా ఆర్ధిక గణాంకాలు తెలంగాణ ఆర్ధిక గణాంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టంచేసింది. అంతేగాక అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే క్యాపిటల్ వ్యయం కేటగిరీలో కూడా తెలంగాణ ప్రభుత్వమే దేశానికి, ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2014-15వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి ఆర్ధిక సంవత్సరంలో క్యాపిటల్ వ్యయం కింద కేవలం 11,583 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా 2021-22వ ఆర్ధిక సంవత్సరం నాటికి రికార్డుస్థాయిలో 61,343 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డును సృష్టించినట్లుగా నీతి ఆయోగ్ గుర్తించిందని ఆ అధికారులు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపై 87 శాతం (క్యాపిటల్ వ్యయం) అదనంగా నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. దీంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ గుర్తించిందని వివరించారు. అంతేగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి అనుసరించిన విధివిధానాలు నీతి ఆయోగ్‌ను మరింతగా సంతృప్తి పరిచాయని వివరించారు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి పన్నుల భారాన్ని మోపకుండా, విద్యుత్తు చార్జీలను కూడా మోపకుండా, ప్రభుత్వ ఖర్చుల్లో ఎలాంటి నిధుల దుబారాలను అరికడుతూ, అమలులో ఉన్న పన్నుల ఆదాయంలో ఎలాంటి లొసుగులు లేకుండా పక్కాగా పాలన సాగిస్తుండటంతోనే ఖజానాకు నిధుల రాబడి పెరిగిందని, అందుకే రాష్ట్ర సొంత ఆదాయం 2022వ ఏడాదిలో ఏకంగా 92,910 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని వివరించారు.

ఇలా సొంత రాబడులను నీతి ఆయోగ్ కూడా పరిశీలించి, ఆ డేటాను తమ నివేదికలో పొందుపరిచిందని ఆ అధికారులు వివరించారు. వ్యవసాయ రంగానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి పంటపొలాలకు పుష్కలంగా సాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా భారీ ప్రాజెక్టులను నిర్మించడం, మిషన్ కాకతీయ పథకంలో చెరులన్నింటినీ పునరుద్ధరించి వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉండేటట్లుగా నదీ జలాలను చెరువులకు తరలించడం, నిరంతరం నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించడం వంటి కార్యక్రమాలతో ఒక కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీరందుతోందని, దాంతో వ్యవసాయ ఉత్పత్తులు రికార్డుస్థాయిలో పెరిగాయని వివరించారు. అందుకే జి.ఎస్.డి.పి.కూడా భారీగా పెరిగిందని సగర్వంగా చెబుతున్నారు.

విద్యావేత్తలు, పట్టభద్రులు, నిరక్షరాస్యులు, కులవృత్తుల వారు, కార్మికులు, స్కిల్డ్ లేబర్, వ్యవసాయ కూలీలు… ఇలా ఒక్కటేమిటీ సమస్త కష్టజీవులకు చేతినిండా పనిదొరుకుతుండటంతోనే ఎకనమిక్ యాక్టివిటీ తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని వివరించారు. అందుకే బీహార్, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాంఛల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారని, తెలంగాణ రాష్ట్రనికి వెళితే ఏ పనినైనా చేసుకొని బతకవచ్చుననే నమ్మకం, విశ్వాసం దేశంలోని కార్మికలోకానికి ఒక నమ్మకం, భరోసాలు ఏర్పడ్డాయని వివరించారు. అందుకే నిర్మాణ రంగం, హోటళ్ళు, రెస్టారెంట్లు, పరిశ్రమలు తదితర రంగాల్లో తెలంగాణ వారి కంటే పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులే అధికంగా ఉపాధిని పొందుతున్నారని తెలిపారు. ఈ మొత్తం పరిణామాలు జి.ఎస్.డి.పి రికార్డుస్థాయిలో పెరగడానికి కారణాలయ్యాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News