Wednesday, April 24, 2024

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

 LV Prasad Eye Hospital

 

సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రిని సోమవారం ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహిత, ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ జి. నాగేశ్వర్‌రావు, హెటిరో డ్రగ్గిస్ట్ అధినేత పార్థసారధిరెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. సిఎం కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసి లక్షలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ పాలనలో సిద్దిపేటతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు.

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆశయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. టెక్నాలజీకి బానిస కావద్దని , అవసరాలకు తప్ప అనవసరంగా సోషల్ మీడియాను వాడుకోవద్దని ఆయన యువతకు సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత, ఎల్‌వి ప్రసాద్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు, హెటిరో డ్రగ్గిస్ట్ అధినేత పార్థసారధిలు ముందుకు వచ్చి సిద్దిపేటలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలనే లక్షంతో కెసిఆర్ హైదరాబాద్‌లో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు కోసం 10 ఎకరాల భూమిని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ సెంటర్ నిర్మాణానికి సాయి సింధు ఫౌండేషన్, హెటిరో డ్రగ్గిస్ట్ అధినేత పార్థసారధిరెడ్డి రూ. 400 కోట్లు అందించారన్నారు. వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తేనే త్వరగా నయం చేసుకోవచ్చన్నారు.

సిద్దిపేటలో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే స్కానింగ్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించుకోబోతున్నామన్నారు. మాతృ దేశానికి సేవ చేయాలన్న లక్షంతో డాక్టర్ జి. నాగేశ్వర్‌రావు 1986 లో హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభించారని పేర్కొన్నారు. హెటిరో డ్రగ్గిస్ అధినేత పార్థసారధి సైతం సాయి సింధు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. చిన్నపాటి ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించి నేడు హెటిరో డ్రగ్గిస్ట్ కంపెనీ ద్వారా 18 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది పార్థసారధియేనని కొనియాడారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రిలో ఉండే కార్పొరేట్ స్థాయి సదుపాయాలను సిద్దిపేట ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రిలో కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఎంఎల్‌సి కూర రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, అత్తర్ పటేల్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, జాప శ్రీకాంత్, ఎల్‌వి ప్రసాద్ సంస్థ ప్రతినిధులు రోహిత్ కన్నా, రాజశేఖర్, నాక్టో ప్రతినిధి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.

Harish rao is opened LV Prasad Eye Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News