Tuesday, October 15, 2024

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని వర్షాలు వదలటంలేదు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌ను మళ్లీ తడిపేశాయి. ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న ఆకాశాం ఒక్కసారిగా కుండపోత వర్షం కుమ్మరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రొడ్లు జలమయంగా మారాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం జగద్గిరిగుట్ట ,జీడిమెట్ల, ముషీరాబాద్, దిల్‌సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని కొల్లూరులో 115.2మి.మి వర్షం కురిసింది. మహబూబాదాద్‌లో 114.7, బయ్యారంలో 105జ7, అల్లూడ్‌లో 103, వైరాలో 90.9, గార్లలో 87, నేలకొండూరులో 87, డోర్నకల్‌లో 76 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కుసిరింది.

రాగల మూడు రోజలు వర్షాలు:
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్ధపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు సిద్దం అయ్యారు. ఏవైనా వరద సమస్యలు తలెత్తితే వెంటనే సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

తెలంగాణలో రేపు భారీ వర్షాలు :
మరోవైపు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అల్పపీడనం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

తరువాత ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News