Sunday, April 28, 2024

అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని కిస్సింజర్స్ అసోసియేట్స్ తెలిపింది. అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ హయాంలో ఆయన రెండు పర్యాయాలు విదేశాంగ మంత్రిగా పని చేశారు. 1923 మే 7న కిసింజర్ జర్మనీలో జన్మించారు. ఆయన కుటుంబం 1938లో అమెరికాకు వలస వెళ్లిన తరువాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో చేరారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా పొందారు. అక్కడే 17 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. వియత్నాం యుద్ధాన్ని అమెరికా విరమించుకోవడంలో కీలక పాత్ర వహించినందుకు 1973లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ హయాంలో చైనాతో అమెరికా సంబంధాలు ప్రారంభం కావడానికి ప్రముఖ పాత్ర వహించారు. 197172 లో బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి భారత్ పాకిస్తాన్ మధ్యయుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్‌కు నిక్సన్ మద్దతు ఇచ్చేలా చేశారు.

ఇందిరాగాంధీ హయాంలో ఆమె పట్ల వ్యతిరేకత చూపించారు. పాకిస్తాన్ యుద్ధానికి కొంతకాలం ముందు ఇందిరా గాంధీతో నిక్సన్, కిసింజర్ భేటీ కావడం, ఆ తరువాత వీరిద్దరూ సాగించిన సంభాషణ టేపు తరువాత బయటపడింది. ఈ సంభాషణల్లో ఇందిరాగాంధీని మంత్రగత్తెగా విమర్శించడం , భారతీయులపై దుర్భాషలాడడం తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఆ తరువాత ఈ వ్యాఖ్యలకు చింతిస్తున్నానని , ఇందిరను తాను గౌరవిస్తున్నానని పొరపాటును సర్దుకున్నారు. అరబ్ ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. సిరియా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలకు ముగింపు పలికారు. నాటి సోవియెట్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి చైనాతో మైత్రి పెంచగలిగారు. ఇటీవల అమెరికా, చైనా సంబంధాలు దెబ్బతిన్న సమయం లోనూ చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ ఆయ్యారు. ఇందిరా గాంధీతో ఎంత వ్యతిరేకంగా ఉండేవారో మోడీ ప్రధాని అయిన తరువాత భారత్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటించినప్పుడు కిస్సింజర్ వీల్‌ఛైర్‌లో ఉండీ హాజరయ్యారు.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లంచ్‌లో మోడీ స్పీచ్ వినేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మోడీతో కొంతసేపు ముచ్చటించారు. అమెరికా అధికారవర్గాలు, ప్రముఖ నేతలు కిసింజర్ మృతికి సంతాపం ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జార్జిబుష్, న్యూయార్క్ సిటీ మేయర్ మైకేల్ బ్లూమ్‌బెర్గ్, తదితరులు నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News