Saturday, July 27, 2024

వరవరరావుకు కాటరాక్ట్ వెసులుబాటు

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎల్గార్ కేసు నిందితుడు కవి పెండ్యాల వరవర రావు కంటి ఆపరేషన్‌కు హైదరాబాద్‌కు వెళ్లేందుకు స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ ప్రత్యేక కోర్టు గురువారం ఈ మేరకు ఆయనకు వీలు కల్పిస్తూ రూలింగ్‌వెలువరించింది. 2018 ఎల్గార్ పరిషత్ మావోయిస్టు లింక్‌ల కేసులో వరవరరావుపై అభియోగాలు ఉన్నాయి. తనకు ఎడమ కంటికి కాంటరాక్ట్ ఆపరేషన్ అవసరం అని, హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని నిందితుడు విన్నవించుకున్నారు. దీనిపై న్యాయమూర్తి రాజేష్ కటారియా తమ ఆదేశాలు వెలువరించారు. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 11 మధ్యలో నిందితుడు హైదరాబాద్‌కు వెళ్లిరావచ్చునని న్యాయమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లో తాను ఉండే నివాసం చిరునామా , కాంటాక్టు నెంబరును వరవర రావు డిసెంబర్ 4వ తేదీన తమకు అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయనకు కల్పించే స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగపర్చుకోరాదని షరతు పెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆయన వైద్య చికిత్సల కారణాలపైనే బెయిల్‌పై ఉన్నారు.

2021 మార్చిలో ముంబై హైకోర్టు ఆయనకు ఈ తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తరువాత ఇదే ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఆయనకు 2022 ఆగస్టులో బెయిల్ వెలువరించింది. గతవారం ఆయన హైదరాబాద్‌కు వెళ్లి కుడి కంటికి ఆపరేషన్ చేసుకునేందుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన రెగ్యులర్ బెయిల్ మేరకు నిందితుడు వరవరరావు ముంబైలోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు పరిధిలోనే ఉంటూ , ఎప్పటికప్పుడు తన కదలికలను తెలియచేయాల్సి ఉంటుంది. వైద్య కారణాలతో హైదరాబాద్‌కు వెళ్లడానికి సంబంధిత కోర్టుల అనుమతి తీసుకోవల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. 2017 డిసెంబర్ 31వ తేదీన పుణేలో ఎల్గార్ పరిషత్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రావు ఇతర వామపక్ష భావజాలపు కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలకు దిగారని, వీరి ప్రసంగం దేశద్రోహం పరిధిలోకి వస్తుందనే తీవ్ర అభియోగాలతో వరవరరావు ఇతరులు జైళ్లలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News