Saturday, October 5, 2024

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్ మృతి

- Advertisement -
- Advertisement -

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో హెజ్‌బొల్లా శ్రేణుల్లో భయాందోళనలు సృష్టించిన ఇజ్రాయెల్ శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌లో క్షిపణులు ప్రయోగించింది. దీంతో మృతుల సంఖ్య 31 కి పెరిగింది. శుక్రవారం దాడుల్లో మృతుల్లో హెజ్‌బొల్లా నెం.2 నేత ఇబ్రహీం అకీల్ ఉన్నాడని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం వెల్లడించింది. ఇబ్రహీం అకీల్ మృతిని హెజ్‌బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు. అకీల్‌పై అమెరికా 1980 లోనే ఆంక్షలు విధించింది. 1983 లో బీరుట్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అకీల్ కీలక పాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో లెబనాన్ ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ 31 మంది మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలియజేశారు.

గాయపడిన 68 మందిలో 15 మంది ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. 2006 నుంచి హెజ్‌బొల్లాఇజ్రాయెల్ సంఘర్షణ సాగుతూనే ఉంది. హెజ్‌బొల్లా ప్రత్యేక దళం రద్వాన్‌కు ఇన్‌ఛార్జిగా ఇబ్రహీం అకీల్ ఉంటున్నాడు. ఒక భవనంలో మిలిటెంట్ గ్రూపుకు చెందిన 12 మందితో భవనం కింది భాగంలో సమావేశం జరుపుతుండగా ఇజ్రాయెల్ దాడి జరిగింది. ఆ భవనం మొత్తం కూల్చివేశారు. ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు వస్తుండగా, అలాగే స్కూళ్ల నుంచి విద్యార్థులు తిరిగి వస్తున్న రద్దీ సమయంలో ఈ దాడులు జరిగాయి. శనివారం ఉదయం హెజ్‌బొల్లా మీడియా కార్యాలయం ఇజ్రాయెల్ దాడులు జరిపిన ప్రదేశానికి జర్నలిస్టు బృందాలను తీసుకెళ్లింది.అక్కడ శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. శిథిలమైన భవనం చుట్టూ లెబనాన్ దళాలు దిగ్బంధం చేశాయి. లెబనీస్ రెడ్‌క్రాస్ దళాలు ఆ భవనం వద్ద నిలబడి బయల్పడిన శవాలను తీసుకెళ్లడానికి నిరీక్షించడం కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News