Monday, December 2, 2024

ప్రజాస్వామ్యమంటే… మెజారిటీ వర్గాల క్రూరత్వం కాదు

- Advertisement -
- Advertisement -

‘మన చట్టాలలో మెజారిటీ అనే ప్రక్రియ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారాలు చూస్తుంటాం. ఇది అన్ని చోట్ల వర్తింపజేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది చాలా ప్రమాదకరమైన సూత్రీకరణ కూడా. కొన్ని కార్యకలాపాలు సజావుగా జరగడానికి దీనిని వెసులుబాటుగా చూసుకోవాలి. దీనిని అతిగా అన్ని విషయాల్లో వర్తింప జేయకూడదు. కొన్ని సందర్భాల్లో మెజారిటీ పాలన చాలా ప్రమాదకరం కూడా’ బాబా సాహెబ్ అంబేడ్కర్ 1947 సెప్టెంబర్, 25వ తేదీన తాను బొంబాయిలో స్థాపించిన సిదార్థ కళాశాలలో జరిగిన సమావేశంలో చేసిన ప్రసంగంలోని మాటలివి. సరిగ్గా అప్పుడు రాజ్యాంగ సభ సమావేశాలు జరుగుతున్న సమయమది. ఆయన మనసులో రాజ్యాంగ రూపకల్పన మీద జరుగుతున్న మథనం నుంచి పుట్టిన వాక్యాలివి. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్న, పొందుపరిచిని అనేక అంశాలలో ఇటువంటి ఆలోచనలు చోటుచేసుకున్నాయి.

మైనారిటీ అనగానే కేవలం ఒక మతపరమైన అంశం కాదని, మైనారిటీ అంటే కేవలం సంఖ్యాపరమైన అంశం మాత్రమే కాదని, అన్ని రకాల వివక్షలకు అణచివేతకు, దోపిడీకి గురవుతున్న వర్గాలు కూడా ఇటువంటి నిర్వచనంలోకి వస్తాయని 1919 లో సౌత్‌బరో కమిటి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా. ప్రస్తుతం మనం రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంలో ఉన్నాం. ఇది సుదీర్ఘ కాలం కాకపోయినా, మన రాజ్యాంగాన్ని సమీక్షించుకోవడానికి, రాజ్యాంగ నిర్మాతలు దార్శనికత గురించి మననం చేసుకోవడానికి ఇది సందర్భం కాకతప్పదు. ఒక తెలంగాణ బిడ్డగా రాజ్యాంగం విశిష్టితను ఎట్లా అర్థం చేసుకున్నాననేది ఇక్కడ ప్రస్తావన.
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి పదేళ్ళు దాటింది. అయితే ఆ రాష్ట్రం ఏర్పడడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. వందల మంది బలిదానాలు, మరెందరో త్యాగాలు, ఇంకెందరో తమ జీవితాలను పణంగా పెట్టడం జరిగింది. దాదాపు అరవై సంవత్సరాల నిరంతర పోరాటాల ఫలితంగా తెలంగాణ సాకారం అయిందని చెప్పకుంటాం.

అది నిజమే. అందులో సందేహామేమీలేదు. అయితే తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలకమైన అంశం మొదటి పేరాలో పేర్కొన్న విధంగా మైనారిటీ అంశం. ఆశ్చర్యంగా ఉంది కదూ. మైనారిటీ అనే అవగాహాన మీదే ఆధారపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం కానీ మరే రాష్ట్రం కానీ నూతనంగా ఏర్పడాలంటే, ఆ నిర్ణయం చట్టరూపం దాల్చాలి. అది పార్లమెంటు ఆమోదంలో జరగాలి. దానికి రాజ్యాంగం ఒక ప్రాతిపదికను, ఒక విధానాన్ని కలిగి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం, నూతన రాష్ట్రం ఏర్పడడానికి, సరిహద్దులు నిర్ణయించడానికి, ఒక రాష్ట్రాన్ని విభజించడానికి గాని, రెండు రాష్ట్రాలను కలపడానికి గాని ఈ ఆర్టికల్ అవకాశాన్ని కల్పిస్తున్నది. అంతే కాకుండా, రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిలుకు చట్టరూపం ఇవ్వాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ముందు బిల్లు ముసాయిదాను సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి. ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాలి. కేవలం అభిప్రాయం మాత్రమే. రాష్ట్ర అసెంబ్లీ ఎటువంటి అభిప్రాయం తెలియజేసినా అంతిమ నిర్ణయం పార్లమెంటుదే. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని అంగీకరించాలని లేదు. అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పెద్దగా అడ్డంకి రాలేదు.

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించుకోవాలి. భారత రాజ్యాంగం మొదటి డ్రాఫ్ట్‌ను రాజ్యాంగ నిపుణులు బి.ఎన్. రావు రూపొందించారు. ఆయన చాలా దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ విషయంలో ఆయన అభిప్రాయం వేరు. నూతన రాష్ట్రాల ఏర్పాటు జరగాలంటే ఏ రాష్ట్రం నుంచేతే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కావాలి. ఆ రాష్ట్ర అసెంబ్లీ అంగీకరిస్తేనే అంటే శాసన సభ ఆ బిల్లును ఆమోదిస్తేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు జరుగుతుంది. ఇది రాజ్యాంగం మొదటి ముసాయిదాలోని అంశం. అయితే రాజ్యాంగ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ అయ్యారు. ఆ తర్వత బి.ఎన్. రావు రూపొందించిన మొదటి డ్రాఫ్ట్‌లోని ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, మళ్ళీ ఇంకొక డ్రాఫ్ట్‌ను రూపొందించారు. రాజ్యాంగ సభలో ప్రతి ఆర్టికల్ మీద చర్చ జరిగింది. కొన్ని ఆర్టికల్స్ మీద సుదీర్ఘ చర్చ జరిగితే, మరికొన్నింటి విషయంలో సంక్షిప్తింగానే చర్చలు జరిగాయి. ఆర్టికల్ -3 పైన కూడా చాలా మంది రాజ్యాంగ సభ సభ్యులు మాట్లాడారు. అయితే బాబా సాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా ప్రతిని ఆర్టికల్3కు చేసిన సవరణ రాజ్యాంగ సభలో ఆమోదం పొందింది.

గత పదేళ్ళ కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ తన ఆమోదం తెలుపలేదు. ఆ బిల్లును తిరస్కరిస్తున్నట్లు బిల్లును పంపించింది. కానీ రాష్ట్రపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ తీర్మానాన్ని పక్కన పెట్టి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. చివరకు అది ఆమోదం పొందింది. ఒకవేళ బి.ఎన్. రావు రూపొందించిన విధంగా ఆర్టికల్3లో రాష్ట్రాల శాసన సభలే నిర్ణేతలై ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభలో మొత్తం 294 స్థానాలుండగా, 175 ఆంధ్ర ప్రాంతానికి, కేవలం 119 తెలంగాణ ప్రాంతానికి చెంది ఉన్నాయి. మెజారిటీ ఆంధ్ర ప్రాంతానికే ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అసాధ్యం. ఇదే విషయాన్ని బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో వెల్లడిస్తూ, ఒకవేళ రాష్ట్ర శాసన సభలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తేనే రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందంటే, మైనారిటీ ప్రాంత ప్రజలు తమకు నూతన రాష్ట్రం కావాలంటే ఎన్నటికీ జరిగే పనికాదు. మెజారిటీ ప్రాంతం, మైనారిటీ ప్రాంతం మీద చేసే ఎటువంటి వివక్షకు, అణచివేతకు, పరిష్కారం దొరకదు. అందువల్ల రాష్ట్ర శాసన సభకు కేవలం అభిప్రాయం తెలిపే అవకాశం మాత్రమే ఉండాలి. అంతిమంగా పార్లమెంటు మాత్రమే నిర్ణయాధికారం కలిగి ఉండాలి” అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పారు.

బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎంతో దార్శనికతలో వ్యవహరించడం వల్ల దేశం ఐక్యంగా ఉండగలిగింది. ఎన్నో ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరి తమ ప్రగతికి నూతన రాష్ట్రాలను సాధించుకున్నారు. మద్రాసు నుంచి ఆంధ్రప్రాంతం విడవడానికి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. ఒకవేళ రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశం లేకపోతే, మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంలో అవతరించడం సాధ్యమయ్యేది కాదు. ఆ తర్వాత పంజాబ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్, బీహార్ నుండి జార్ఖండ్, మధ్య ప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌లు నూతన రాష్ట్రాలుగా ఏర్పడడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులే ఆధారం.

అందుకే బాబా సాహెబ్ అంబేడ్కర్ తన మైనారిటీ అనే విస్తృత అవగాహనను ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు. అంతేకాకుండా మైనారిటీ అనే భావన రాజకీయ, సామాజిక, మత, భాష అనే అనేక అస్తిత్వాలకు వర్తింపజేశారు. నిజానికి ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిన అంశాలన్నీ మైనారిటీల రక్షణకే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆర్టికల్ 14, 15, 16 లు చట్టం ముందు అందరూ సమానమనే భావనను ముందుకు తీసుకొచ్చింది. ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన అనే అంశం. ఇది సామాజిక మైనారిటీలకు, షెడ్యూల్డ్ కులాల రక్షణకు వర్తించేది. 18, 19, 20, 21 ఆర్టికల్స్ రాజకీయంగా మైనారిటీలు లేదా ప్రభుత్వాలకు రాజకీయ వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన వర్గాల రక్షణకు పొందుపరిచారు.

ఆ తర్వాత ఉన్న ఆర్టికల్స్‌లో ఎక్కువ భాగం మతపరమైన మైనారిటీల రక్షణ బాధ్యతను పొందుపరిచారు. అంటే ప్రభుత్వాలు నడిపే వర్గాలు ఆధిపత్య వర్గాలుగా ప్రజలందరి మీద అధికారాన్ని చెలాయిస్తారు. అందువల్ల కుల, మత, భాష, ప్రాంత, జాతి, తెగలలో మైనారిటీలుగా ఉన్న వర్గాలు ఆధిపత్య పాలక వర్గాల దాడులకు, అణచివేతలకు గురవుతుంటారు. అందువల్ల అంబేడ్కర్ తన తాత్విక శక్తితో రాజ్యాంగాన్ని అన్ని రకాలు అణగారిన వర్గాల రక్షణకు ఒక ఆ యుధంగా రూపొందించారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ ఈ విషయంలో బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ అభిప్రాయాలను తన వాదనకు మద్దతుగా తెచ్చుకుంటారు. ఆయన కూడా ప్రజాస్వామ్యమంటే మెజారిటీ వర్గాల క్రూరత్వం కాకూడదని హెచ్చరించారు. మెజారిటీ శక్తితో వ్యతిరేక వర్గాలను అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్య దృక్పథం కాదని కూడా బర్క్ తేల్చిచెప్పారు. అందుకే భారత దేశంలో ఇంకా ఎక్కడో కొంత ప్రజాస్వామ్య ఆశలు ఉన్నాయింటే, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచనిన హక్కులే అన్న విషయాన్ని మర్చిపోరాదు. భారత రాజ్యాంగం 75 ఏళ్ళ పండుగ జరుపుకుంటున్న ఈ సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ దూరదృష్టిని, రాజనీతిజ్ఞతను స్ఫూర్తిగా తీసుకోవాలి.

మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News