Thursday, February 22, 2024

అప్పటి రూపం సాధ్యమే!

- Advertisement -
- Advertisement -

 body shape

 

అమ్మాయి అమ్మయిన తర్వాత ఎన్నో బాధ్యతలు, పనులు పెరిగిపోతాయి. గారాల పండు పాలన, పోషణలో అమ్మ చిక్కి సగం అవుతుంది. శారీరకంగా, మానసికంగా చెప్పలేనన్ని మార్పులు వస్తాయి. లెక్కలేనన్ని సందేహాలు వస్తాయి? నేను నేనేనా? మళ్లీ మామూలుగా అయిపోతానా? నా పనులకు హాజరయినప్పుడు పూర్వపు రూపం, అందంతో ఉంటానా? అందుకోసం ఇప్పుడేం చేయాలి? ఇలా రకరకాల సందేహాలు మనసునిండా… హార్మోన్‌ల మార్పులు శరీరం ఆకారాన్ని మార్చేస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు నిద్రలేమిని సూచిస్తూ బయటపడతాయి. పిగ్మెంటేషన్, తేలిపోయే కళ్లు, పగిలిన పెదాలు ఇవన్నీ విచారంలో ముంచెత్తుతాయి. కానీ పర్లేదు ఒక్క వారంలో, లేదా ఒక్క నెలలో పూర్వపు రూపంలోకి వచ్చేయొచ్చు అంటున్నారు నిపుణులు.

చక్కని చర్మం : ముందుగా చర్మంపైన దృష్టి పెట్టాలి. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ముఖ్యం. చర్మతత్వం అనుసరించి మంచి ఉత్పత్తులు తీసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి క్లెన్సర్ రాసుకుని తరువాత చక్కగా కడిగేసుకోవాలి. క్లెన్సర్ తొలగించేందుకు ఆల్కహాల్ ప్రీ టోనర్ వాడాలి. ఎక్కువ ఆయిలీ స్కిన్ అయితే జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ రుద్దాలి.
ముఖాన్ని శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్ రాసుకుని అప్పుడు కాస్త మేకప్ చేసుకోవచ్చు. ప్రైమర్ మేకప్ సమానమైన టోనింగ్ ఇస్తుంది. ఏదైనా పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని కనబడనీయకుండా చేస్తుంది.

కళ్లకింద మచ్చలు : పాపాయి పనులతో సరైన నిద్రలేక కళ్లకింద వలయాలు ప్రత్యక్షం అవుతాయి. కన్సీలర్ మచ్చలను కనబడనీయకుండా చేసి చర్మానికి సరైన రూపం ఇస్తుంది. స్కిన్‌టోన్ కంటే కొంచెం లైట్ షేడ్ ఎంచుకోవాలి. కళ్లకింద వాడే అండర్ ఐ క్రీమ్ కొంచెం ఎక్కువగా రాసుకోవాలి. దీనివల్ల కన్సీలర్ నుంచి ఎక్కువ మాయిశ్చరైజర్‌ను చర్మం తీసుకోకుండా ఉంటుంది.

ఫౌండేషన్ రాశాక కన్సీలర్ అవసరం ఉందేమో చూసుకోవాలి. చర్మం కాంతిగా ఉండేందుకు మంచి ఫౌండేషన్ వాడాలి. జిడ్డు చర్మానికి పౌడర్ ఆధారిత ఫౌండేషన్, పొడి చర్మానికి క్రీమ్ ఫౌండేషన్ వాడాలి. ఫౌండేషన్ నిలిచి ఉండేందుకు లూజ్ పౌడర్ కూడా వాడుకోవాలి.

అలా కళ్లు కూడా నిద్రలేమిని సూచిస్తూ అలసటగా కాంతి హీనంగా అయిపోతాయి. కొత్తగా తల్లయిన ప్రతివాళ్ల సమస్య ఇది. పగటివేళ క్లాసీ ఐ మేకప్‌తో కంటికి మెరుగులు దిద్దుకోవచ్చు. కాజల్ పెన్సిల్ కళ్లకు చక్కని అందం ఇవ్వగలదు. కళ్లకు ఇంకా మంచి రూపం కావాలంటే ఐ లైనర్ వాడొచ్చు.

పగిలిన పెదాలు : ఇప్పటి సీజన్ ప్రభావం, కొత్తగా తల్లయిన సందర్భంలో కూడా పెదవులు పగులుతూ ఉంటాయి ఇది అందరి సమస్య కూడా. స్నానం చేశాక టవల్‌తో పెదవులను నెమ్మదిగా మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. నెయ్యి రాస్తూ ఉంటే పెదవులు పగలవు. లేకుంటే జెల్లీ సరైన ప్రత్యామ్నాయం. అరగంటకోసారి రాస్తూ ఉంటే పెదవుల పగళ్లు పోతాయి. చక్కని రూపం కోసం లిప్‌బామ్ రాసి, పైన లిప్‌గ్లాస్ కవర్ చేయాలి. పెదవులు సహజ కలర్ హైలెట్ చేయాలంటే లిప్‌స్టెయిన్స్ వాడాలి. ఏం రాస్తున్నా, పాపాయి తల్లినని మరచిపోకూడదు. లిప్‌స్టిక్ రాస్తే పాపను ముద్దాడినప్పుడల్లా బుగ్గలకు అంటుకుంటుంది.

శిరోజాలు ముఖ్యం : పాపాయి పుట్టాక ముందుగా జుట్టు ఊడడం సమస్య అవుతుంది. జుట్టు కట్ చేయకుండా పొడుగ్గానే ఉంచుకుంటేనే బాగుంటుంది. రాలిపోతున్న జుట్టు మళ్లీ వచ్చేస్తుంది. వారానికోపారి కొబ్బరిపాలు రాసుకుని ఓ అరగంట అలా ఉంచేసి తలస్నానం చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి. మెరిసే చర్మం కోసం రోజుకు ఐదుసార్లు పండ్లు, ఆకుకూరలు, నట్స్ తీసుకోవాలి. రక్త సరఫరా మెరుగుదల కోసం, చక్కని జీవక్రియ కోసం, వ్యాయామాలు చేయాలి.

చేతులు, పాదాలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రపోయే ముందు క్రీమ్‌తో చక్కగా మసాజ్ చేయాలి. పెడిక్యూర్, మనిక్యూర్ చేయించుకోవాలి. నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. అంతర్జాతీయ బ్రాండ్స్ వాడితే రసాయనాల ప్రభావం ఏమీ ఉండదు. కాస్త శరీరం పట్ల శ్రద్ధ తీసుకుంటే ప్రసవం తర్వాత వచ్చిన శారీరక మార్పులు చాలా తొందరగా మాయం చేసి పూర్వపు రూపం పొందొచ్చు. పాపాయిని కన్న మొహం సంతోషంతో ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుదన్న మాట నిజం!

Hormones change the body shape
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News