మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల కేటగిరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పో లింగ్ అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎం ఐ ఎం, కాంగ్రెస్ అవగాహనతో ఎమ్మెల్సీ సీటు ను ఎంఐఎం ఏకగ్రీవంగా ఎగురేసుకుపోతుందని భావించిన రాజకీయ వర్గాలు ఇప్పుడు బి జెపి కూడా పోటీలో నిలవడంతో గెలుపు ఎవరిదనేది ప్రధానంగా చర్చ మొదలైంది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థ కేటగిరీ ఎమ్మెల్సీలో బిజెపికిగానీ, బిఆర్‌ఎస్‌కు గానీ పూర్తిస్థాయి లో బలం లేదు. దీంతో వీరు పోటీలో నిలవరనేది ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్, ఎంఐఎంలు అవగాహనతో ఎమ్మెల్సీని మరోమారు ఎంఐఎంకు దక్కుతుందని భావిస్తూ వ స్తున్నారు.అయితే, నామినేషన్లకు చివరి రోజు న బిజెపి నామినేషన్ దాఖలు చేయడంతో ఓటింగ్ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం స్థా నిక సంస్థల కేటగిరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థలు జిహెచ్‌ఎంసి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. కంటోన్మెంట్ బో ర్డుకు ఎన్నికలు జరగనందున సభ్యులెవ్వరూ లేరు. ఇక జిహెచ్‌ఎంసిలో హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కార్పోరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో బిజె పి, బిఆర్‌ఎస్‌లకు ఎంఐఎం పార్టీకన్నా తక్కువగా ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా లే రు. ఇక ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా రాజ్యసభ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక్క ఎంపీ ఉన్నా రు.
దీంతో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. లోకల్ బాడీ కేటగిరీ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ సీటును గెలుచుకునేందుకు బీజెపి రంగంలోకి దిగినట్టు చర్చ మొదలైంది. ఈ ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజెపిలు అంతర్గతంగా చర్చించుకున్నాకనే బీజెపి పోటీలోకి వచ్చినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు హైదరాబాద్ జిల్లాలో కార్పొరేటర్లు 20 మంది, 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం ఓటర్లు 31మంది ఉన్నారు. బీజెపి నుంచి 20 మంది కార్పోరేటర్లు, 6 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు మొత్తం ఓటర్లు 26 మంది బలం ఉంది. ఎంఐఎం పార్టీకి కార్పొరేటర్లు 41 మంది, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపి, ఒక ఎమ్మెల్సీ మొత్తం ఓటర్లు 50 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులు 5 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ జరిగితే ఎంఐఎం గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, బీజెపి పోటీకి దిగడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. మొత్తం ఓటర్లుగా 112 మంది ఉండగా ఇందులో కార్పొరేటర్లు 81 మంది, ఎక్స్ అఫిషియో సభ్యులు 31 మంది ఉన్నారు. అభ్యర్థి గెలవాలంటే 57 ఓట్లు రావాల్సి ఉంది. ఇటు ఎంఐఎంకు 50 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 6 మంది ఉండటంతో ఈ రెండు పార్టీలు ఈపాటికే అవగాహనతో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్, ఐఎంఎంలు కలిస్తే 56 ఓట్లు, బీజెపి బీఆర్‌ఎస్‌లు కలిస్తే 56 ఓట్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, కొందరు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్, బీజెపిల నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన విషయం తెలిసిందే.
బీజెపి రంగంలోకి దిగడంతో..
ఎమ్మెల్యే కేటగిరీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజెపి పోటీకి దిగలేదు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు కావాల్సి ఉండగా.. 25 మంది ఓటర్లున్న బీజెపి పోటీలోకి దిగడం రాజకీయ వర్గాలను కాస్తంత ఆలోచనల్లోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌తో బీజెపి చర్చించిన అనంతరమే బీజెపి పోటీలోకి వచ్చినట్టు, ఈ రెండు పార్టీల ఓట్లను లెక్కించుకుని మరీ రంగంలోకి చేరినట్టు తెలుస్తుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే ఓట్లు 56గానూ ఉన్నాయి. అయితే, ఆ రెండు, ఈరెండు పార్టీల బలాబలాలు మాత్రం సమంగా కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఓట్లు క్రాస్ జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.
క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు..
ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఇరు పార్టీలకు క్రాస్ ఓటింగ్ బెంగపట్టుకుంది. పార్టీ విప్ జారీచేసినా.. సభ్యులు ఎవరికి ఓటు వేస్తారనేది సందేహాన్ని రేకెత్తిస్తుంది.