Sunday, April 28, 2024

బిజెపి నాయకులు విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే బిజెపి నేతలు మోడీని ప్రశ్నించగలుగుతారా?
బిఆర్‌ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి నాయకులు అసలు విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని బిఆర్‌ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అసలు మీ యాత్రలో తమ పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం తెస్తారు..? ఏం చేశారో ఒక్క రోజైనా చెబుతున్నారా..? అని బిజెపి నేతలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బ్రహ్మాండంగా సాయం చేసి ఉంటే.. సాధారణ ప్రచారంతోనే ఓట్లు రావాలని కదా..? అని ప్రశ్నించారు. ఖాళీగా ఉంటే రోజూ తన్నుకు చస్తున్నారనే.. ఇలా ఏదో ఒక పనిలో పెడితే కొద్దిగా నయమని యాత్రలు చేయమని అధిష్ఠానం సూచించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ భవన్‌లో శనివారం రావుల శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పనైపోయిందంటూ బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు రిలవెన్స్ లేదని.. ఒక్క సీటు కూడా గెలవదని వారం రోజులుగా బిజెపి నాయకులు పదే పదే అంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. తాము బలహీనం అయ్యామని అనుకుంటే.. రోజు తమపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో బిజెపి గెలవలేదని.. నగరంలో రాజాసింగ్ మినహా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ బిఆర్‌ఎస్ రిలవెంట్ కాదని కిషన్‌రెడ్డి అనడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ బలహీనమైందని బండి సంజయ్ అంటున్నారని, బిఆర్‌ఎస్ బలహీనమైతే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌పై ఎలా ఓడిపోయావని బండి సంజయ్‌ను నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో సింగిల్ సీటు సాధించని బిజెపి నాయకులు తమను విమర్శించడమేంటని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడేది బిఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే అని స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్యనే పోటీ
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే బిజెపి నేతలు నరేంద్ర మోడీని ప్రశ్నించగలుగుతారా? అని రావుల ప్రశ్నించారు. ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, నిమ్స్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, విభజన హామీలు ఏవీ సాధించలేదని.. రాష్ట్ర బిజెపి నేతల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పేరులో విజయ సంకల్పం ఉంటే సరిపోదని.. దాంట్లో ప్రజా ప్రయోజనం ఉండాలని పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీల రిలవెన్స్ లేదని చెప్పే బిజెపి నాయకులు ప్రాంతీయ పార్టీలతో పొత్తులెందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్యనే పోటీ అని, బిజెపికి గతంలో వచ్చిన నాలుగు సీట్లు మళ్లీ వస్తే గొప్ప అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News