Monday, May 20, 2024

సీట్ల కొరత..ఛార్జీల వాత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు (ఈ నెల 13వ తేదీన) ఒకే రోజు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఓటు వేసేందు కు తమ ఇళ్లకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు ప్రకటించగా ఆర్టీసి కూడా ప్ర త్యేక బస్సులను నడిపిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రైళ్లు, బస్సు ల్లో రిజర్వేషన్‌లు నిండిపోగా ప్రైవేటు బస్సుల్లో, విమానాల్లో అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. నెల రోజుల ముందే రైల్వే రిజర్వేష న్లు ముగియడంతో వందల సంఖ్యలో  వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసిలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా వాటిలోనూ రిజర్వేషన్‌లతో సీట్లన్నీ నిండిపోయాయి. అదనపు బస్సులు నడపలేని కారణంగా ఎపిఎస్ ఆర్టీసి ఎక్స్‌ప్రెస్‌లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు.

కాకినాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లలో వెయిటింగ్….
హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్‌లు నిండుకోవడంతో పాటు వెయిటింగ్ లిస్ట్ కూడా దొరక్క పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నెల్లూరు, తిరుపతి వైపు వెళ్లే రహదారిలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 10, 11 తేదీల్లో వందలాది దూరప్రాంత రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు టిఎస్ ఆర్టీసి అదనపు బస్సులను నడుపుతోంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎండి సజ్జనార్ తెలిపారు.

వరుస సెలవుల నేపథ్యంలో…
గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 46.68 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఎపి వాసులు ఎక్కువగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం 60 లోపే ఉంది. ఇది కాకుండా ఈసారి సోమవారం ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్‌కు ముందు రెండో శనివారం, ఆదివారం, పోలింగ్ రోజు (సోమవారం) కావడంతో ప్రభుత్వ, ఐటీ, బ్యాంకు ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో రైళ్లు, బస్సులు సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు బస్సుల యజమానులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక విమానయాన సంస్థలు సైతం చార్జీలను 20 నుంచి 30 శాతం పెంచినట్టుగా తెలిసింది. ప్రస్తుతం వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలకు మిగతా రోజుల్లో కంటే ఈ ఎన్నికల సందర్భంగా అదనంగా వసూల్ చేస్తున్నట్టుగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News