Monday, July 22, 2024

సమరోత్సాహంతో టీమిండియా

- Advertisement -
- Advertisement -

నేడు అఫ్గాన్‌తో సూపర్-8 తొలి పోరు

బార్బడోస్: టి20 ప్రపంచకప్ సూపర్8లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగే గ్రూప్1 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ సూపర్ సిక్స్‌లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇక అఫ్గానిస్థాన్ కూడా లీగ్ దశలో మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్8కు అర్హత సాధించింది. అయితే భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం అఫ్గాన్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ శర్మ సేన బలోపేతంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

అయితే లీగ్ దశలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో అతను ఎలా ఆడతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈసారి కూడా కెప్టెన్ రోహిత్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిలు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు వీలుంటుంది. ఈ స్థితిలో ఇటు రోహిత్ అటు కోహ్లిలు ఈ మ్యాచ్‌లో జట్టుకు చాలా కీలకంగా మారారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, జడేజాలు కూడా తమ తమ బ్యాట్‌లకు పనిచెప్పక తప్పదు.

కీలకమైన ఈ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. సూర్యకుమార్, రిషబ్ పంత్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. దూకుడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే వీరిద్దరూ తమ మార్క్ షాట్లతో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. టి20 ఫార్మాట్‌లో కళ్లు చెదిరే రికార్డును కలిగిన సూర్య ఈసారి కూడా జట్టుకు చాలా కీలకమని చెప్పాలి. రిషబ్, దూబె, హార్దిక్, జడేజాలు కూడా తమవంతు సహకారం అందించాల్సి ఉంటుంది. దూబె, హార్దిక్, జడేజా, అక్షర్ వంటి ఆల్‌రౌండర్లు ఉండడం భారత్‌కు సానుకూల అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, చాహల్, జడేజా, హార్దిక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు అఫ్గానిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. రహ్మనుల్లా, ఇబ్రహీం, నైబ్, అజ్మతుల్లా, మహ్మద్ నబి, నజీబుల్లా, కె ప్టెన్ రషీద్, ఫరూఖి, నవీనుల్ హక్ తదితరులతో అఫ్గాన్ పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News