Thursday, April 25, 2024

గెలిచి తీరాల్సిందే

- Advertisement -
- Advertisement -

గెలిచి తీరాల్సిందే
టీమిండియాకు పరీక్ష
సిరీస్‌పై బంగ్లాదేశ్ కన్ను
నేడు రెండో వన్డే
ఢాకా: ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో పోరాడి ఓడిన టీమిండియాకు బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే రెండో మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి రోహిత్ సేన ముందు మరో మార్గం లేకుండా పోయింది. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో గెలిచిన బంగ్లాదేశ్ ఈసారి కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్లకు చెందిన బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈసారి కూడా బౌలర్లే ఆయా జట్లకు కీలకంగా మారారు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తే ఈ మ్యాచ్‌లో కూడా తక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశాలున్నాయి.

ఓపెనర్లే కీలకం
మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో రోహిత్ బాగానే ఆడినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఇక ధావన్ అయితే ఏడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కూడా విఫలమైతే ధావన్‌కు రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. ఇలాంటి స్థితిలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన స్కోరును సాధించాల్సిన బాధ్యత ధావన్‌పై ఉంది. అందులో అతను ఎంతవరకు సఫలమవుతాడో వేచి చూడక తప్పదు. ఇక రోహిత్ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంది.

అంతేగాక వన్‌డౌన్‌లో వచ్చే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. తొలి మ్యాచ్‌లో కోహ్లి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని నుంచి జట్టు భారీ స్కోరును ఆశిస్తోంది. ఇదిలావుంటే తొలి మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన కెఎల్ రాహుల్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. మిడిలార్డర్‌లో దిగుతున్న రాహుల్ మరోసారి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్, దీపక్ చాహర్ తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో వీరంత విఫలం కావడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణిస్తే టీమిండియాకు విజయం అసాధ్యమేమీ కాదు. బౌలర్లు జోరుమీదుండడం జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పొచ్చు.

ఆత్మవిశ్వాసంతో
ఇక ఆతిథ్య బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో కానీ బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ లిటన్ దాస్‌తో పాటు సీనియర్లు ముష్ఫుకుర్ రహీం, షకిబ్, మహ్మదుల్లా, మెహదీ హసన్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరంత తమ స్థాయికి తగ్గ ఆటను కనబరిస్తే సిరీస్‌ను సొంతం చేసుకోవడం బంగ్లాదేశ్‌కు నల్లేరుపై నడకేనని చెప్పక తప్పదు.

IND vs BAN 2nd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News