Thursday, June 13, 2024

ఇండియా కూటమికి 295కి పైగా సీట్లు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి 295కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా తాము ఈ అంకెకు చేరుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తన నివాసంలో శనివారం ఇండియా కూటమికి చెందిన అగ్రనాయకులతో సమావేశమైన అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ రెండున్నర గంటలపాటు సమావేశమయ్యామని, ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు, తమ పార్టీలకు ఇవ్వాల్సిన ఆదేశాలతోసహా అనేక అంశాల గురించి చర్చించుకున్నామని తెలిపారు. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనున్నది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా తమ సొంత అంచనాలను చెప్పేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, అయితే తాము ప్రజలకు వాస్తవాన్ని వివరిస్తామని ఆయన చెప్పారు. ఇండియా కూటమికి 295కి పైగా స్థానాలు లభిస్తాయని, తమ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఈ అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు. ఇది ప్రజల సర్వేనని, ఈ సమాచారాన్ని ప్రజలే తమ నాయకులకు ఇచ్చారని ఖర్గే తెలిపారు. ప్రభుత్వ సర్వేలు కూడా ఉన్నాయని, వారి మీడియా మిత్రులు అంకెలను పెంచి తమకు అనుకూలంగా చెప్పుకుంటాయని ఆయన విమర్శించారు.

అందుకే వాస్తవాల గురించి ప్రజలకు తాము చెప్పదలచామని ఆయన వివరించారు. ఫామ్ 17సి గురించి కూడా తమ పార్టీల కార్యకర్తలకు ఇండియా కూటమి పార్టీలు ఆదేశాలు ఇచ్చాయని, ఎన్నిక సర్ఫిఫికెట్ తీసుకునేంత వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావద్దని వారికి చెప్పామని ఖర్గే తెలిపారు. ఒకపక్క ఏడదవ దశ ఎన్నికల కౌంటింగ్ జరగుతుడగా కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, సిపిఎం, సిపిఐ, డిఎంకె, ఆప్, ఆర్‌జెడి, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(శరద్ పవార్)కి చెందిన సీనియర్ నాయకులు ఖర్గే నివాసంలో శనివారం మధ్యాహ్నం సమావేశమై చర్చలు జరిపారు. తమ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున తమ పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరుకారని టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సమావేశంలో పాల్గొనలేదు. సమావేశానికి హాజరైన నాయకులలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, చంపయి సోరెన్, కల్పనా సోరెన్, టిఆర్ బాలు, ఫరూఖ్ అబ్దుల్లా, డి రాజా, ముకేష్ సాసహాని ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News