Tuesday, October 15, 2024

త్వరలోనే జన గణన

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ సన్నాహకాలు ఆరంభం
కుల గణనపై ఇంకా నిర్ణయం లేదు
2020 ఏప్రిల్ 1న మొదలు కావలసిన సెన్సస్
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా

న్యూఢిల్లీ : పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించవలసిన జన గణన కోసం ప్రభుత్వం సన్నాహకాలు మొదలు పెట్టిందని, కానీ ఆ ప్రక్రియలో భాగంగా కుల గణనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. పేరు వెల్లడించరాదనే షరతుపై ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, దశాబ్దపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలియజేశారు. భారత్ 1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు సేకరిస్తున్నది.ఈ దశాబ్దంలో తొలి దశ జన గణన 2020 ఏప్రిల్ 1న మొదలు కావలసి ఉన్నది. కానీ, కొవిడ్19 మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియను వాయిదావేయవలసి వచ్చింది. నిరుడు పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలును కూడా దశాబ్దపు జన గణనతో ముడిపెట్టారు. ఆ చట్టం అమలులోకి వచ్చిన తరువాత నమోదైన తొలి సెన్సస్‌లోని సంబంధిత గణాంకాలు ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే చట్టం అమలులోకి వస్తుంది.

దశాబ్దపు జన గణనలో కులంపై ఒక కాలం చేరుస్తారా అని ప్రశ్నించినప్పుడు ‘దానిని ఇంకా నిర్ణయించవలసి ఉంది’ అని ఆ ప్రతినిధి సమాధానం ఇచ్చారు. కాగా, కుల గణన కోసం రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. తాజా డేటా లేని కారణంగా ప్రభుత్వ సంస్థలు 2011 జన గణన డేటా ప్రాతిపదికపై విధానాలు రూపొందించడం, సబ్సిడీలు కేటాయించడం చేస్తున్నాయి. జన గణనలో ఇళ్ల జాబితారూపకల్పన దశను, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్)ను అప్‌డేట్ చేసే ప్రక్రియను 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించవలసి ఉంది. కానీ దానిని కొవిడ్19 మహమ్మారి వ్యాప్తి వల్ల వాయిదా వేశారు. జన గణనకు, ఎన్‌పిఆర్ విన్యాసానికి రూ. 12 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఖర్చు కావచ్చునని అధికారులు సూచించారు.

ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైనా ఇది స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని పౌరులకు ఇచ్చే తొలి డిజిటల్ సెన్సస్ కాగలదు. ప్రభుత్వం తరఫున వివరాల సేకరణ కార్యకర్తల ద్వారా కాకుండా స్వయంగా సెన్సస్ ఫారమ్ నింపే హక్కు కోరుకుంటున్న పౌరులకు ఎన్‌పిఆర్‌ను తప్పనిసరి చేశారు. అందు కోసం సెన్సస్ ప్రాధికార సంస్థ ఒక స్వీయ వివరాల నమోదు పోర్టల్‌కు రూపకల్పన చేసింది. అయితే, ఆ పోర్టల్‌ను ఇంకా ప్రారంభించవలసి ఉంది. స్వీయ వివరాల నమోదు సమయంలో ఆధార్ లేదా మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా సేకరిస్తారు. అడగవలసి ఉన్న 31 ప్రశ్నలను రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ సిద్ధం చేయడమైంది.

కుటుంబానికి ఒక టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేక స్మార్ట్‌ఫోన్, బైసికిల్, స్కూటర్ లేక మోటార్‌సైకిల్ లేక మోపెడ్ ఉన్నాయా, వారికి కారు, జీప్ లేక వ్యాన్ ఉన్నదా అనే ప్రశ్నలు వాటిలో ఉన్నాయి. ఇంటిలో వాడే తృణధాన్యాలు ఏమిటి, మంచినీటి ప్రధాన వనరు, లైటింగ్ ప్రధాన వనరు., టాయిలెట్ సౌకర్యం, టాయిలెట్ తరహా, వ్యర్థ జలం ఎలా బయటకు పంపుతారు, స్నానం సౌకర్యం లభ్యత, కిచెన్, ఎల్‌పిజి/పిఎన్‌జి కనెక్షన్, వంటకు వాడే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ లభ్యత వంటివి కూడా పౌరులను అడగనున్నారు. ఇంటిలో నేల, గోడ. పైకప్పునకు ప్రధానంగా ఉపయోగించిన వస్తువు, ఇంటి పరిస్థితి, ఇంటిలో మామూలుగా నివసించే వ్యక్తుల సంఖ్య, ఇంటి యజమాని ఒక మహిళా?, ఇంటి పెద్ద ఎస్‌సి లేదా ఎస్‌టికి చెందినవారా, ఇంటిలో గల గదుల సంఖ్య, ఇంటిలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య వంటివి కూడా పౌరులను అడగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News