Tuesday, December 10, 2024

డిఎపి ఎరువుకు గాజా యుద్ధం బ్రేక్

- Advertisement -
- Advertisement -

రబీసాగు విస్తీర్ణం గత ఏడాది కన్నా 7.4 శాతం తగ్గింది. గత ఏడాది నవంబర్ 8 నాటికి 157.73 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉండగా, ఈ ఏడాది 146.06 లక్షల హెక్టార్లలోనే సాగు విస్తీర్ణం కనిపిస్తోంది. సెనగలు, ఆవాలు, గోధుమ, జొన్నలు సాగు విస్తీర్ణం 7 శాతం వరకు తగ్గింది. గోధుమ 15.5 శాతం, సెనగలు 10.4 శాతం, ఆవాలు 1.6 శాతం, జొన్నలు 25.1 శాతం గత ఖరీఫ్ సీజన్ సాగు కన్నా ఈ రబీ సీజన్‌లో తక్కువ సాగు విస్తీర్ణానికి పరిమితం అయ్యాయి. గోధుమ, ఆవాలు పంటల దిగుబడి అధికంగా సాధించాలంటే డై అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి) ఎరువులు విరివిగా వాడవలసి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ గాజా యుద్ధ సంక్షోభం డిఎపి ఎరువు కొరతకు దారి తీస్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో డిఎపి సరఫరా సమృద్ధిగా చేయాలంటూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై రైతులు ఒత్తిడి తెస్తున్నారు. డిఎపి మున్ముందు లభిస్తుందో లేదో అని రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల్లో ఆందోళనలకు దిగుతున్నారు.ఈ మూడు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా డిఎపి వినియోగం ఎక్కువే. పంటలకు డిఎపి విరివిగా వినియోగించడం పరిపాటిగా వస్తోంది. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డిఎపి బాగా నెరవేరుస్తుంది. కానీ ఈ రాష్ట్రాల రైతులను డిఎపి కొరత తీవ్రంగా వేధిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ యుద్ధం ప్రకంపనలు పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్‌బొల్లా, హూతీలు ఎర్రసముద్రంలో అంతర్జాతీయ సముద్ర మార్గం ద్వారా రవాణాకు తీరని ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. మధ్యధరా సముద్ర మార్గాన్ని సూయెజ్ కాలువ ద్వారా హిందూ మహాసముద్రానికి అనుసంధానం చేసేది ఎర్రసముద్రమే. ఈ ఎర్రసముద్రంపై యెమెన్‌లోని హూతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్రఅంతరాయం కల్పిస్తున్నారు. అదేపనిగా నౌకలపై దాడులకు దిగుతుండడంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా తగ్గిపోతోంది. ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న ఎర్రసముద్రం అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైనది. ఈ సముద్ర మార్గం ద్వారా ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా తదితర ప్రాంతాలకు, దేశాలకు భారత్ సరకు రవాణా చేస్తుంది. ఈజిప్టులోని సూయెజ్ కాలువ ద్వారా వెళ్లే ఈ మార్గం విదేశీ వాణిజ్యానికి కీలకం. ఏటా సూయెజ్ కెనాల్ మార్గంలో సుమారు 17,000 వరకు నౌకలు పయనిస్తుంటాయి. అయితే రెండేళ్లుగా జరుగుతున్న రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు, ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతి దిగుమతుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ మద్దతుతో హూతీ తిరుగుబాటుదారులు హింసకు దిగుతున్నారు. ఫలితంగా 2023 నవంబరు నుంచి ఈ మార్గం ద్వారా పయనించే అన్ని నౌకలపైనా దాడులు కొనసాగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఎర్రసముద్రంలో అలజడి తగ్గే అవకాశం కనిపించకపోవడంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మార్గాన్ని వినియోగిస్తున్నారు. దీనివల్ల సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతోపాటు గమ్యం చేరడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఫలితంగా రవాణా రుసుములు, వ్యయాలు మరింత పెరుగుతాయి. ప్రపంచంలోని దిగ్గజ షిప్పింగ్ కంపెనీలు సూయెజ్ కాలువ మార్గాన్ని వాడటం తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు ఎరువులు అందడం కష్టసాధ్యమవుతోంది. భారత్ ఏటా 100 లక్షల టన్నుల డిఎపిని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో డిఎపి లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులకు దాటింది.ఫలితంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డిఎపి కష్టాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ నవంబర్ సీజన్‌లో కావలసినంత ఎరువును అందుబాటులో ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. భారత్ 2019 20లో 48.7 లక్షలు, 202324 లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపిని దిగుమతి చేసుకుంది. డిఎపికి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటాసియం (ఎన్‌పిజి) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరల వల్ల కూడా భారీగా డిఎపిని కేంద్రం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 2023 సెప్టెంబరులో టన్ను డిఎపి 589 డాలర్లు ఉంటే, ఈ సెప్టెంబరు నాటికి ధర 632 డాలర్లకు పెరిగింది. అయినా కేంద్రం రాయితీ ద్వారా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 202021 సీజన్ నుంచి 50 కిలోల బస్తా ధర రూ, 1350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్టు, మొరా కో, చైనాల నుంచి కూడా డిఎపిని దిగుమతి చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News