Monday, April 29, 2024

దర్జాగా సెమీస్‌కు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుసగా ఏడో నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో లంక ఇంటిదారి పట్టింది. గురవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

లంక జట్టులో ఐదుగురు బ్యాటర్లు సున్నాకే పెవిలియన్ చేరడం విశేషం. భారత బౌలర్లలో మహ్మద్ షమి అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన షమి 18 పరుగులు మాత్ర మే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ 16 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. శ్రీలంక జట్టులో కసు న్ రజిత (14), మహీశ్ తీక్షణ 12 (నాటౌ ట్), ఎంజిలో మాథ్యూస్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు.

ఆరంభం నుంచే..
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ తొలి బంతికే జస్‌ప్రిత్ బుమ్రా భారత్‌కు తొలి వికెట్ అదించాడు. బుమ్రా వేసిన అద్భుత బంతికి ఓపెనర్ పథుమ్ నిసాంకా ఎల్బీగా వెనుదిరిగాడు. సిరాజ్ కూడా తన తొలి బంతికే వికెట్‌ను తీశాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నెను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ కుశాల్ మెండిస్ (1)ను కూడా సిరాజ్ వెనక్కి పంపాడు. అంతేగాక రెండో మొదటి బంతికే సిరాజ్ మరో వికెట్ పడగొట్టాడు. సమరవిక్రమ(0)ను కూడా సిరాజ్ పెవిలియన్‌దారి చూపించాడు. దీంతో లంక 3 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
షమి మ్యాజిక్…
ఆ తర్వాత లంక పతనాన్ని శాసించే బాధ్యతను షమి తనపై వేసుకున్నాడు. తన తొలి ఓవర్‌లోనే షమి వరుసగా రెండు వికెట్లను పడగొట్టాడు. చరిత్ అసలంక (1), దుశాన్ హేమంత (0)లను షమి ఔట్ చేశాడు. అంతేగాక మాథ్యూస్ (12), దుష్మంత చమిరా (0), కాసున్ రజిత (14)లను కూడా షమి పెవిలియన్ బాట పట్టించాడు. ఇక మధుశంకా (5)ను జడేజా ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 55 పరుగుల వద్దే ముగిసింది.

ఆదుకున్న కోహ్లి, గిల్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు గిల్ అటు కోహ్లి అద్భుత షాట్లతో స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన గిల్ 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించాడు. ఆ వెంటనే కోహ్లి కూడా వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 11 ఫోర్లతో 82 పరుగులు చేశాడు.

శ్రేయస్ జోరు..
తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్ తనపై వేసుకున్నాడు. అతనికి రాహుల్ (21) అండగా నిలిచాడు. లంక బౌలర్లను హడలెత్తించిన శ్రేయస్ 56 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. చివర్లో జడేజా (35) కూడా ధాటిగా ఆడడంతో భారత్ స్కోరు 357 పరుగులకు చేరింది. లంక బౌలర్లలో మధుశంకా ఐదు వికెట్లు తీశాడు. కాగా, లంకపై భారీ విజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News