Tuesday, April 30, 2024

భారత్‌కు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ పోరుకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ రోహిత్ సేన జయకేతనం ఎగుర వేసింది. సెమీ ఫైనల్లో బలమైన న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఫైనల్‌కు చేరే క్రమంలో వరుసగా పది మ్యాచుల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. అయితే తుది సమరంలో ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థితో అసలైన పోరు ఎదురు కానుంది. లీగ్ దశలో కంగారూలను ఓడించడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశమే. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. వార్నర్, ట్రావిస్ హెడ్, స్మిత్, మిఛెల్ మార్ష్, లబుషేన్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, జంపా, మ్యాక్స్‌వెల్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే.

ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని గెలుచుకోవడం టీమిండియాకు అనుకున్నతం తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడికి గురి కావడం భారత్‌కు అనవాయితీగా మారింది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. కానీ ప్రస్తుతం టీమిండియా జోరును చూస్తుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. రోహిత్, గిల్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నారు. కోహ్లి, శ్రేయస్‌లు వరుస శతకాలతో చెలరేగి పోతున్నారు. రాహుల్ కూడా జోరుమీదుండడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక షమి బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఇప్పటికే 23 వికెట్లు పడగొట్టి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా, జడేజా, సిరాజ్, కుల్దీప్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒత్తిడిని కాస్త తట్టుకుని ముందుకు సాగితే మూడో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News